50 శాతం పెరిగిన కీలక కాన్సర్ ఔషధాల ధరలు

50 శాతం పెరిగిన కీలక కాన్సర్ ఔషధాల ధరలు

క్యాన్సర్‌ చికిత్సకు వాడే కీలకమైన ఔషధాల ధరలను 50 శాతం మేర కేంద్రం పెంచింది.  క్యాన్సర్‌ చికిత్సలో కీలకంగా వినియోగించే కార్బోప్లాటిన్‌, సిస్‌ప్లేటిన్‌ ఇంజెక్షన్‌ గరిష్ఠ ధరలను 50 శాతం మేర పెంచుతూ నేషనల్‌ ఫార్యాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌పీపీఏ) నిర్ణయించింది. 

వీటితో పాటు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ-టెటానస్‌ ఇమ్యూనోగ్లోబ్యులిన్‌ ఇంజెక్షన్లతో పాటు చిన్నారులకు ఇచ్చే మూడు కీలక వ్యాక్సిన్ల ధరలను కూడా పెంచింది.  ఎన్‌పీపీఏ తాజా నిర్ణయంతో కార్బోప్లాటిన్‌ 10 ఎంజీ/ఎంఎల్‌ ఇంజెక్షన్‌ గరిష్ఠ ధర మిల్లీ లీటర్‌కు రూ. 60.49 నుంచి రూ. 90.74కు పెరగ్గా, సిస్‌ప్లేటిన్‌ 1 ఎంజీ/ఎంఎల్‌ ఇంజెక్షన్‌ ధర మిల్లీ లీటర్‌కు రూ. 7.26 నుంచి రూ. 10.89కు పెరిగింది. 

సవరించిన ధరల అనంతరం యాంటీ-టెటానస్‌ ఇమ్యూనోగ్లోబ్యులిన్‌ 250ఐయూ ఇంజక్షన్‌ వయల్‌ ధర రూ.1,912.02కు, 500 ఐయూ వయల్‌ ధర రూ.2,881.19కు పెరిగింది. దేశంలో ఔషధాల కొరత ఏర్పడకుండా నివారించడానికి ఈ ధరలు పెంచినట్టు ప్రభుత్వం తెలిపింది. 

గరిష్ఠ ధరలను 50 శాతం వరకు పెంచేందుకు తనకు ఉన్న అసాధారణ అధికారాన్ని వినియోగించుకుని ఎన్‌పీపీఏ రెండు మొదటి శ్రేణి క్యాన్సర్‌ మందుల ధరలను అనూహ్యంగా పెంచినట్టు వివరించింది.  ఔషధాల ముడిసరుకుల ధరలు ఎక్కువగా పెరగడం వల్ల, కంపెనీలు క్యాన్సర్‌ ఔషధాల తయారీని తగ్గించాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో ఔషధాల కొరత ఏర్పడి రోగులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకే మందుల ధరలను పెంచినట్టు పేర్కొన్నాయి.