భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత స్థానం ‘సహేతుకం’

భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత స్థానం ‘సహేతుకం’
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లభించాలనే డిమాండ్ అత్యంత సహేతుకమైనదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) అధినేత రాఫెల్ మరియానో గ్రాస్సీ స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి తదుపరి సెక్రటరీ జనరల్ రేసులో అత్యంత కీలక అభ్యర్థిగా ఉన్న గ్రాస్సీ వియన్నాలో ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో  ఐక్యరాజ్యసమితి ప్రస్తుత నిర్మాణాన్ని మార్చాల్సిన అవసరాన్ని బలంగా సమర్థించారు. 
 
“భారత్ లాంటి దేశాలు ఈ రకమైన ఆకాంక్షను కలిగి ఉండటం కేవలం సహేతుకం మాత్రమే. ఎందుకంటే 1945 నాటి ప్రపంచం వేరు, ప్రస్తుత 2026 నాటి ప్రపంచం వేరు” అని ఆయన తెలిపారు. ఐక్యరాజ్యసమితి ప్రస్తుత నిర్మాణం పాతబడిపోయిందని, సమకాలీన వాస్తవాలకు అనుగుణంగా తక్షణ సంస్కరణలు అవసరమని భారత్ ఎప్పటి నుంచో చెప్తున్న వాదనతో ఆయన ఏకీభవించారు. 
 
అయితే ఒక దౌత్యవేత్తగా సమతుల్యతను పాటిస్తూ ఐరాస సెక్రటరీ జనరల్ పదవికి కొన్ని పరిమితులు ఉంటాయని, ఎవరికి సభ్యత్వం ఇవ్వాలనేది సభ్య దేశాల మధ్య విస్తృతమైన ఒకకాభిప్రాయంపైనే ఆధారపడి ఉంటుందని గుర్తుచేశారు. కానీ అధికారిక సభ్యత్వంతో సంబంధం లేకుండానే నేడు ప్రపంచంలో భారత్  ప్రభావం, ఆర్థిక, భౌగోళిక రాజకీయ బలం ఎవరూ తిరస్కరించలేని విధంగా పెరిగిందని ఆయన కొనియాడారు.

ప్రస్తుత యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ రెండో విడత పదవీ కాలం 2026 డిసెంబర్ 31తో ముగియనుంది. దీంతో 2027 జనవరి నుంచి కొత్త చీఫ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ రేసులో రాఫెల్ గ్రాస్సీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే ఈసారి ఐరాస చరిత్రలోనే మొదటి సారిగా ఒక మహిళా నేతకు ఈ అత్యున్నత పీఠాన్ని అప్పగించాలనే డిమాండ్ కూడా బలంగా ఉంది. 
 
చిలీ మాజీ అధ్యక్షురాలు మిచెల్ బాచెలెట్, సీనియర్ ఐరాస అధికారి రెబెకా గ్రిన్‌స్పాన్ వంటి మహిళా నేతలు ఈ రేసులో ఉన్నారు. అయినప్పటికీ అంతర్జాతీయ సంక్షోభాలను పరిష్కరించడంలో గ్రాస్సీకి ఉన్న అనుభవం ఆయన్ను పోటీలో ముందంజలో ఉంచింది. 2019 నుంచి ఐఏఈఏ అధినేతగా ఉన్న ఆయన ఇరాన్ అణు సంక్షోభంలో దౌత్యమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. 
 
అదేవిధంగా, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో జపోరిజ్ఝియా అణు కర్మాగారం వద్ద అణు భద్రతను పర్యవేక్షించడంలో కీలక మధ్యవర్తిగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకున్నారు. భారతదేశ అణు కార్యక్రమాలను, వ్యూహాత్మక వృద్ధిని రాఫెల్ గ్రాస్సీ ఎల్లప్పుడూ సమర్థిస్తూ వస్తున్నారు. భారతదేశ అణు ప్రయాణం ఎంతో నిర్మాణాత్మకంగా, స్పష్టమైన లాజికల్ విధానంతో సాగుతోందని ఆయన గతంలోనూ ప్రశంసించారు. 
 
భారతదేశ అణు ఇంధన విస్తరణ ప్రణాళికలను, విధాన సంస్కరణలను సమర్థిస్తూ, అణుశక్తి రంగంలో భారత్ ఒక అనివార్యమైన ప్రపంచ శక్తీ అని ఆయన పేర్కొన్నారు. “ఐఏఈఏలో నేను చేసినట్లే భవిష్యత్తులోనూ ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్‌తో కలిసి అత్యంత సన్నిహితంగా పనిచేయడం చాలా అవసరం” అని ఆయన చెప్పారు.