దేశంలో సంతానోత్పత్తిలో తీవ్రమైన క్షీణత 

దేశంలో సంతానోత్పత్తిలో తీవ్రమైన క్షీణత 
కేంద్ర హోం శాఖ పరిధిలోని రిజిస్ట్రార్‌ జనరల్‌, సెన్సస్‌ కమిషనర్‌ కార్యాలయం ప్రచురించిన ‘శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ స్టాటిస్టికల్‌ రిపోర్ట్‌ 2024’ ప్రకారం దేశంలో సంతానోత్పత్తి రేటు తీవ్రంగా క్షీణించింది. రాబోయే సంవత్సరాల్లో దేశ జనాభా పెరుగుతుందని భావిస్తున్నప్పటికీ సంతానోత్పత్తి స్థాయి మళ్లీ 2.15 కంటే పైకి పెరుగకపోతే, దాని వృద్ధిలో క్రమంగా క్షీణత కనిపిస్తుంది. 
 
భారతదేశ రీప్లేస్‌మెంట్‌ స్థాయి 2.1 బెంచ్‌మార్క్‌ కంటే కిందకు పడిపోయిందని నివేదిక పేర్కొన్నది. రీప్లేస్‌మెంట్‌ లెవల్‌ అంటే జనాభా పెరుగకుండా లేదా తగ్గకుండా ఒక తరం నుంచి మరో తరానికి తనను తాను పునఃస్థాపించుకోవడానికి ప్రతి మహిళ కలిగి ఉండాల్సిన పిల్లల సంఖ్య. వాషింగ్టన్‌కు చెందిన ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌’ నిపుణుల అంచనా ప్రకారం భారత జనాభా 21 ఏండ్లలో అత్యధిక స్థాయికి చేరుకుంటుంది. ఆ తర్వాత తీవ్రమైన క్షీణత ప్రారంభమవుతుంది.
శతాబ్దం చివరి నాటికి దేశ జనాభా ఒక బిలియన్‌(100 కోట్లు) కంటే కొంచెం ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. ఇది దాదాపు అర బిలియన్‌(50 కోట్లు) ప్రజల తగ్గుదలను సూచిస్తున్నది. దేశవ్యాప్తంగా కేవలం ఆరు రాష్ర్టాలు మాత్రమే ఈ రీప్లేస్‌మెంట్‌ మార్కు కంటే ఎక్కువ సంతానోత్పత్తి రేట్లను కలిగి ఉన్నాయి. ఢిల్లీ దేశంలోనే అత్యల్పంగా 1.2 టీఎఫ్‌ఆర్‌ నమోదు చేసింది. ఇది ఫిన్లాండ్‌(1.3 టీఎఫ్‌ఆర్‌) కంటే తక్కువని నివేదిక పేర్కొన్నది.

ప్రస్తుత భారతీయ తల్లిదండ్రుల మారుతున్న ఆశయాలు దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గడానికి ముఖ్యమైన కారణాల్లో ఒకటి. పిల్లల విద్యావకాశాల కోసం, పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా చాలామంది ఆధునిక జంటలు ఒకే బిడ్డను ఎంచుకొంటున్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించిపోతుండడం, పట్టణీకరణ, ఉపాధి విధానాల్లో మార్పుల కారణంగా ప్రస్తుతం సుమారు 70 శాతం మంది ప్రజలు విడివిడిగా(న్యూక్లియర్‌ ఫ్యామిలీస్‌) నివసిస్తున్నారని ప్రభుత్వ గణాంకాలు చూపిస్తున్నాయి. 

ఫలితంగా పిల్లలను పెంచడం తల్లిదండ్రులపై ఎక్కువ ఒత్తిడి కలిగిస్తున్నది. ఇది తక్కువ మంది పిల్లలను కలిగి ఉండేలా వారిని ప్రోత్సహిస్తున్నది. టీఎఫ్‌ఆర్‌ స్థాయి తగ్గడానికి మరొక ముఖ్యమైన కారణం సాంస్కృతిక మార్పు. గ్రామీణ ప్రాంతాల్లో కేబుల్‌ టెలివిజన్‌ రాక వల్ల కొన్నేండ్లుగా గర్భధారణలు తగ్గుముఖం పట్టాయని నివేదిక పేర్కొన్నది. 

చిన్న కుటుంబాలను ప్రోత్సహించే మహిళలను చూపే టెలివిజన్‌ ధారావాహికలతో సంతానోత్పత్తి రేటు క్షీణత ముడిపడి ఉన్నదని నిఫుణులు అంటున్నారు. ఈ జనాభా మార్పు విభిన్న సామాజిక సవాళ్లను తెచ్చిపెడుతుంది. కాలక్రమేణా, నిరంతర తక్కువ సంతానోత్పత్తి రేటుతో వృద్ధుల సంఖ్య ఎక్కువవుతుంది, శ్రామిక శక్తి తగ్గుతుంది. సామాజిక సంక్షేమ వ్యవస్థలపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది.

భారత్‌లో పరిస్థితిపై టెక్‌ దిగ్గజం ఎలాన్‌ మస్క్‌ ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలో అత్యంత విద్యావంతులైన వారిలో జననాల రేటు చాలా ఏండ్ల క్రితమే రీప్లేస్‌మెంట్‌ కంటే కిందికి పడిపోయిందని పేర్కొన్నారు. భారత్‌ లో జననాల రేటు గణనీయంగా తగ్గుతోందని, ఇది జనాభా స్థిరత్వానికి అవసరమైన ప్రతిస్థాపన స్థాయి కంటే కిందకు పడిపోయిందని  మీడియా సంస్థ ‘ఏఎఫ్ పోస్ట్’ షేర్ చేసిన డేటాను ప్రస్తావిస్తూ మస్క్ ‘ఎక్స్’ వేదికగా ఆయన పేర్కొన్నారు.

భారతదేశ చరిత్రలో తొలిసారిగా మొత్తం సంతానోత్పత్తి రేటు ప్రతి మహిళకు 2.1 పిల్లలు అనే ప్రతిస్థాపన స్థాయి కంటే కిందకు పడిపోయిందని ‘ఏఎఫ్ పోస్ట్’ నివేదిక వెల్లడించింది. గత దశాబ్ద కాలంలోనే ఈ రేటు 2.3 నుంచి 1.9కి క్షీణించిందని తెలిపింది. ఢిల్లీలో అయితే ఈ రేటు 1.2 కి పడిపోయిందని, ఇది ఫిన్‌లాండ్ కంటే కూడా తక్కువని నివేదిక పేర్కొన్నది. 

ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2025’ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించింది. భారతదేశంలో సంతానోత్పత్తి రేటు 1.9 గా నమోదైందని, ఇది జనాభా స్థిరత్వానికి అవసరమైన 2.1 కంటే తక్కువ అని స్పష్టం చేసింది

సంతానోత్పత్తి రేటు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రతి తరం మునుపటి తరం కంటే చిన్నదిగా మారి దేశ జనాభా క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని నివేదిక విశ్లేషించింది. మరోవైపు దేశంలో ఇప్పటికీ సామాజిక, ఆర్థిక అసమానతలు, ప్రసూతి మరణాలు, లింగ వివక్ష వంటి సవాళ్లు ఉన్నాయని యూఎన్ఎఫ్‌పీఏ నివేదిక తెలిపింది.