* ‘మీట్ ది ప్రెస్’లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు
తెలంగాణ రాష్ట్ర సాధనలో బీజేపీ పాత్రను ఎవరూ విస్మరించలేరని, అది చరిత్రలో నమోదైన సత్యమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు స్పష్టం చేశారు. చిన్న రాష్ట్రాలే సమర్థ పరిపాలనకు మార్గమని బీజేపీ మొదటి నుంచే నమ్మిందని, అదే ఆలోచనతో తెలంగాణకు మొదటి నుండి కట్టుబడి ఉన్నామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో “12 ఏళ్ల తెలంగాణ: ఆకాంక్షల సాధన – భవిష్యత్ ప్రయాణం” అంశంపై ‘మీట్ ది ప్రెస్’ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటూ తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ నిరంతరం ద్వంద్వ వైఖరి అవలంబిస్తే, బీజేపీ మాత్రం ఎప్పుడూ మాట మార్చకుండా నిలబడిందని గుర్తుచేశారు.
పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు బీజేపీ ఎలాంటి షరతులు లేకుండా బేషరతుగా మద్దతు ఇచ్చిందని నొక్కిచెప్పారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం వెనుక బీజేపీ జాతీయ నాయకత్వానికి ఉన్న పూర్తి రాజకీయ సంకల్పం, సుష్మా స్వరాజ్ పార్లమెంట్‌లో తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా అండగా నిలిచి ప్రకటించిన సంపూర్ణ మద్దతే కారణమని ఆయన తెలిపారు.
తెలంగాణ ఇచ్చామని చెప్పుకునేవారు చాలామంది ఉన్నా, బిల్లు పాస్ కావడంలో బీజేపీ చూపిన చిత్తశుద్ధి, నిబద్ధతలను ఎవరూ మర్చిపోలేరని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం 1200 మందికి పైగా విద్యార్థులు, అమాయక యువకుల బలిదానాల ఫలితమని, వారి త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేమని రాంచందర్ రావు భావోద్వేగంగా పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం ఏ ఒక్క పార్టీదో కాదని, అది జేఏసీలు, విద్యార్థులు, న్యాయవాదులు, ఉద్యోగులు, సకల జనుల సమిష్టి పోరాటమని స్పష్టం చేశారు.
రాష్ట్రం వచ్చినా ఉద్యమకారులకు నేటికీ తగిన గుర్తింపు, గౌరవం పూర్తిగా లభించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ఉద్యమం జరిగిందని, కానీ ఈ మూడు అంశాల్లో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశాయని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా కృష్ణా జలాల వాటా విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వాలు రాజీ ధోరణి అవలంబించి, రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టాయని ఆయన విమర్శించారు.
గోదావరి జలాల వినియోగంలో కూడా స్పష్టమైన పాలసీ లేదని, ప్రాజెక్టుల నమూనాలు మారుస్తూ గందరగోళం సృష్టించారని ధ్వజమెత్తారు. ఒకే ఒక్క ప్రాజెక్టుపై లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసినా రైతులకు ఆశించిన ప్రయోజనం దక్కలేదని, తాగు, సాగునీటిపై దీర్ఘకాలిక ప్రణాళిక లేకపోవడం వల్లే మన నీళ్లు ఇతర రాష్ట్రాలకు మళ్లుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉద్యమకారులైన విద్యార్థులపై కేసులు కొనసాగడం బాధాకరమని, నియామకాల విషయంలో బీఆర్ఎస్ దారుణంగా విఫలమైతే, కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోందని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ అమలు చేయకుండా ఈ రెండు ప్రభుత్వాలు యువతను వంచించాయని, నేడు గ్రూప్-1 పరీక్షల వివాదాలే ఇందుకు అద్దం పడుతున్నాయని తెలిపారు.
నిరుద్యోగులు నోటిఫికేషన్ల కంటే కోర్టుల చుట్టూనే ఎక్కువ తిరుగుతున్నారని, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఏళ్ల తరబడి అధ్యాపకుల శాశ్వత నియామకాలు చేపట్టకుండా, కేవలం అడ్హాక్, పార్ట్‌టైమ్ ఫ్యాకల్టీలతో నడపడం వల్ల ఉన్నత విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్వయంగా ప్రభుత్వమే ఆందోళన వ్యక్తం చేయాల్సి రావడం దురదృష్టకరమని రామచందర్ రావు తెలిపారు.
ఒకటో తేదీన ఉద్యోగుల జీతాలు ఇవ్వలేని దారుణ పరిస్థితి రాష్ట్రంలో ఉందని, రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ల కోసం, కాంట్రాక్టర్లు రూ. 20 వేల కోట్ల బకాయిల కోసం, విద్యార్థులు రూ. 10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఎదురుచూడాల్సి వస్తోందని విమర్శించారు. ఎన్నికల్లో బీజేపీ కేవలం హిందూ సమాజం అంశాన్నే అజెండాగా తీసుకోదని, అభివృద్ధి, సుపరిపాలన, ప్రజా సంక్షేమమే తమ ప్రధాన అజెండా అని ఆయన స్పష్టం చేశారు.
అభివృద్ధి, హామీల అమలులో విఫలమైనందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఓటమి భయంతో మళ్లీ ‘తెలంగాణ సెంటిమెంట్’ను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని బిజెపి నేత ఆరోపించారు. ప్రజలు వారి వైఫల్యాల ఆధారంగానే వారిని తిరస్కరిస్తున్నారని, ఆ భయంతోనే లేనిపోని భావోద్వేగాలను ముందుకు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన నేతలను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమలో చేర్చుకుని పదవులు ఇచ్చాయని, నాడు ఉద్యమకారులను అవమానించిన వారితో చేతులు కలిపిన చరిత్ర వారిదని గుర్తుచేశారు. తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా, ఇప్పుడు తెలంగాణ పేరుతో రాజకీయం చేయడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి పరాకాష్ట అని విమర్శించారు.

More Stories
కేరళలో ‘ఇస్లాం ఫ్రెండ్లీ జిమ్’ ప్రకటనపై దుమారం
టిఎంసిలో తిరుగుబా టుకు అభిషేక్ బెనర్జీ అహంకారమే కారణమా?
భారత రక్షణ సామర్ధ్యాల ఆధునీకరణలో డిఆర్డిఓ