సోషల్ మీడియా ద్వారా యువతను ఉగ్రవాద కార్యకలాపాల వైపు మళ్లించే ప్రయత్నాలు ఇటీవల పెరుగుతున్నాయి. తాజాగా, ఉత్తరాఖండ్‌లో సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు, పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ప్రయత్నాలు చేస్తున్నట్లు భద్రతా సంస్థలు గుర్తించాయి.
గత రెండు నెలల్లో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్ పోలీసులు నిర్వహించిన వేర్వేరు ఆపరేషన్లలో ఐదుగురు అనుమానితులను అరెస్టు చేయగా, వారిలో పలువురికి పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు, ఐఎస్ఐ ఏజెంట్లు సోషల్ మీడియా ద్వారా యువతను ప్రభావితం చేసి రాష్ట్రంలో తమ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఉత్తరాఖండ్ పోలీసు అధికారులు గుర్తించారు.
తెహ్రీక్-ఎ-తాలిబన్ హిందుస్థాన్ కోసం ‘లోన్ వోల్ఫ్’ మాడ్యూల్‌ను నడుపుతున్నాడనే ఆరోపణలపై ఉత్తరాఖండ్ ఎస్‌టిఎఫ్ 29 ఏళ్ల గ్యారేజ్ కార్మికుడు విక్రాంత్ కశ్యప్‌ను గత ఏప్రిల్ లో అరెస్టు చేసింది. అతను ఒక గ్యాంగ్‌స్టర్‌తో సహా పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్లతో సున్నితమైన సైనిక స్థావరాల సమాచారాన్ని పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) ప్రత్యేక నిఘా చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు సైబర్ కమాండోలను రంగంలోకి దింపారు.
ఇటీవల ఉత్తరప్రదేశ్ ఎస్‌టీఎఫ్ సహారన్‌పుర్ జిల్లాలో నలుగురు అనుమానితులను అరెస్టు చేసింది. వీరు పాకిస్థాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ల కోసం భారత్‌లో స్లీపర్ సెల్‌లుగా పనిచేస్తున్నారనే ఆరోపణలు వెలువడ్డాయి. అరెస్టైన వారిలో ఒకరు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాకు చెందిన వ్యక్తిగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. హరిద్వార్ జిల్లా రూర్కీలో నివసిస్తున్న ఓ మహిళా ఉపాధ్యాయురాలి ఇంటిపై జమ్ముకశ్మీర్ పోలీసులు దాడులు నిర్వహించగా ఆమెకు కూడా పాకిస్థాన్‌లో ఉన్న కొందరితో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
పాకిస్థాన్‌లోని వ్యక్తుల సూచనల మేరకు కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు, వివిధ మార్గాల ద్వారా నిధులను బదిలీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కేసులో మహిళను అరెస్టు చేసి తదుపరి విచారణ కోసం జమ్ముకశ్మీర్‌కు తరలించారు. అనుమానితులు పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థలు, విదేశీ హ్యాండ్లర్లతో సంప్రదింపులు కొనసాగించినట్లు ఉత్తరాఖండ్ పోలీసులు, ఎస్‌టీఎఫ్ గుర్తించాయి.
అరెస్టైన వ్యక్తులు ఇన్‌స్టాగ్రామ్, వీడియో కాల్స్, ఇతర సోషల్ మీడియా అప్లికేషన్ల ద్వారా సరిహద్దు అవతల ఉన్న వ్యక్తులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించారని తెలిసింది. హ్రదూన్లో అరెస్టైన విక్రాంత్ అనే అనుమానితుడు నగరంలోని గోడలపై “తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్” పేరును రాస్తూ ప్రచారం నిర్వహించినట్లు కూడా దర్యాప్తులో బయటపడింది. అతనితో సంబంధాలు కొనసాగించిన మిగతా వ్యక్తులు ఎవరన్న విషయంపై అధికారులు విచారిస్తున్నారు.

More Stories
మరోసారి నియోజకవర్గాల పునర్విభజన బిల్లు?
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదం.. 21 మంది సజీవ దహనం
విజయవంతంగా రుద్రమ్-2 క్షిపణి ప్రయోగం