విద్యను కార్పొరేట్ వ్యాపారంగా మార్చిన తెలంగాణ ప్రభుత్వం 

విద్యను కార్పొరేట్ వ్యాపారంగా మార్చిన తెలంగాణ ప్రభుత్వం 
తెలంగాణలో విద్యను సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే హక్కుగా కాకుండా, కార్పొరేట్ సంస్థలకు లాభాల వనరుగా మార్చిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుండే గణేష్  తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతూ తల్లిదండ్రులను తీవ్ర ఆర్థిక భారానికి గురిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం మౌనంగా ఉండటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.
 
పేద, మధ్యతరగతి కుటుంబాలు అప్పులు చేసి పిల్లల చదువుల కోసం ఫీజులు చెల్లిస్తున్న పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం మాత్రం కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాస్తోందని ఆయన విమర్శించారు. డొనేషన్లు, అడ్మిషన్ ఫీజులు, యూనిఫారాలు, పుస్తకాల పేరుతో జరుగుతున్న అక్రమ వసూళ్లను వెంటనే అరికట్టాలని ఆయన  డిమాండ్ చేశారు. 
 
ప్రస్తుత విద్యా సంవత్సరంలో అనేక విద్యాసంస్థలు 10% నుంచి 50% వరకు ఫీజులు పెంచడం అన్యాయమని పేర్కొంటూ, ఫీజుల పెంపును గరిష్టంగా 8%కే పరిమితం చేయాలని కోరారు. అలాగే విద్య హక్కు చట్టం ప్రకారం 25% ఉచిత సీట్ల నిబంధనలను ఈ విద్యా సంవత్సరం నుంచే కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని గణేష్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎంఈఓ, డీఈఓ అధికారుల కొరత కారణంగా విద్యా వ్యవస్థపై పర్యవేక్షణ లేకుండా పోయిందని, విద్యాశాఖ అధికారులు ప్రేక్షక పాత్ర పోషించడం సిగ్గుచేటని విమర్శించారు. 
 
పెండింగ్‌లో ఉన్న ఫీజు నియంత్రణ బిల్లును ఆర్డినెన్స్ రూపంలోనైనా వెంటనే అమలు చేసి, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమంగా ఫీజులు పెంచిన విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  “చదువు హక్కు… వ్యాపారం కాదు. తెలంగాణలో ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉండే నాణ్యమైన విద్యను ప్రభుత్వం హామీ ఇవ్వాలి” అని ఆయన స్పష్టం చేశారు.

విద్యార్థుల భవిష్యత్తుతో వ్యాపారం చేస్తున్న విద్యాసంస్థలపై, వారికీ కొమ్ముకాస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి,  పెండింగ్ లో ఉన్న ఫీజు రిఎంబెర్స్మెంట్ ను వెంటనే విడుదల చెయాలని డిమాండ్ చేస్తూ లేకపోతే బిజెవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం అని హెచ్చరించారు.