కువైట్ ఎయిర్‌‌పోర్టుపై ఇరాన్ డ్రోన్ దాడిలో భారతీయుడు మృతి

కువైట్ ఎయిర్‌‌పోర్టుపై ఇరాన్ డ్రోన్ దాడిలో భారతీయుడు మృతి

కువైట్‌ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్‌ ‌వన్‌ భవనంపై బుధవారం తెల్లవారు జామున డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్‌ ‌దాడి జరిపింది. ఈ దాడిలో పలువురు గాయపడ్డారని కువైట్‌ ‌ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది. దీంతో విమానాలను కూడా దారి మళ్లించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. రక్షణ శాఖ ప్రతినిధి బ్రిగేడియర్‌ ‌సాద్‌ అబ్దుల్లా అజీజ్‌ అల్‌ ‌కైతబి మాట్లాడుతూ, విమానాశ్రయంలోని ప్రయాణికుల భవనాన్ని లక్ష్యంగా చేసుకుని అనేక డ్రోన్లు దాడి చేశాయని తెలిపారు.

భవనం తీవ్రంగా ధ్వంసమైందని పేర్కొన్నారు. అనేకమంది గాయపడ్డారని చెప్పారు. భారతీయుడు ఒకరు మృతి చెందారని అధికారులు తెలిపారు. కువైట్‌‌లోని భారత్‌ ఎంబసీ ఈ విషాద ఘటనకు సంతాపం తెలియచేస్తూ ఎక్స్‌‌లో పోస్టు పెట్టింది. బాధిత కుటుంబానికి అలాగే గాయపడిన వారికి అవసరమైన సాయం అందించడానికి సిద్ధంగా వున్నట్లు తెలిపింది. మృతుడి కుటుంబాన్ని సంప్రదించామని, అతడి కుటుంబానికి అవసరమైన సాయం అందిస్తామని ఎంబసీ ప్రకటించింది. 

ఈ విషయంలో కువైట్ అధికారులతో కూడా సంప్రదిస్తున్నామని తెలిపింది. ఈ దాడి ఘటనలో గాయపడ్డ ఇతర భారతీయులకు కూడా అవసరమైన వైద్య సాయం అందిస్తామని, బాధిత కుటుంబాల్ని సంప్రదిస్తామని ప్రకటించింది. ఈ మేరకు కువైట్‌లోని భారత ఎంబసీ తన ఎక్స్‌లో పోస్ట్ చేసింది.  ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో 63 మంది గాయపడ్డారని కువైట్ అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో ఎయిర్‌‌పోర్టు సిబ్బందితోపాటు ప్రయాణికులు కూడా ఉన్నారని వెల్లడించింది.

బాధితుల్లో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎయిర్‌‌పోర్టు వద్ద 25కుపైగా అంబులెన్స్‌లు సేవల్లో పాల్గొంటున్నాయని కువైట్ అధికారులు తెలిపారు.  కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. ఘర్షణల సమయంలో పౌరులను, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోకూడదని న్యూఢిల్లీ ఎప్పటినుంచో చెబుతోందని, అటువంటి దాడులను ఆపాలని అన్ని పక్షాలకూ పిలుపునిచ్చిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

“కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఈరోజు జరిగిన దాడిని మేము ఖండిస్తున్నాము. ఈ దాడిలో ఒక భారత జాతీయుడు మరణించగా, పలువురు మన జాతీయులు గాయపడ్డారు. పశ్చిమ ఆసియాలో ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి, పౌర జనాభాను, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోకూడదని మేము గట్టిగా కోరుతున్నాము. అటువంటి దాడులను విరమించుకోవాలని మేము పక్షాలకూ మరోసారి పిలుపునిస్తున్నాము,” అని భారత్ పేర్కొంది. ఈ ప్రాంతంలోని భారత రాయబార కార్యాలయాలు అప్రమత్తంగా ఉన్నాయని, కొనసాగుతున్న సంక్షోభం మధ్య భారతీయ సమాజానికి మద్దతునిస్తూనే ఉన్నాయని కూడా తెలిపింది.