స్మిత్ మచ్ఛార్‌ కు యుఏఈ అత్యున్నత పౌరపురస్కారం

ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిని ఎదుర్కొని 174 మంది ప్రయాణికులను కాపాడిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యుఏఈ) అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన ‘ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ II’తో సత్కరించింది. దీంతో ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయుడు మచ్ఛార్ చరిత్ర సృష్టించారు. అయితే, భారత్-యుఏఈ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతానికి విశేషంగా కృషి చేసినందుకు ఆయన కంటే ముందే ఇద్దరు భారతీయులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 
 
ధైర్యసాహసాలకు గాను మచ్ఛార్ ఈ అవార్డును పొందగా, అంతకుముందు పొందిన ఆ ఇద్దరూ భారతీయ దౌత్యవేత్తలు. సెప్టెంబరు 30న ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో ఒమాన్ జాతీయుడైన సహ-పైలట్ జరిపిన దాడి సమయంలో ప్రాణాలకు తెగించి పోరాడిన మచ్ఛార్, సిబ్బందిని అభినందిస్తూ యూఏఈ అధ్యక్షుడు షేఖ్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ‘ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ II’ పురస్కారాన్ని ప్రకటించారు. 
 
యూఏఈ యువరాజు ప్రిన్స్ షేఖ్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఈ అవార్డులను వారికి అందజేశారు ‘ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ II’ అనేది విదేశీ దౌత్యవేత్తలు, సీనియర్ అధికారులు, అంతర్జాతీయ ప్రముఖులు విశిష్ట సేవలకు గాను యూఏఈ ప్రభుత్వం అందజేసే ఉన్నత స్థాయి పౌర పురస్కారం. ఇది ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’ కంటే భిన్నమైనది (ఈ ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’‌ను ప్రధాని నరేంద్ర మోదీ 2019 ఆగస్టులో అందుకున్నారు). 
 
యూఏఈ వ్యవస్థాపక అధ్యక్షుడు, 1971 నుంచి 2004లో మరణించే వరకు పరిపాలించిన షేఖ్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ జ్ఞాపకార్థం ఈ ‘ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ II’ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. ఈ పురస్కారాన్ని పొందిన మొదటి భారతీయుడు నవదీప్ సింగ్ సూరి. ఆయన డిసెంబరు 2016 నుంచి సెప్టెంబరు 2019 వరకు యూఏఈలో భారత రాయబారిగా సేవలందించారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను బలోపేతం చేయడంలో చూపిన ప్రతిభకు గాను 2019 సెప్టెంబరులో అప్పటి యూఏఈ విదేశాంగ మంత్రి షేఖ్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు.
సూరికి ఇచ్చిన ఆరేళ్ల తర్వాత నవంబరు 2021 నుంచి సెప్టెంబరు 2025 వరకు యూఏఈలో భారత రాయబారిగా పనిచేసిన సంజయ్ సుధీర్‌కు 2025 సెప్టెంబరు 17న యూఏఈ అధ్యక్షుడు షేఖ్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.  ఫిబ్రవరి 2022లో కుదిరిన భారత్-యూఏఈ ‘కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ అగ్రిమెంట్’ (సిఈపిఎ) చర్చలు, అమలులో ఆయన పాత్ర విశేషమైనది. 

 

About The Author