న్యూఢిల్లీ, టెల్ అవీవ్ మధ్య పెరుగుతున్న సాంస్కృతిక సంబంధాల నేపథ్యంలో, ఇజ్రాయెల్ తన దేశంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని తమ దేశంలోని ఓ ప్రముఖ నగరంలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ముంబైలోని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ యానివ్ రెవాచ్, గత వారం ‘శివ రాజ్యాభిషేక దినం’ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
“ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రభావం ఏమిటో, భారతదేశానికి ఆయన ఎంత ముఖ్యమో మాకు బాగా తెలుసు. మహారాజ్ గారి భారీ విగ్రహాన్ని తయారు చేసి ఇజ్రాయెల్‌కు పంపాలన్నది మా ఆలోచన. ఇది కేవలం ఒక సాధారణ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, దీర్ఘకాలిక ప్రాముఖ్యత కలిగిన ఒక కార్యక్రమం కానుంది. అంతేకాకుండా, ఈ ప్రాజెక్ట్ ద్వారా భారతీయ ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలతో అనుసంధానించబడతారు. దీనిని ఇజ్రాయెల్‌లోని ఏదైనా ఒక ప్రధాన నగరానికి తీసుకురావాలని మేము యోచిస్తున్నాము,” అని ఆయన పేర్కొన్నారు.
శివాజీ మహారాజ్ జీవిత విశేషాలను, ఆయన సాధించిన విజయాలను ఇజ్రాయెల్ ప్రజలకు పరిచయం చేయడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. తాను భారత దేశంలో ఎక్కడ పర్యటించినా ఇజ్రాయెల్ దేశం పట్ల, తమ జాతీయ హీరోల పట్ల భారతీయుల కళ్లలో ఎంతో గౌరవం చూశానని, అదే స్ఫూర్తితో ఇజ్రాయెల్‌లో కూడా శివాజీ మహారాజ్ గురించి అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని రెవాచ్ అభిప్రాయ పడ్డారు.
ముఖ్యంగా మహారాష్ట్రకు, ఇక్కడి నుంచి ఇజ్రాయెల్‌కు వలస వెళ్లి స్థిరపడిన భారతీయ యూదు సమాజానికి మధ్య ఉన్న చారిత్రాత్మక సంబంధాల దృష్ట్యా ఈ స్మారక చిహ్నం అత్యంత ప్రాధాన్యత సంతరించుకోనుందని ఆయన స్పష్టం చేశారు. శివాజీ మహారాజ్ వారసత్వానికి తగినట్లుగా ఈ విగ్రహాన్ని అత్యంత వైభవంగా రూపొందించడానికి అవసరమైన చారిత్రక ఆధారాలు, కళాత్మక సలహాలు, డిజైన్ రూపకల్పనలో సహకరించాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం కోరింది.
దీనికి ముఖ్యమంత్రి తక్షణమే అంగీకరిస్తూ తమ ప్రభుత్వం తరఫున పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ చారిత్రాత్మక నిర్ణయంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. “ఇది నిజంగా అద్భుతమైన, గర్వించదగ్గ వార్త. శివ రాజ్యాభిషేకం దినోత్సవం శుభ సందర్భాన ఇజ్రాయెల్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ భవ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ యానివ్ రెవాచ్‌కు హృదయ పూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు.

More Stories
ఆసియాలోనే అత్యంత పొడవైన రోడ్ టన్నెల్ జోజిలా బ్రేక్ త్రూ
ఫ్రాన్స్‌లో జరిగే జీ7 దేశాల సదస్సుకు ప్రధాని మోదీ
మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ