రెండు రోజుల్లో రెండోసారి అమెరికా దౌత్యవేత్తకు భారత్ సమన్లు

రెండు రోజుల్లో రెండోసారి అమెరికా దౌత్యవేత్తకు భారత్ సమన్లు
 
* హోర్ముజ్ జలసంధి వద్ద భారతీయ నావికుల భద్రతపై ఆందోళన 
 
హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న నౌకల్లోని భారతీయ నావికుల భద్రతపై ఆందోళనలు పెరిగాయి. గురువారం నాడు ఒమన్ తీరం సమీపంలో గినియా-బిసావు జెండా కలిగిన ‘ఏంటి జల్వీర్’ అనే ట్యాంకర్ పై అమెరికా సైన్యం దాడి చేయడంతో ఈ ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. ఆ ప్రాంతంలో నాలుగు రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడవసారి.
 
క్షిపణి దాడి తర్వాత నౌకలో ఉన్న 22 మంది భారతీయ నావికులను సురక్షితంగా బయటకు తరలించారు. ఈ నేపథ్యంలో, శుక్రవారం మధ్యాహ్నం అమెరికా ‘ఛార్జ్ డి అఫైర్స్’ (సిడిఎ) జాసన్ మీక్స్‌ను భారత విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఎ) పిలిపించింది. హోర్ముజ్ జలసంధి వద్ద చిక్కుకుపోయిన నౌకల్లోని భారతీయుల భద్రత, రక్షణకు సంబంధించి భారతదేశ ఆందోళనలను తెలియజేయడానికి ఎంఈఎ అదనపు కార్యదర్శి (అమెరికా విభాగం) నాగరాజ్ నాయుడు ఆయనతో సమావేశమయ్యారు. 
 
ఒమన్ గల్ఫ్ ప్రాంతంలో భారతీయ నావికులు ఉన్న వాణిజ్య నౌకలపై అమెరికా నావికా దళాలు జరుపుతున్న దాడుల పట్ల భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసిందని  ఎంఈఎ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడుల వల్ల ఇప్పటికే ముగ్గురు భారతీయులు విషాదకరంగా, నివారించదగిన పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. పౌర నౌకలపై ప్రాణాంతకమైన బలప్రయోగం జరగడం పట్ల మంత్రిత్వ శాఖ మరోసారి తన తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. 
 
ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కావని, క్లిష్ట సమయంలో అత్యంత సున్నితమైన ప్రాంతంలో అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రత, రక్షణ, స్థిరత్వానికి ఇవి విఘాతం కలిగిస్తాయని స్పష్టం చేసింది. ఆ ప్రకటనలో ఇంకా ఇలా పేర్కొన్నారు: “ఆ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా దళాలు పౌరుల ప్రాణనష్టాన్ని నివారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా చూడాలని, భారతదేశపు తీవ్ర ఆందోళనలను తన ఉన్నతాధికారులకు తెలియజేయాలని అమెరికా ‘ఛార్జ్ డి అఫైర్స్’ (తాత్కాలిక రాయబారి)ను కోరడం జరిగింది.” 
 
ఓమన్ తీరంలో అమెరికా దళాలు ఒక వాణిజ్య నౌకపై దాడి చేసిన నేపథ్యంలో, ట్రంప్ పరిపాలనతో సంబంధాలలో భాగంగా మొదటిసారిగా న్యూఢిల్లీలోని ఒక అగ్రశ్రేణి అమెరికా దౌత్యవేత్తను భారత్ పిలిపించిన జూన్ 10 నాటి ఘటన తర్వాత మీక్స్  పర్యటన జరిగింది. ‘సెట్టబెల్లో’ నౌకలో ఉన్న 24 మంది భారతీయ నావికులలో 21 మందిని రక్షించగా, ముగ్గురు మరణించారు. 
 
‘ఎంటి జల్వీర్’ పై దాడి జరిగిన రోజే, కేంద్ర ఓడరేవులు, నౌకాయానం,  జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ముగ్గురు భారతీయ నావికుల మరణాన్ని ధృవీకరించారు. అంతకుముందు రోజు `ఎంటి సెట్టబెల్లో’పై దాడి జరిగినప్పుడు వీరు కనిపించకుండా పోయినట్లు సమాచారం వచ్చింది (ఆ నౌకలో ఉన్న 24 మంది భారతీయులలో 21 మందిని అప్పుడే రక్షించారు).
 
మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, ‘ఎంటి  జల్వీర్’ సిబ్బందిని షినాస్ రేవుకు తరలించే ప్రక్రియను రాయల్ నేవీ ఆఫ్ ఓమన్ సహకారంతో సమన్వయం చేశారు. నౌకలో ఉన్న మొత్తం 22 మంది భారతీయులను సురక్షితంగా తీరానికి తీసుకువచ్చారు. 
 
ఎంటి జల్వీర్ “ఒమన్ గల్ఫ్ ద్వారా ఇరాన్ నుండి చమురును రవాణా చేయడానికి ప్రయత్నించింది” అని పేర్కొంటూ, “సిబ్బంది అమెరికా దళాల ఆదేశాలను పదేపదే పాటించడంలో విఫలమైన తర్వాత, ఒక అమెరికా విమానం ఆ నౌక ఇంజిన్ గదిలోకి రెండు హెల్‌ఫైర్ క్షిపణులను ప్రయోగించింది” అని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. 
 
“ఇరాన్ చమురును రవాణా చేయడానికి ప్రయత్నించడం ద్వారా ఇరాన్‌పై దిగ్బంధనాన్ని ఉల్లంఘించిన తర్వాత” ఒమన్ గల్ఫ్‌లో ఆ ట్యాంకర్‌ను “నిలిపివేశారని, ఈ వారంలో అమెరికా దళాలచే నిలిపివేసిడిన మూడవ వాణిజ్య నౌక ఇదేనని” అది పేర్కొంది. 
 
“ఈ వారం ప్రారంభంలో, అమెరికా విమానాలు వరుసగా సోమవారం, మంగళవారం పలావు జెండా కలిగిన ఎంటి మారివెక్స్, ఎంటి సెట్టెబెల్లో నౌకలను నిలిపివేశాయి. మారివెక్స్ ఇరాన్ ఓడరేవుకు ప్రయాణించడానికి ప్రయత్నించడం ద్వారా దిగ్బంధనాన్ని ఉల్లంఘించగా, సెట్టెబెల్లో ఇరాన్ చమురును రవాణా చేయడానికి ప్రయత్నించింది,” అని సెంట్రల్ కమాండ్ తెలిపింది. 
 
గత నెలలోనే ఒక అమెరికా విమానం ఎంటి జల్వీర్‌పై కాల్పులు జరిపినట్లు తెలిసింది. మే 15న, ఒమన్ తీరానికి సుమారు 30 నాటికల్ మైళ్ల దూరంలో దానికి హెచ్చరిక కాల్పులు అందాయి. దాంతో దానిని ఒమన్ గల్ఫ్ వైపు వెనక్కి మళ్లమని ఆదేశించారు. 
 
వాణిజ్య నౌకలపై దాడులు, అమెరికా,  ఇరాన్‌ల సైనిక దాడుల పునఃప్రారంభం,  సముద్ర భద్రతా సమస్య వంటివి, వచ్చే వారం తూర్పు ఫ్రాన్స్‌లోని ఎవియాన్-లెస్-బైన్స్‌లో సమావేశమయ్యే జి7 నాయకులకు దౌత్యపరమైన, ఆర్థికపరమైన సవాళ్లను విసురుతున్నాయి – ఈ సమావేశంలో పాల్గొనే ప్రపంచ నాయకులలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఉంటారు.  
 
బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత, ఎంటి సెట్టెబెల్లోపై జరిగిన దాడి అనంతరం, విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలోని యూఎస్ ఛార్జ్ డి అఫైర్స్‌ను పిలిపించి నిరసన తెలిపింది. “ఒమన్ తీరంలో ఈ వాణిజ్య నౌకపై జరిగిన దాడిపై నిరసన నమోదు చేయడానికి మేము యూఎస్ సీడీఏ (జేసన్ మీక్స్)ను పిలిపించాము. ఆ ఘటనలో ముగ్గురు భారత జాతీయులు మరణించారు,” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం తెలిపారు.
 
“ఈ ఘటనలు, వరుసగా జరుగుతున్న దాడులపై మేము మా తీవ్ర ఆందోళనను తెలియజేశాము. ఇవి తక్షణమే ఆగిపోతాయని, ముగుస్తాయని మేము ఆశిస్తున్నాము” అని తెలిపారు. వాణిజ్య నౌకలు, నావికా సిబ్బంది, అలాగే పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడంపై మా తీవ్ర ఆందోళనను ఆయన నొక్కిచెప్పారు.