రష్యాతో సంబంధాలను పరిమితం చేయాలంటూ భారత్‌పై పశ్చిమ దేశాలు ఒత్తిడి తెస్తున్నప్పటికీ, దానివల్ల తమపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడలేదని పుతిన్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన, బలమైన నాయకత్వం ఉన్న భారతదేశంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు నిష్పలమని చెప్పారు. ఈ ఒత్తిళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది ముఖ్యం కాదని, ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇరు దేశాల బంధానికి ఎటువంటి ఢోకా లేదని, భవిష్యత్తులోనూ ఇరుదేశాల మధ్య స్నేహం ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు.
రష్యా నుండి ముడి చమురు కొనుగోళ్లను తగ్గించుకోవాలని అమెరికా ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో పుతిన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికాతో భారతదేశానికి ఉన్న అనుబంధం వల్ల రష్యాతో ఉండే చిరకాల సంబంధాలకు ఎటువంటి ఆటంకం కలగదని, భారత్‌ను తాము ఒక “విశ్వసనీయ భాగస్వామి”గా పరిగణిస్తామని ఆయన పునరుద్ఘాటించారు.
మరోవైపు ఉక్రెయిన్ సంక్షోభంపై స్పందిస్తూ సమస్యను పరిష్కరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే ఉక్రెయిన్ ను ఒప్పించడమే ఇప్పుడు చేయాల్సిన పని అని పుతిన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలలో యూరోపియన్ యూనియన్ దేశాలు మధ్యవర్తులుగా వ్యవహరించగలవన్న మీడియా వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ఆయుధాలు సరఫరా చేయడం ఆపి, ఉక్రెయిన్ ను రాజీకి ఒప్పించడం ద్వారానే ఇయు ఈ వివాద పరిష్కారానికి సహాయపడగలదని సూచించారు.
రష్యాకు వ్యూహాత్మక ఓటమిని కలిగించాలని పదేపదే కోరుకునే పశ్చిమ దేశాలను తాము ఎలా నమ్మగలమని ఆయన ప్రశ్నించారు. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అధ్యక్ష పదవీకాలం ముగిసిపోయిందని పేర్కొంటూ అధ్యక్షుడిగా ఆయన చట్టబద్ధతను ప్రశ్నించారు. ఉక్రెయిన్ సంక్షోభం `ప్రాంతీయ’ సమస్య మాత్రమేనని, కానీ ఇరాన్ సమస్య ప్రపంచ సమస్య అని పేర్కొన్నారు.
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి దోహదపడే ఏ నిర్ణయానికైనా మద్దతు ఇవ్వడానికి రష్యా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రష్యా-భారత్ రక్షణ సంబంధాలపై మాట్లాడిన పుతిన్, బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణుల సంయుక్త అభివృద్ధి, ఉత్పత్తిని విజయవంతమైన భాగస్వామ్యానికి ఉదాహరణగా పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా రక్షణ రంగంలో సహకారాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఐదో తరం సాంకేతికత కలిగిన సు-57 యుద్ధ విమానాల తయారీలో కలిసి పనిచేయాలని భారత్‌కు రష్యా ప్రతిపాదించిందని వెల్లడించారు. ఈ రంగంలో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు రష్యా సిద్ధంగా ఉందన్నారు. ప్రధాన రక్షణ వేదికలు, అధునాతన ఆయుధ వ్యవస్థలకు సంబంధించిన కీలక సాంకేతికతలను భారత్‌తో పంచుకునేందుకు తమకు అభ్యంతరం లేదని చెప్పారు.

More Stories
ఇస్లాంలోకి మారమని బాస్ వత్తిడితో విప్రో ఉద్యోగిని రాజీనామా!
తీవ్రతరం దాలుస్తున్న రైతులు, జంతువుల ఘర్షణలు!
కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలు పని చేయడం లేదు