ఆయిల్‌, గ్యాస్‌ ‌సంక్షోభంతో మందుల కొరత ఏర్పడే ప్రమాదం!

ఆయిల్‌, గ్యాస్‌ ‌సంక్షోభంతో మందుల కొరత ఏర్పడే ప్రమాదం!

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఆయిల్‌, గ్యాస్‌ ‌సంక్షోభం వల్ల మందులకూ కొరత ఏర్పడే ప్రమాదముందని ఆసియన్‌ ‌డెవలప్‌‌మెంట్‌ ‌బ్యాంక్‌ ‌తాజాగా వెల్లడించింది. ఎందుకంటే ప్రతి ఔషధం పెట్రోకెమికల్స్ నుండి పొందే ముడి పదార్థాలపైనే ఆధారపడి తయారవుతుంది. చమురు, గ్యాస్‌ ‌సంక్షోభం వల్ల ‌ఆసియా, అందులోనూ భారత్‌లో మందుల సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడతాయి ఎడిబి హెచ్చరించింది.

 ఔషధాల తయారీకి పెట్రోలియం ఉత్పత్తిలో కేవలం 3 శాతం మాత్రమే వినియోగిస్తారు. అయితే అసలు ఒక్క ఔషధ తయారీకి ఉపయోగించాల్సిన ముడి పదార్థాలు అత్యధికంగా 99 శాతం పెట్రోకెమికల్స్ నుండే సేకరించాల్సి ఉంటుంది. ఇక అత్యవసరమైన టీకాలు, ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేసే జెనరిక్‌ ‌మందులలో దాదాపు సగం అంటే సుమారు 65 శాతం భారత్‌‌లోనే ఉత్పత్తి అవుతున్నాయి. 

హర్మూజ్‌ ‌జలసంధి ద్వారా భారత్‌ ‌సుమారు 40 శాతం క్రూడ్‌ అయిల్‌‌ను దిగుమతి చేసుకుంటోంది. అమెరికా- ఇజ్రాయిల్‌ ఇరాన్‌‌పై దాడికి పాల్పడడం వల్ల ఈ సంధి వల్ల భారత్‌ ‌దిగుమతి చమురు ఆగిపోవడం వల్ల అది ఔషధాల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. పశ్చిమాసియా ఘర్షణల వల్ల భారత్‌నే అత్యధికంగా నష్టపోయింది.

ఔషధ ముడి పదార్థాలు, క్రియాశీల ఔషధ పదార్ధాలను ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం చైనా. ఈ ఔషధ ముడి పదార్థాలను భారత్‌ ‌సుమారు 70 శాతం చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది. భారత్‌- ‌చైనాలు ఒకదానికొకటి సహకరించుకోవడం వల్ల జెనరిక్‌ ‌మందులుగానీ, టీకాలుగానీ ప్రపంచ దేశాలకు సరఫరా చేయగలుగుతున్నాయి. 

ఇరాన్‌‌పై యుద్ధం వల్ల చమురు దిగుమతులు ఆగిపోవడం వల్ల యావత్‌ ‌ప్రపంచ దేశాలకు కూడా ఔషధాల కొరత ఏర్పడే అవకాశం ఉంది. సాధారణ జబ్బు జ్వరానికి వాడే పారాసెట్‌‌మాల్‌ ‌నుండి అత్యంత సంక్లిష్టమైన జబ్బులు కీళ్లు, కండరాల నొప్పులు తగ్గడానికి వాడే ఐబుప్రోఫెన్‌ల వంటి మందులను ముడి చమురు నుండి ఉత్పన్నమయ్యే ప్రొపైలిన్‌ ‌నుండి తయారుచేస్తారు. 

అలాగే శరీరంలో సోకే ఇన్ఫెక్షన్స్‌ ‌తగ్గించడానికి వాడే యాంటీబయాటిక్స్‌ ‌కానీ, కొలెస్ట్రాల్‌ ‌తగ్గించేవి, మధుమేహం, క్యాన్సర్‌ నివారణకు కీమోథెరపీ మందుల ఉత్పత్తిలో ఏదో ఒకదశలో పెట్రోకెమికల్‌ ఉత్పన్న పదార్థాలను ఉపయోగించే వాటిని తయారుచేస్తారు. కేవలం మందుల తయారీకి మాత్రమే కాదు మందుల వినియోగంలో కూడా పెట్రోకెమికల్‌ ‌చాలా కీలకం.

సెలైన్లు, సిరంజీలు తయారీలోనూ, ఆఖరికి డాక్టర్లు, నర్సులు ధరించే గ్లౌజుల తయారీలో కూడా పెట్రోకెమికల్స్‌‌కి సంబంధించిన రసాయనాల సమ్మేళం పాలిమర్స్‌, ప్లాస్టిక్‌‌నే ఉపయోగిస్తారు. వ్యాక్సిన్‌‌లు, మందుల సరఫరా తగ్గుతున్న కొద్దీ ఔషధాల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ అవకాశాన్ని కొన్ని కార్పొరేట్‌ ‌కంపెనీలు చేజిక్కించుకుని వారే మందుల్ని తయారుచేసి  అత్యధిక రేటుకు విక్రయిస్తారు. 

దీంతో సామాన్య ప్రజలకు అతి తక్కువ ధరకే దొరికే మందులు ఎక్కువ ధరపెట్టి కొనాల్సి వస్తోంది. భవిష్యత్తులో అవి కూడా అందని ద్రాక్షగా మారిపోయే అవకాశం ఉంది. మరోవైపు నకిలీ మందుల తయారీ కూడా పెరుగుతుంది. ఆసియా, పసిఫిక్‌‌లలో ఈ మందుల తయారీ విపరీతంగా పెరుగుతుంది. భారత్‌, కంబోడియా, పాకిస్తాన్‌, వియత్నాం అధికారులు ఇటీవల నకిలీ మందుల గురించి హెచ్చరికలు జారీ చేశారు. 

మందుల ముడి పదార్థాలు, ఉత్పత్తి ధరలు పెరగడం వల్ల నకిలీ మందులు మార్కెట్లోకి ప్రవేశించే ప్రమాదముంది. ప్రత్యేకించి ఈ దేశాలలో నకిలీ మందులకు గుర్తించి అడ్డుకునే సామర్థ్యం లేదు. దీంతో ప్రజారోగ్యం కూడా ప్రమాదంలో పడుతుందని ఎడిబి గుర్తించింది.