శ్రీలంకలో 2019 ఈస్టర్ మారణహోమంకు నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ కారణం!

శ్రీలంకలో 2019 ఈస్టర్ మారణహోమంకు నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ కారణం!

శ్రీలంకలో 2019లో ఈస్టర్ రోజు 279 మంది మరణించిన మారణహోమంకు  అప్పటి ఎక్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ తువాన్ సురేష్ సల్లాయ్ కారణమని తాజాగా  శ్రీలంక ప్రభుత్వం వెల్లడించింది. 2019లో జరిగిన ఈ ఘటనపై బుధవారం శ్రీలంక పార్లమెంట్‌లో జరిగిన చర్చలో శ్రీలంక పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి ఆనంద విజేపాలా  ఈ మారణహోమానికి రిటైర్డ్ మేజర్ జనరల్ తువాన్ సురేష్ సల్లాయ్ ప్రధాన కారకుడని విచారణలో తేలిందని తెలిపారు.  

ఈ అంశంపై ఆరేళ్ల తర్వాత ప్రభుత్వం తొలిసారిగా అధికారిక ప్రకటన చేసింది. ఈ ఘటనకు ప్రధాన కారకుడైన తువాన్ సురేష్‌ను గత ఫిబ్రవరిలో ప్రభుత్వం అరెస్ట్ చేసింది. 2019, ఏప్రిల్ 21న శ్రీలంక రాజధాని కొలంబోలో భారీ పేలుళ్లు జరిగాయి. ఆరోజు ఆదివారం. పైగా ఈస్టర్ సండే. అక్కడి క్రిస్టియన్లు అక్కడి చర్చిలలో ప్రార్థనల చేస్తున్నారు.  అయితే, అనేక క్యాథలిక్ చర్చిలు, హోటళ్లలో ఉన్నవారిపై కొందరు ఇస్లాం అతివాదులు విచాక్షణారహితంగా కాల్పులు జరిపారు. బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు.

ఈ ఘటనలో 279 మంది మరణించారు. భారీ సంఖ్యలో గాయపడ్డారు. శ్రీలంక చరిత్రలోనే అతిపెద్ద తీవ్రవాద సంఘటన ఇది. ఎంతో సంతోషంగా వేడుకలు జరుపుకొంటున్న వారు క్షణాల్లో ప్రాణాలు కోల్పోయారు.  ప్రణాళిక ప్రకారం ఈ దాడులు జరిగాయని శ్రీలంక ప్రభుత్వం గుర్తించింది. అప్పటినుంచి దీనిపై విచారణ జరిగింది. అయితే, దీనికి సంబంధించిన వివరాల్ని ప్రభుత్వం పెద్దగా బయటపెట్టలేదు.

తాజాగా ఈ అంశంపై శ్రీలంక ప్రభుత్వం స్పందిస్తూ అప్పటి రిటైర్డ్ మేజర్ జనరల్ తువాన్ సురేష్ సల్లాయ్ దీనికి ప్రధాన కారకుడని తేల్చింది. దీనికి కుట్ర పన్నడంతోపాటు, ఇస్లాం అతివాదుల్ని రెచ్చగొట్టినట్లు విచారణలో తేలింది. అయితే, అతడిని విడుదల చేయాలని కోరుతూ అక్కడి ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. అందుకే ప్రభుత్వం ఏకంగా పార్లమెంట్‌లో స్పందించి, ప్రకటన చేసింది.

సల్లే విచారణ అనంతరం, మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స ద్వీపాన్ని విడిచి వెళ్లకుండా నిరోధించే కోర్టు ఉత్తర్వులను దర్యాప్తు అధికారులు పొందారు. రాజపక్స అధ్యక్షుడు అయిన వెంటనే, 2019లో దేశ ప్రధాన గూఢచార సంస్థ అయిన స్టేట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (ఎస్ఐఎస్)కు సల్లే అధిపతిగా నియమితులయ్యారు. ఎస్ఐఎస్ బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఆయన సైనిక గూఢచార విభాగానికి కూడా నాయకత్వం వహించారు.
 
ఆత్మాహుతి దాడులు జరిపిన ఇస్లామిస్టులతో సల్లేకు సంబంధాలు ఉన్నాయని, దాడికి ముందు వారిని కలిశారని 2023లో బ్రిటిష్ బ్రాడ్‌కాస్టర్ ఛానల్ 4 నివేదించింది. ఆ సంవత్సరం జరిగిన అధ్యక్ష ఎన్నికలలో రాజపక్సకు అనుకూలంగా ప్రభావితం చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన దాడి జరగడానికి అనుమతించారని ఒక విజిల్‌బ్లోయర్ ఆ నెట్‌వర్క్‌కు తెలిపారు.