గిల్గిట్-బాల్టిస్తాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించి, ఆ ప్రాంతాలను తమ ఐదో ప్రావిన్స్‌గా మార్చుకోవాలనే పాక్ కుట్రలను భారత్ పూర్తిగా తిప్పికొట్టింది. 1947 అక్టోబర్ 26న కుదిరిన చారిత్రాత్మక విలీన ఒప్పందం ప్రకారం జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాల సరిహద్దుల్లోని భూభాగాలన్నీ ఎప్పటికీ భారతదేశంలో భాగమేనని కేంద్రం పునరుద్ఘాటించింది.
పాకిస్తాన్ తన దేశంలో ఉన్న అంతర్గత ఆర్థిక, రాజకీయ విఫల సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ‘ఎన్నికల డ్రామా’ ఆడుతోందని భారత్ ఆరోపించింది. అది భారతదేశ భూభాగమని, దానిని పాక్ చట్టవిరుద్ధంగా, బలవంతంగా ఆక్రమించిందని పేర్కొంది.
పాక్ చేస్తున్న ఇటువంటి ప్రయత్నాలు తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘనలు, రాజకీయ అణచివేత, ఆర్థిక దోపిడీ, స్వేచ్ఛను హరించడం లాంటివి ఆ దేశ అంతర్లీన ప్రాథమిక సమస్యలను దాచలేవని భారత్ తేల్చిచెప్పింది. అక్కడ బలవంతంగా స్థానిక జనాభా నిష్పత్తిని మార్చేందుకు, స్థానికులను అణచివేసేందుకు పాక్ ప్రయత్నిస్తోందని తీవ్రంగా మండిపడింది.
భారత సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసే ఎలాంటి చర్యలనూ సహించేది లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. “ఈ వివాదానికి అంతర్జాతీయంగా లేదా దౌత్యపరంగా ఉన్న ఏకైక పరిష్కారం.. పాకిస్తాన్ అక్రమంగా తన అధీనంలో ఉంచుకున్న గిల్గిట్-బాల్టిస్తాన్, పీఓకే సహా అన్ని భారత భూభాగాలను తక్షణమే ఖాళీ చేసి భారతదేశానికి అప్పగించడమే” అని కేంద్రం తెగేసి చెప్పింది.
కాగా, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని భారత్ మరోసారి సమర్థించుకుంది. పాకిస్థాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపే వరకు ఈ ఒప్పందం సస్పెన్షన్‌లోనే ఉంటుందని స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ 2025 ఏప్రిల్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత 1960లో చేసుకున్న సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేశామని, ఇది ఇకపైనా కొనసాగుతుందని తేల్చి చెప్పారు.

More Stories
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ ‘రాజకీయ ప్రేరేపితం’
ఇండియా కూటమిలో కాంగ్రెస్ పై సిపిఎం, జేఎంఎం అసంతృప్తి
టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్