ప్రభుత్వ సిలబస్ అమలు చేయని కార్పొరేట్ విద్యా సంస్థలు

ప్రభుత్వ సిలబస్ అమలు చేయని కార్పొరేట్ విద్యా సంస్థలు
* తెలుగు భాష నేర్పించడానికి వర్చువల్ అకాడమీ ఏర్పాటు
చైతన్య, నారాయణ, భాష్యం వంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ సిలబస్‌ అమలు చేయడం లేదని ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్మన్ ఆర్‌‌డి విల్సన్ శరత్ చంద్ర విమర్శించారు. ప్రైవేట్ విద్యా సంస్థలు అకాడమీ పుస్తకాలు కొనుగోలు చేయడం లేదని, దీనివల్ల అకాడమీకి తీరని నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  ప్రభుత్వ సిలబస్ కాకుండా సొంతంగా తయారు చేసుకోవడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.
2010లో ఉమ్మడి రాష్ట్రంలో అకాడమీ పుస్తకాలు కొనుగోలు చేసేలా జిఓ విడుదల చేశారని, దీనిని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని వెల్లడించారు. అకాడమీ నష్టాల్లోకి పోకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి లోకేష్‌‌ను కోరామని తెలిపారు.  భవిష్యత్తులో ప్రతి కాలేజీని సందర్శిస్తామని చెబుతూ తెలుగు అకాడమీ కంటెంట్ వాడకుండా పైరసీ చేస్తే కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడినట్టు అవుతుందని ఆయన హెచ్చరించారు.
అకాడమీ ముద్రించే ఇంటర్ పుస్తకాలు పుస్తకాల షాప్‌‌లలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. లక్షలాది మంది ఇంటర్ విద్యార్థుల హక్కులు కాపాడ్డానికి అకాడమీ సిద్ధంగా వుంది స్పష్టం చేస్తూ  అకాడమీ కంటెంట్ వాడే ప్రైవేట్ పాఠశాలల పై కఠిన చర్యలకు సిఫారస్ చేస్తామని తెలిపారు. 
తమిళనాడులో 45 దేశాలకు తమిళం నేర్పిస్తున్న తరహాలో తెలుగు భాష నేర్పించడానికి వర్చువల్ అకాడమీ ఏర్పాటు చెయ్యాలన్న సంకల్పం తో ఈ బృహుత్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలియ చేస్తూ విల్సన్  దీనికి సంబందించిన డి పి ఆర్ మంత్రి లోకేష్ కి సమర్పిస్తున్నట్టు తెలియ చేశారు. ఈ కార్యక్రమం విజయ వంతం గా ముందుకు పోవడానికి ప్రాధమికం గా కనీసం రూ. 100 కోట్లు కేటాయించాలని కోరినట్టు ఆయన చెప్పారు. 
ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులతోపాటు ఇతర దేశాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి కూడా భాషను పరిచయం చేస్తామని చెప్పారు. అకాడమీ పోస్టుల భర్తీ విషయంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్‌‌సి)కు లేఖ రాశామని వెల్లడించారు.  ఎపిపిఎస్‌‌సి ఆలస్యం చేస్తే ఇతర ప్రభుత్వ ఏజెన్సీలకు అప్పగించాలని ఆయన కోరారు. అకాడమీ ఔనత్యం కాపాడాలంటే కేబినెట్ కేడర్ ఇవ్వాలని కోరారు.
తిరుపతి కేంద్రంగా సంస్కృత అకాడమీ అభివృద్ధి చేస్తామని, అందుకు గానూ తిరుమలలో ఐదెకరాలు కేటాయించాలని కోరారు. సంస్కృత భాష అభివృద్ధి కోసం టిటిడి నిధులు కేటాయించాలని విల్సన్ విజ్ఞప్తి చేశారు. జాతీయ సంస్కృత యూనివర్సిటీ తిరుపతిలో వున్న నేపథ్యంలో స్థల సేకరణ అనివార్యం అని పేర్కొన్నారు.