పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ జరిపిన మెరుపు దాడిలో తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ భారత్-నేపాల్ సరిహద్దులో అరెస్టయ్యారు. గత నెల రోజులుగా పరారీలో ఉన్న ఇతడిని పశ్చిమ బెంగాల్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) అధికారులు భారత్, నేపాల్ సరిహద్దుల్లో శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
కలకత్తా హైకోర్టు ఆయనకు ముందస్తు మధ్యంతర రక్షణ పొడిగించేందుకు నిరాకరించిన కొద్ది సేపటికే ఎస్టీఎఫ్ రంగంలోకి దిగి ఆయన్ను అరెస్ట చేసింది. మమతా బెనర్జీ మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి జహంగీర్ ఖాన్ అత్యంత ఆప్తుడు. ఎన్నికల సందర్భంగా డైమండ్ హార్బర్ పరిధిలోని ఫాల్టా నియోజకవర్గంలో జహంగీర్ ఖాన్ వర్గీయులు భయాందోళనలు సృష్టిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి.
దాంతో యూపీ కేడర్‌కు చెందిన ‘ఎన్కౌంటర్ స్పెషలిస్ట్’ ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మను అక్కడ స్పెషల్ అబ్జర్వర్‌గా నియమించారు. ఫాల్టా ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారికి శర్మ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దీనికి కౌంటర్‌గా జహంగీర్ ఖాన్ టాలీవుడ్ హిట్ సినిమా ‘పుష్ప’ డైలాగులతో రెచ్చిపోయారు. తానే ఇక్కడి పుష్పరాజ్నని, తగ్గేదేలేదని సవాల్ విసిరారు.
ఎన్నికల అవకతవకలు, బెదిరింపుల ఆరోపణలతో అప్పటి నుంచే ఆయన పోలీసుల రాడార్‌లో ఉన్నారు. ఈ క్రమంలో ఇతర నియోజకవర్గాలతోపాటు ఏప్రిల్ 29న ఫాల్టా నియోజకవర్గంలో కూడా పోలింగ్ జరిగింది. అయితే ఈవీఎంలలో బీజేపీ బటన్‌పై టేప్ అంటించారనే ఆరోపణలు రావడంతో ఎన్నికల సంఘం మే 21న రీపోలింగ్‌కు ఆదేశించింది.
అయితే ఈలోపే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం, ముఖ్యమంత్రి సువేందు అధికారి రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానని హామీ ఇవ్వడంతోపోలింగ్కు కేవలం రెండు రోజుల ముందు మే 19వ తేదీనే జహంగీర్ ఖాన్ అకస్మాత్తుగా పోటీ నుంటి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా తన కార్యాలయానికి తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నిర్ణయంతో టీఎంసీ అధిష్ఠానం ఆయనకు దూరం జరిగింది.
చివరకు ఫాల్టా స్థానంలో బీజేపీ అభ్యర్థి దేబాంగ్షు పాండా లక్షకుపైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్న జహంగీర్ ఖాన్‌కు కేవలం 8,000 లోపు ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎన్నికల వేళ రెచ్చిపోయి మాట్లాడిన ఈ తృణమూల్ పుష్ప ఫాల్టాలో పోలింగ్ అనంతరం అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోయాడు. సరిహద్దులు దాటాలని ప్రయత్నించి ఎట్టకేలకు బెంగాల్ పోలీసులకు చిక్కాడు.

More Stories
కేంద్ర మంత్రితో, సీఎంతో 11 మంది టిఎంసి ఎంపీల భేటీ!
పార్లమెంటరీ కమిటీ ప్రశ్నలకు స్పందించని ఎన్‌టిఎ, సిబిఎస్ఇ
విదేశాల్లోని వారి చేతుల్లో యువత `పావులు’గా మారరు!