మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న రైల్వే కోచ్ పై రాళ్లు!

మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న రైల్వే కోచ్ పై రాళ్లు!
ఢిల్లీకి వెళ్తున్న స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌పై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న కోచ్ కిటికీ అద్దం గురువారం సాయంత్రం దెబ్బతింది. ఈ ఘటనలో భగవత్‌కు ఎలాంటి గాయాలు కాలేదని, ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లా తుండ్లా జంక్షన్‌లో కాసేపు ఆగిన తర్వాత రైలు తన ప్రయాణాన్ని కొనసాగించిందని అధికారులు తెలిపారు. 
 
ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్పీ) ఇన్‌స్పెక్టర్ షేర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, కాన్పూర్ నుండి ఢిల్లీకి వెళ్తున్న స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఫిరోజాబాద్ జిల్లా గుండా వెళ్తుండగా సాయంత్రం 7:20 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మక్కన్‌పూర్ స్టేషన్ వద్ద ఆగకుండా వెళ్తున్నప్పుడు, ఒక రాయి ఈ-1 కోచ్ కిటికీని బలంగా తాకడంతో అద్దం పగిలింది. 
 
ఈ ఘటన తర్వాత, రైలును తుండ్లా జంక్షన్ బయటి సిగ్నల్ వద్ద నిలిపివేశారు. పరిస్థితిని సమీక్షించడానికి రైల్వే, పోలీసు  అధికారులు అక్కడికి చేరుకున్నారు. “రాయి తగిలిన కోచ్‌లోనే ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్  మోహన్ భగవత్ ప్రయాణిస్తున్నారు. అయితే, ఆయన కోచ్‌లో మరో వైపు కూర్చుని ఉండటంతో పూర్తిగా సురక్షితంగా ఉన్నారు. ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదు,” అని సింగ్ చెప్పారు. 
 
ఘటన జరిగిన తర్వాత ఆగ్రా జోన్ ఏడీజీ ఎస్.కె. భగత్, ఆగ్రా రేంజ్ డిఐజి శైలేష్ పాండేతో సహా సీనియర్ పోలీసు అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. రాయి రువ్విన వ్యక్తిని గుర్తించి అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు భగత్ తెలిపారు. “ఎవరికీ గాయాలు కాలేదు. కేవలం ఫస్ట్ ఏసీ కోచ్ బయటి అద్దం మాత్రమే పగిలింది,” అని ఆయన పేర్కొన్నారు.
 
ఫిరోజాబాద్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) ఆదిత్య లాంగే మాట్లాడుతూ, విచారణ నిమిత్తం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. “ఫిరోజాబాద్‌లోని రసూల్‌పూర్,  దక్షిణ పోలీస్ స్టేషన్ పరిధుల సరిహద్దు సమీపంలో రైలు నంబర్ 12003 వెళ్తుండగా సాయంత్రం 7:15 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆ రైలులో ప్రయాణిస్తున్నట్లు మాకు సమాచారం అందింది,” అని లాంగే చెప్పారు. 
 
రైల్వే ట్రాక్ పక్కన ఉన్న పెమేశ్వర్ గేట్ సమీపంలోని ఘటనా స్థలానికి సిటీ ఎస్పీ రవి శంకర్ ప్రసాద్ కూడా చేరుకున్నారు. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని సేకరించారు. ఘటనలో ప్రమేయం ఉన్నవారిని గుర్తించే పనిలో ఉన్నారు. గతంలో కూడా ఫిరోజాబాద్ మార్గంలో వెళ్లే రైళ్లపై రాళ్లు రువ్విన సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు అధికారులు ప్రస్తుతం ఉన్న భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.