ముస్లింలు అధికంగా నివసించే కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పర్యాటకాభివృద్ధి లక్ష్యంగా గత 47 ఏండ్లుగా కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు 1979లో అమల్లోకి వచ్చిన ‘లక్షద్వీప్ ప్రొహిబిషన్ రెగ్యులేషన్‘ను రద్దు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో నియంత్రిత విధానంలో లైసెన్స్ పొందిన దుకాణాల ద్వారా మద్యం విక్రయాలకు మార్గం సుగమమైంది.
కొత్తగా అమల్లోకి వచ్చిన లక్షద్వీప్ ఎక్సైజ్ రెగ్యులేషన్ 2026 ప్రకారం మద్యం తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, కొనుగోలు, విక్రయాలు, వినియోగం వంటి అంశాలు అన్నింటినీ లైసెన్సింగ్ వ్యవస్ధ ద్వారా నియంత్రించనున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు కూడా మద్యం దిగుమతి, రిటైల్ విక్రయాలకు అనుమతి పొందే వెసులుబాటు కల్పించింది.
అయితే మద్యం అందుబాటులోకి తెస్తున్నప్పటికీ అధిక పన్నులు విధించారు. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్), విదేశీ మద్యంపై 400 శాతం, బీర్లపై 200 శాతం, వైన్‌పై 80 శాతం వరకు ఎక్సైజ్ సుంకం విధించారు. అలాగే 21 ఏండ్లలోపు వారికి మద్యం విక్రయించడంపై నిషేధం ఉంచారు. అవసరమైతే లక్షద్వీప్‌లోని ఏదైనా ప్రాంతంలో మళ్లీ నిషేధం విధించే అధికారం అడ్మినిస్ట్రేటర్‌కు ఉంటుంది.
లక్షద్వీప్‌లో సుమారు 97 శాతం జనాభా ముస్లింలే. భారతదేశంలోని ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంతో పోల్చినా ఇది చాలా అధికం. ఇస్లాం మతంలో మద్యపానాన్ని నిషేధించిన నేపథ్యంలో 1979 నుంచి లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలపై నిషేధం అమలు చేశారు. అయితే ఈ నిషేధం పూర్తిస్థాయిలో లేదు. పర్యాటకులు, ప్రభుత్వ అధికారుల కోసం కొన్ని మినహాయింపులు ఉండేవి.
కానీ లక్షద్వీప్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మద్యపానంపై నిషేధాన్ని ఎత్తివేసింది. మాల్దీవులు వంటి సముద్ర ద్వీప పర్యాటక కేంద్రాలతో పోటీ పడాలంటే నిషేధం అడ్డంకిగా మారుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

More Stories
`ఉజ్వల’ ఎల్పీజీ సిలెండర్ల సంఖ్య 9 నుండి 4కు తగ్గింపు
జూలైలో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం
సంక్షోభం వల్లే ఎల్పీజీ ధరల పెంపు అనివార్యం