రోహింగ్యాల‌ను “బంగా‌ళాఖాతం”కు పంపుతున్న బాంగ్లాదేశ్  

మయన్మార్‌లోని రాఖైన్ ప్రావిన్స్‌లో సైన్యం అణిచివేత కార‌ణంగా పారిపోయి బంగ్లాదేశ్ వ‌చ్చిన రోహింగ్యాల‌ను బంగా‌ళాఖాతంలోని భాస‌న్ చార్‌కు పంపుతున్నారు.  ప్ర‌స్తుతం కాక్స్ బజార్ శిబిరాల్లో ఎనిమిది లక్షలకు పైగా రోహింగ్యాలు నివసిస్తున్నట్లు అంచనా. భద్రతా కారణాల వల్ల బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం వారిని కాక్స్ బజార్‌లో ఉంచింది.

కాగా, ఇప్పుడు, బంగా‌ళాఖాతంలోని డెల్టా అవక్షేపాలతో కొత్తగా ఏర్పడిన భాసన్ చార్ ప్రాంతంలో రోహింగ్యా శరణార్థుల కోసం విడిదిని ప్ర‌భుత్వం సిద్ధం చేసింది.  కాక్స్‌ బజార్ నుంచి బంగ్లాదేశ్‌లోని నోఖాలి జిల్లాకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న భాసన్ చార్‌కు లక్ష మంది రోహింగ్యా శరణార్థులను పంపుతున్నట్లు అధికారులు తెలిపారు.

స్వదేశమైన మయన్మార్‌కు వెళ్తే తప్ప వారిని భాసన్ చార్‌ను విడిచిపెట్టడానికి అనుమతించకూడ‌ద‌ని నిర్ణ‌యించారు. భాసన్ చార్ ద్వీపాన్ని 14-15 సంవత్సరాల క్రితం గుర్తించారు. కాక్స్ బజార్‌లోని రోహింగ్యా శరణార్థుల భారాన్ని తగ్గించాలని షేక్ హసీనా ప్రభుత్వం నిర్ణయించిన తరువాత బంగా‌ళాఖాతంలోని భాసన్ చార్ ద్వీపంలో సౌకర్యాలను నిర్మించడం ప్రారంభించింది.

చైనాతో పాటు విదేశీ నిర్మాణ సంస్థలతో ఆశ్రయ గృహాలు, ద‌వాఖాన‌లు, ప‌రిపాల‌నా భ‌వ‌నాలు, ప్రార్థ‌నా మందిరాల‌ను కూడా ప్రభుత్వం నిర్మించింది. రోహింగ్యాల మొదటి బ్యాచ్ గత వారం నౌకల్లో భాసన్ చార్ ద్వీపానికి చేరుకున్న‌ది. చిట్టగాంగ్ నౌకాశ్రయం బంగ్లాదేశ్ నుంచి మరిన్ని పడవలు రాబోయే కొద్ది రోజుల్లో వీరిని త‌ర‌లించేందుకు సిద్ద‌మ‌వుతున్నాయి.  లక్ష మందికి పైగా శరణార్థులు నివాసం ఉండేందుకు వీలుగా 1440 భవనాలను ఇక్కడ నిర్మించారు.