పెళ్లి బంధంకు వెనుకడుగు వేస్తున్న తెలుగు యువత 

పెళ్లి బంధంకు వెనుకడుగు వేస్తున్న తెలుగు యువత 

ఐటీ హబ్ అయిన హైదరాబాద్‌తో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో యువత పెళ్లి అనే బంధంలోకి అడుగుపెట్టడానికి సముఖత చూపించడం లేదు. నగరంలో ఆకాశాన్నంటుతున్న జీవన వ్యయం, స్వేచ్ఛను కోల్పోతామనే భయాలు, మారుతున్న సామాజిక దృక్పథాలు, సోషల్ మీడియా ప్రభావం ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

హైదరాబాద్‌ వంటి మహానగరాల్లో మధ్యతరగతి, ఉద్యోగ వర్గాల నెలసరి ఖర్చులు ఐదేళ్ల క్రితంతో పోలిస్తే భారీగా పెరిగాయి. నగరంలో అద్దెలు ఆకాశాన్నంటుతున్నాయి. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మదాపూర్ పరిసరాల్లో ఒక మోస్తరు డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అద్దె కనీసం రూ.25,000 నుండి రూ35,000 వరకు పలుకుతోంది.  ఒంటరిగా ఉంటే పీజీ లేదా రూమ్ షేరింగ్‌తో రూ.10,000 లోపు ఖర్చు ముగుస్తుంది.

అదే పెళ్లి చేసుకుంటే అద్దె, రేషన్, కరెంట్ బిల్లులు, వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ కలిపి నెలకు కనీసం రూ. 50,000 దాటుతోంది. దీంతో “నా జీతం నాకే సరిపోవడం లేదు.. ఇక భార్యాపిల్లలను ఎలా పోషించాలి?” అనే ఆలోచన యువతలో బలంగా నాటుకుపోతోంది. ఆధునిక యువతీ యువకుల్లో “వ్యక్తిగత స్వేచ్ఛ” అనే భావన పెరిగింది. పెళ్లి చేసుకుంటే భాగస్వామి కోసం, వారి కుటుంబం కోసం రాజీ పడాల్సి వస్తుందని భావిస్తున్నారు. ఆఫీస్ టైమింగ్స్, నైట్ షిఫ్ట్‌లు, వీకెండ్ పార్టీలు, నచ్చిన చోటికి సోలో ట్రిప్స్ వేయడం వంటి వాటికి పెళ్లి ఆటంకంగా మారుతుందని నమ్ముతున్నారు.

ఇటీవలి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, ప్రముఖ మ్యాట్రిమోనియల్ సైట్లు విడుదల చేసిన నివేదికల ప్రకారం పెళ్లిళ్ల రేటు గణనీయంగా తగ్గుతుంది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పురుషులకు 25, మహిళలకు 22 ఏళ్లకే పెళ్లిళ్లు అయ్యేవి. కానీ ప్రస్తుత నివేదికల ప్రకారం పురుషులలో సగటు వివాహ వయసు 30-32 ఏళ్లకు, మహిళల్లో 27-29 ఏళ్లకు చేరింది. 

గత మూడేళ్లలో తెలుగు రాష్ట్రాల్లోని సబ్-రిజిస్ట్రార్ ఆఫీసుల్లో వివాహ రిజిస్ట్రేషన్ల సంఖ్య (గత ఏళ్లతో పోలిస్తే) దాదాపు 12 నుండి 15 శాతం తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. చుట్టుపక్కల జరుగుతున్న విడాకులు, భార్యాభర్తల గొడవలను చూసి “ఈ గొడవలన్నీ మనకెందుకు.. హ్యాపీగా సింగిల్‌గా ఉందాం” అనే ‘బంధాల పట్ల భయం’ పెరిగిపోతోంది.

పిల్లల ఆలోచనల్లో వచ్చిన ఈ మార్పులు తల్లిదండ్రులను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. వయసు దాటిపోతున్నా పిల్లలు పెళ్లి పేరు ఎత్తితేనే చిరాకు పడటం, కెరీర్ లేదా ఒంటరి జీవితానికే ప్రాధాన్యత ఇవ్వడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  వృద్ధాప్యంలో పిల్లలకు తోడు ఎవరనే భయం ఒకవైపు, వంశాభివృద్ధి ఆగిపోతుందనే ఆందోళన మరోవైపు పెద్దలను వేధిస్తోంది.