బరాసత్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి తాను టికెట్ ఆశించానంటూ చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలకు గాను బహిరంగ క్షమాపణ కోరుతూ, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) అధినేత్రి మమతా బెనర్జీ, ఇతర నాయకులపై ఆ పార్టీ ఎంపీ కాకోలీ ఘోష్ దస్తీదార్ కుమారుడు డాక్టర్ వైద్యనాథ్ ఘోష్ దస్తీదార్ ఆదివారం నాడు దావా వేశారు.
మమతా బెనర్జీ, కళ్యాణ్ బెనర్జీ, సౌగతా రాయ్, మహువా మొయిత్రా, సోనాలి గుహలకు రాసిన ఒక లేఖలో ఆ ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమని వైద్యనాథ్ పేర్కొన్నారు. వృత్తిరీత్యా మానసిక వైద్యుడైన వైద్యనాథ్, తాను, తన తల్లి కాకోలీ తరచుగా మద్యం సేవిస్తారన్న సోనాలి ఆరోపణలను కూడా ఖండించారు. అవి ‘పూర్తిగా అవాస్తవం’ అని స్పష్టం చేశారు.
వారిపై దావా వేయాలని నిర్ణయించుకున్నానని, సోమవారం నాడు ఆ ఐదుగురికీ నోటీసు పంపనున్నట్లు ఆయన తెలిపారు. “నేను బహిరంగ క్షమాపణ, ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరాను,” అని వైద్యనాథ్ ఆ లేఖలో పేర్కొన్నారు. “సరైన స్పందన లేని పక్షంలో, పరువు నష్టం దావాతో సహా చట్టం ప్రకారం నాకు అందుబాటులో ఉన్న న్యాయపరమైన మార్గాలను అనుసరించాలని భావిస్తున్నాను” అని తెలిపారు.
“నా క్లయింట్‌కు అంతర్గత రాజకీయ వివాదాలు, గొడవలు లేదా ప్రచారాలలో పాల్గొనడం లేదా వాటితో సంబంధం కలిగి ఉండటం పట్ల ఎలాంటి ఆసక్తి లేదు. అందువల్ల, రాజకీయ వ్యాఖ్యలు, ఊహాగానాలు లేదా బహిరంగ చర్చల సందర్భంలో తన పేరు, గుర్తింపు, వృత్తిపరమైన నేపథ్యం లేదా కుటుంబ పరిస్థితులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపయోగించడాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు,” అని ఆ లేఖ పేర్కొంది. టీఎంసీ నాయకులు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరింది.
కాగా, అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పార్టీపై తన పట్టును బిగించేందుకు చేపట్టిన భారీ సంస్థాగత మార్పులలో భాగంగా, శాసనసభ్యురాలు సాయోని ఘోష్‌ను టీఎంసీ యువజన విభాగం అధ్యక్షురాలిగా మమతా బెనర్జీ తిరిగి నియమించిన వారం రోజులకే, ఆ పదవి నుండి ఆమెను తొలగించి ఆ స్థానంలో యువ నాయకుడు అర్నబ్ బెనర్జీని నియమించారు. అలాగే, కోల్‌కతా దక్షిణ ఎంపీ మాలా రాయ్ స్థానంలో నాడియా జిల్లాలోని కలిగంజ్ టీఎంసీ ఎమ్మెల్యే అలిఫా అహ్మద్‌ను మహిళా విభాగం అధ్యక్షురాలిగా పార్టీ నియమించారు.
ప్రస్తుతం పార్టీలో నెలకొన్న తీవ్ర సంక్షోభం నేపథ్యంలో, ఘోష్, రాయ్ ఇద్దరూ లోక్‌సభలోని టీఎంసీ అసమ్మతి ఎంపీల వర్గంలో చేరారని భావిస్తున్నారు. తామే “అసలైన టీఎంసీ”గా గుర్తింపు కోరుతూ స్పీకర్ ఓమ్ బిర్లాకు లేఖ ఇచ్చేందుకు సోమవారం ఆయనను కలవనున్నట్లు ఈ అసమ్మతి నేతలు పేర్కొంటున్నారు.

More Stories
ఆధునిక ప్రపంచ సవాళ్లకు భారత్ లో శాశ్వత పరిష్కారాలు
టిఎంసి ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ అమిత్ షాతో భేటీ
పరిశోధన, ఆవిష్కరణలు భారత నాగరికతలో అంతర్భాగం