అమెరికాలోని నార్త్ ఫిలడెల్ఫియాలో తెలంగాణకు చెందిన 28 ఏళ్ల అన్షుల్ కుంచా అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి, విద్యార్థి దారుణ హత్యకు గురయ్యారు. అన్షుల్ కుంచా మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లి గ్రామానికి చెందినవారు. నాలుగేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఐటీ ఉద్యోగం చేస్తూనే, టెంపుల్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్నారు.
అదనపు ఆదాయం కోసం వారాంతాల్లో పార్ట్‌టైమ్‌గా పిజ్జా డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక పిజ్జా ఆర్డర్ డెలివరీ చేయడానికి రేమండ్ రోసెన్ హోమ్స్ హౌసింగ్ కాంప్లెక్స్‌లోని ఒక ఖాళీ ఇంటికి వెళ్లారు. అక్కడ గుర్తుతెలియని దుండగులు అన్షుల్నుపై పలుమార్లు కాల్పులు జరిపారు. దాంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఘటనా స్థలం నుండి ఫిలడెల్ఫియా పోలీసులు మూడు బుల్లెట్ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బ్యాగ్‌లు తగిలించుకున్న ఇద్దరు ముసుగు వ్యక్తులు అన్షుల్‌ను వెంబడించినట్లు సీసీటీవీ విజువల్స్‌లో రికార్డైంది. అన్షుల్ వద్ద ఉన్న నగదు, ఫోన్, ఇతర వస్తువులు ఏవీ దొంగిలించకపోవడంతో ఇది కేవలం దోపిడీ కాదని, పథకం ప్రకారం చేసిన హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ఈ ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. నిందితులను పట్టుకునేందుకు స్థానిక అమెరికన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. అన్షుల్ భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా తెలంగాణకు రప్పించేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కేంద్ర విదేశాంగ శాఖను, స్థానిక ప్రతినిధులను కోరారు.
పిజ్జా డెలివరీ అనేది అతన్ని “చంపడానికి” పన్నిన ఒక “పన్నాగం” అని అన్షుల్ సోదరి తన్వి ఆరోపించారు. “ఒక నిర్మానుష్య ప్రాంతంలో పిజ్జా డెలివరీ చేయమని అతనికి చెప్పారు, కానీ అది కేవలం ఒక ఎర అని మాకు తర్వాత తెలిసింది. అక్కడ ఎవరూ లేరు. అది అతన్ని చంపడానికే పన్నిన కుట్ర. వారికి దీనివల్ల ఏం దక్కిందో లేదా వారి ఉద్దేశాలు ఏమిటో మాకు తెలియదు. వారు నా సోదరుడిని తీసుకెళ్లి చంపేశారు,” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ, తమ పిల్లలను అమెరికాకు పంపవద్దని తన్వి ప్రజలను కోరారు.
“తమ పిల్లలను అమెరికాకు పంపాలని ఆలోచిస్తున్న తల్లిదండ్రులందరికీ ఇదొక సందేశం. నా సోదరుడు ఎంతో ఆప్యాయత కలిగిన, ఉల్లాసభరితమైన వ్యక్తి. అతనికి అమెరికా వెళ్లడానికి బలమైన కారణమేమీ లేదు. కానీ మేము అతన్ని అక్కడికి పంపాము. అతనికి కూడా అక్కడికి వెళ్లాలని లేదు, కానీ వెళ్లాడు. చివరికి ఏమైందో చూడండి. మీ పిల్లలను అమెరికాకు పంపకండి,” అని ఆమె హెచ్చరించారు.
More Stories
షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలకు పహల్గాం దాడి సూత్రధారి
ఇజ్రాయెల్ – లెబనాన్ మధ్య చరిత్రాత్మక ఒప్పందం
డెన్మార్క్ లో ఇస్లామిక్ ప్రార్థన `అజాన్’పై దేశవ్యాప్త నిషేధం!