ఇరాన్‌పై కొనసాగుతున్న సైనిక చర్యల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్) గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది. కాంగ్రెస్ అనుమతి లేకుండా ఇరాన్‌పై సైనిక చర్యలు కొనసాగించరాదని స్పష్టం చేస్తూ డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది.
సభలో జరిగిన ఓటింగ్‌లో 215 మంది సభ్యులు అనుకూలంగా, 208 మంది వ్యతిరేకంగా ఓటు వేయడంతో తీర్మానం ఆమోదం పొందింది.
ఇరాన్ యుద్ధం నుంచి అమెరికా దళాలను ఉప-సంహరించుకోవాలని, అనవసర, భారీ ఖర్చుతో కూడిన ఈ సైనిక చర్యకు వెంటనే ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. అయితే, ఈ తీర్మానం సెనెట్‌కు వెళ్లాక అక్కడ కూడా ఆమోదం పొందితే చివరకు అధ్యక్షుడు ట్రంప్ వద్దకు చేరుతుంది. దీనిని ఆయన వీటో చేసే అవకాశం ఉంది. విదేశీ వ్యవహారాల కమిటీలో సభ్యుడు న్యూయార్క్ డెమొక్రాట్ ప్రతినిధి గ్రెగొరీ మీక్స్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై సభలో నిర్వహించిన ఓటింగ్‌లో నలుగురు రిపబ్లికన్లు అనుకూలంగా ఓటువేయడం గమనార్హం.
ట్రంప్ చర్యలను సొంత పార్టీ సభ్యులు వ్యతిరేకించడం చర్చనీయాంశంగా మారింది. రిపబ్లికన్లకు మెజార్టీ ఉన్న ప్రతినిధుల సభలో తొలిసారి ట్రంప్‌కు వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మానం ఆమోదం పొందడం గమనార్హం. కాంగ్రెస్ అధికారికంగా యుద్ధం ప్రకటించడం లేదా సైనిక చర్యలకు ఆమోదం తెలిపితే తప్పా ఇరాన్‌పై అమెరికా సైన్యాలు ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడకూడదని ట్రంప్‌ను ఈ తీర్మానం ఆదేశిస్తుంది.
ప్రతినిధుల సభ ‘యుద్ధ అధికారాల తీర్మానాన్ని’ ఆమోదించడం డొనాల్డ్ ట్రంప్‌కి భారీ ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. కానీ, గత మూడు నెలలుగా ఇరాన్‌తో కొనసాగుతోన్న సంఘర్షణను ఇప్పటికిప్పుడే ముగిస్తుందని చెప్పలేం. ఈ తీర్మానం ఆమోదంతో ఇరాన్‌పై ట్రంప్ చర్యలను అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారనే విషయం మరోసారి స్పష్టమవుతుంది. ఇలాంటి తీర్మానమే మే నెలాఖరులో సెనేట్‌లో ఒక కీలకమైన ప్రక్రియ దశను దాటింది. రిపబ్లికన్ల స్వల్ప నియంత్రణలో ఉన్న ఎగువ సభలో కూడా ఈ వారంలోనే ఇది ఆమోదం పొందొచ్చు.
అయితే, రిపబ్లికన్లు ఆమోదాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించవచ్చు. కాంగ్రెస్ అనుమతి లేకుండా ఫిబ్రవరి చివరిలో ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై దాడులు ప్రారంభించి రాజ్యాంగాన్ని ట్రంప్ ఉల్లంఘించారని డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు. యుద్ధ అధికారాల చట్టం ప్రకారం, అమెరికా బలగాలను యుద్ధంలోకి దింపిన తర్వాత అధ్యక్షులకు కాంగ్రెస్ ఆమోదం పొందడానికి 60 రోజుల సమయం ఉంటుంది. ఆ గడువు కొద్ది వారాల కిందటో ముగిసిందని, ఇప్పుడు ట్రంప్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని డెమొక్రాట్లు అంటున్నారు.
ఏప్రిల్‌లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో ఆ గడువు నిలిచిపోయిందని వాదిస్తూ వైట్ హౌస్ ఈ ఆరోపణలను ఖండిస్తోంది. ఇదే సమయంలో ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలపై పలు పర్యవేక్షణ సంస్థలు సంయుక్త విచారణ ప్రారంభించాయి. పెంటగాన్, విదేశాంగ శాఖ, యూఎస్ఎఐడీ ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయాలు ఈ దర్యాప్తులో పాల్గొంటున్నాయి. విదేశాల్లో 60 రోజులకు పైగా కొనసాగుతున్న సైనిక మిషన్లను సమీక్షించడం చట్టపరమైన బాధ్యతగా పేర్కొంటూ అధికారులు ప్రకటన విడుదల చేశారు.

More Stories
ఆధ్యాత్మికత, పర్యావరణం మేళవింపుతో గుండ్లకమ్మ పునరుద్ధరణ
నాయకత్వ సంక్షోభంలో ఇండియా కూటమి.. దూరంగా డీఎంకే
తరుణ్ సింగ్ తో సహా 11 మంది బిజెపి రాజ్యసభ అభ్యర్థులు