నిర‌స‌కారుల‌పై కాల్పులు.. పీఓకేలో 30 మంది మృతి

నిర‌స‌కారుల‌పై కాల్పులు.. పీఓకేలో 30 మంది మృతి
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పిఓకె)లో భద్రతా బలగాలు, నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో భద్రతా దళాల కాల్పుల్లో  30 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, మరో 200 మంది గాయపడ్డారు.  పాకిస్థాన్ నుంచి విముక్తి క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తున్న ఆందోళ‌న‌కారుల‌పై భ‌ద్ర‌తా ద‌ళాలు కాల్పులు జ‌రిపాయి. రావ‌ల్‌కోట్‌, బింబేర్, ముజాఫ‌రాబాద్‌లో ప‌రిస్థితి దారుణంఆ ఉంది. 
 
పాక్ ద‌ళాలు చాలా క్రూరంగా ఫైరింగ్‌కు పాల్ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. టియ‌ర్ గ్యాస్ తోనూ నిర‌స‌న‌కారుల్ని చెద‌ర‌గొట్టారు. పీఓకేలో ఆర్థిక, రాజకీయ సమస్యలపై నిరసనలకు నాయకత్వం వహిస్తున్న ప్రముఖ పౌర సమాజ కూటమి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జాక్)ని అధికారులు నిషేధించడం ఘర్షణలకు కారణమైంది. 
 
ఆర్థిక, రాజకీయ హక్కులను పరిరక్షించాలని కోరుకునే జాయింట్ అవామీ యాక్షన్ కమిటీకి చెందిన నిరసనకారులు, పోలీసుల కాల్పుల్లో మరణించిన తమ గ్రూపు సభ్యుడి మృతదేహాన్ని తరలించిన ఆసుపత్రి మార్చురీ వెలుపల నిరసనకారులు గుమిగూడినట్టు పోలీసులు తెలిపారు. వారిని చెదరగొట్టేందుకు భద్రతా దళాలు ప్రయత్నించగా  గ్రూపులోని కొంద‌రు ఆటోమెటిక్ రైఫిళ్లు, పెట్రోల్ బాంబులను వాడారు. 
 
జూలై 27న జరగనున్న ప్రాంతీయ శాసనసభ ఎన్నికలల, మొత్తం 45 స్థానాలకు గాను శరణార్థులకు 12 సీట్లు కేటాయించడాన్ని నిరసిస్తూ జాక్ సమ్మెకు పిలుపునిచ్చింది. ఆ సంస్థ తలపెట్టిన నిరసనలకు ఒక రోజు ముందు ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయి.  తమను ఒక ‘ఉగ్రవాద’ గ్రూపుగా ముద్రవేయడాన్ని అణచివేతగా అభివర్ణించిన జాక్.. తాము చట్టబద్ధమైన ఆర్థిక, రాజకీయ హక్కుల కోసం నిరసన తెలుపుతున్నామని పేర్కొంది.

జాక్ నిరసనకారులు ఆసుపత్రి వద్ద గుమిగూడారని రావల్కోట్‌లోని అత్యున్నత పౌర అధికారి కమిషనర్ సర్దార్ వహీద్ ఖాన్ రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. ‘‘చట్టాన్ని అమలు చేసేవారి ప్రతిస్పందన ఫలితంగా, ఆరుగురు నిరసనకారులు మరణించారు’’ అని ఖాన్ తెలిపారు. ఈ ఆపరేషన్‌లో పలువురిని అరెస్టు చేసినట్లు కూడా ఆయన ధ్రువీకరించారు.  అయితే, ఈ నివేదికలను ఖండించిన స్థానికులు, జాక్ మద్దతుదారులు మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని వాదిస్తున్నారు.