కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజలు ఆ పాలనపై విసుగుచెందారని, కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలు పని చేయడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గుజరాత్ ప్రజలు కాంగ్రెస్‌ను దూరంగాను ఉంచారని, కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లోనే ఇటీవల స్థానిక ఎన్నికలు జరిగితే అక్కడ కాంగ్రెస్ పాలనను అక్కడి ప్రజలు తిరస్కరించారని, హరియాణా, పంజాబ్‌లో కూడా ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరలించారని ప్రధాని గుర్తు చేశారు.
సూరత్ నగరంలో ప్రధాని శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుట్టారు. రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన రూ.18,800 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. రాజకీయ లబ్ధి కోసం దేశాన్ని అస్థిరపరిచేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గత 12 ఏళ్లుగా కాంగ్రెస్ గందరగోళం, అనిశ్చితిని సృష్టిస్తూ అవకాశాల కోసం ప్రయత్నిస్తోందని, కానీ దేశ ప్రజలు దానికి పదేపదే తగిన జవాబు ఇచ్చారని తెలిపారు
ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ రెండున్నర దశాబ్దాలకు పైగా గుజరాత్ ప్రజలు బీజేపీపై చూపిస్తున్న ఆదరణ తమమై మరింత బాధ్యతను పెంచిందని ప్రధాని తెలిపారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి లభించిన ఘన విజయం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆత్మనిర్భర భారత్’ పథకంపై కాంగ్రెస్ పార్టీతోపాటు, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పదేపదే విమర్శలు చేయడాన్ని ప్రధాని మోదీ తప్పుబట్టారు.
దేశ సంకల్పాన్ని కాంగ్రెస్ నేతలు తక్కువ చేస్తున్నారని మోదీ విమర్శించారు. ఏ దేశమైనా ఇతర దేశాల మీద ఆధారపడితే ఉన్నతస్థాయికి చేరుకోలేదనే విషయాన్ని ఈ నేతలు మర్చిపోయారని పరోక్షంగా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ప్రధాని ధ్వజమెత్తారు. ‘‘ఎన్డీయే తెచ్చిన ‘ఆత్మనిర్భర భారత్’ కార్యక్రమాన్ని తప్పుబట్టేందుకు కొందరు వరుసగా ప్రెస్మీట్లు పెడుతున్నారు. వాళ్లు నిరంతరం దేశాన్ని తక్కువ చేస్తున్నారు. వాళ్లు ఎప్పుడూ భారత దేశం ఇతర దేశాలపై ఆధారపడాలని కోరుకుంటారు. అలా ఆధారపడ్డ ఏ దేశమైనా అభివృద్ధిలో ఉన్నతస్థాయికి చేరుకోలేదనే విషయాన్ని మర్చిపోతున్నారు” అని విమర్శించారు.
సూరత్‌ను కేవలం ఒక నగరంగా కాకుండా ఓ ప్రత్యేక స్ఫూర్తిగా తాను భావిస్తానని ప్రధాని పేర్కొన్నారు. నగర ప్రజల కృషి, చైతన్యం, అభివృద్ధి పట్ల వారి అంకితభావం సూరత్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయని చెప్పారు. ఒకప్పుడు ప్లేగు వ్యాధితో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన సూరత్ నేడు పరిశుభ్రతకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. పరిశుభ్రతలో విజయాలు సాధించినప్పటికీ సూరత్ ప్రజలు అక్కడితో ఆగిపోకుండా మరింత శ్రమిస్తున్నారని ప్రధాని ప్రశంసించారు.
ఇటీవల నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడం అభినందనీయమని చెప్పారు. స్వచ్ఛ భారత్ లక్ష్యాల సాధనలో సూరత్ ప్రజలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. అంతకుముందు ప్రధాని మోదీ సూరత్‌లోని హజీరా ప్రాంతంలో ఉన్న లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ) అత్యాధునిక తయారీ కేంద్రాన్ని సందర్శించారు.
ఎ.ఎం. నాయక్ హెవీ ఇంజినీరింగ్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న పారిశ్రామిక కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎల్అండ్టీ వివిధ రంగాల్లో సాధిస్తున్న సాంకేతిక ఆవిష్కరణలను వీక్షించిన ప్రధాని, రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా సంస్థ పోషిస్తున్న పాత్రను అభినందించారు. డీఆర్డీవో, ఎల్అండ్టీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘జోరావర్’ తేలికపాటి యుద్ధ ట్యాంకుతో పాటు ఇతర రక్షణ పరికరాల గురించి అధికారులు ప్రధానికి వివరించారు.
సూరత్‌లో ప్రారంభించిన ప్రాజెక్టుల్లో 200 పడకల ఈఎస్ఐసీ ఆస్పత్రి కూడా ఉంది. అలాగే దమన్‌లో నామో ఎయిర్‌పోర్టు నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించనున్నారు. మొత్తం మీద గుజరాత్, దమన్ ప్రాంతాల్లో దాదాపు రూ.22 వేల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుట్టారు. దేశంలో మౌలిక సదుపాయాల విస్తరణ, పారిశ్రామికాభివృద్ధి, రక్షణ రంగ స్వావలంబనకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
More Stories
తీవ్రతరం దాలుస్తున్న రైతులు, జంతువుల ఘర్షణలు!
భారత్- చైనా సరిహద్దు వివాదంలో రష్యా జోక్యం చేసుకోదు
టీఎంసీ రెబల్ ఎమ్మెల్యేలతో 23 మంది ఎంపీల మంతనాలు!