సమ్మక్క-సారక్క బ్యారేజీకి చత్తీస్‌గఢ్ సీఎం సానుకూల స్పందన

సమ్మక్క-సారక్క బ్యారేజీకి చత్తీస్‌గఢ్ సీఎం సానుకూల స్పందన
గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన సమ్మక్క-సారక్క బ్యారేజ్, సమ్మక్క సాగర్ ప్రాజెక్టు అనుమతుల సాధనకు సహకరించేందుకు  చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్‌సాయి సానుకూలంగా స్పందించారని తెలంగాణ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమా ర్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌కు వచ్చిన చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రితో పార్క్ హయత్‌లో మంత్రి రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారుల బృందంతో కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 

ఈ సమావేశంలో చత్తీస్‌గఢ్ తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన సమ్మక్క-సారక్క ప్రాజెక్టు గురించి సుదీర్ఘంగా చర్చించారు. ప్రాజెక్టు డిపిఆర్‌ను కేంద్ర జల సంఘం తుది పరిశీలనకు తీసుకెళ్లేందుకు అవసరమైన అభ్యంతర రహిత పత్రం -ఎన్‌ఓసీ జారీ చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రె డ్డి వినతిపత్రాన్ని ఛత్తీస్‌ఘఢ్ ముఖ్యమంత్రికి సమర్పించారు.

ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారని, అంశాన్ని సానుభూతితో పరిశీలిస్తామని హామీ ఇచ్చారని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత గోదావరి జలాల వినియోగం, పెండింగ్ నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తి, రైతాంగానికి శాశ్వత సాగునీటి భద్రత కల్పించడం వంటి అంశాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు.

సమ్మక్క-సారక్క బ్యారేజ్ తెలంగాణ రైతాంగానికి అత్యంత కీలకమైన ప్రాజెక్టు అని చెబుతూ ఈ పరిణామం సమ్మక్క-సారక్క ప్రాజెక్టు అనుమతుల ప్రక్రియలో కీలక మలుపుగా నిలుస్తుందని ఆయన  చెప్పారు. కేంద్ర జల సంఘంలోని అంతర్రాష్ట్ర వ్యవహారాల డైరెక్టరేట్ మినహా మిగతా అన్ని ప్రధాన డైరెక్టరేట్ల నుంచి ప్రాజెక్టుకు ఇప్పటికే అనుమతులు లభించాయని మంత్రి  వెల్లడించారు. ఎన్‌ఓసీ లేకపోవడం వల్ల మాత్రమే డిపిఆర్ తుది పరిశీలన నిలిచిపోయిన విషయాన్ని చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. 
 
ప్రాజెక్టు ముంపు, బ్యాక్‌వాటర్ ప్రభావిత ప్రాంతాలపై ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు ఇప్పటికే సంయుక్త సర్వే నిర్వహించారని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. మరింత కచ్చితమైన సర్వే కోసం చత్తీస్‌గఢ్ ప్రభుత్వం కోరిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందించిందని మంత్రి తెలిపారు. సర్వే ఖర్చుల కోసం రూ.9.883 కోట్లను 2026 ఏప్రిల్లో చత్తీస్‌గఢ్ జలవనరుల శాఖకు విడుదల చేసినట్లు ఆయన వివరించారు.