మరోసారి నియోజకవర్గాల పునర్విభజన బిల్లు?

మరోసారి నియోజకవర్గాల పునర్విభజన బిల్లు?
నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్‌) బిల్లుకు మరోసారి పార్లమెంటరీ ఆమోదం పొందేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఎన్నికల విజయాల నేపథ్యంలో ఈ చట్టాన్ని పార్లమెంట్‌లో ఆమోదింపజేసే అవకాశాన్ని కేంద్రం మరోసారి అన్వేషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ బిల్లును పునఃప్రవేశపెట్టేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే డీలిమిటేషన్‌ బిల్లు, ఒక దేశం, ఒక ఎన్నిక బిల్లు రెండింటికీ పార్లమెంటరీ ఆమోదం పొందాలని ప్రభుత్వం ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. డీలిమిటేషన్‌ బిల్లును ఆమోదింపచేయడానికి ప్రభుత్వం గతంలో చేసిన ప్రయత్నానికి పార్లమెంట్‌లో అవసరమైన మద్దతు లభించకపోవడంతో ఈ అంశం మళ్లీ వెలుగులోకి వచ్చింది.

ఇటీవల పలు రాష్ర్టాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాజకీయ సమీకరణాలు గణనీయంగా మారిపోయాయి. తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌-డీఎంకే కూటమి విచ్ఛిన్నమైందన్న వార్తలు చర్చనీయాంశంగా ఉన్న కీలక పరిణామాల్లో ఒకటి. బిల్లుకు విస్తృత మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం డీఎంకేను సంప్రదించే ప్రయత్నాలను ప్రారంభించినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. 

గతంలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటువేసి డీఎంకే ఈ పర్యాయం కనీసం ఓటింగ్ సమయంలో గరాజరైనా ప్రభుత్వంకు ఉపశమనం కలుగుతుంది.  అదే సమయంలో తృణమూల్‌ కాంగ్రెస్‌లోని పరిణామాలను కూడా నిశితంగా గమనిస్తున్నారు. ఒకవేళ గణనీయ సంఖ్యలో ఎంపీలు టీఎంసీ నుంచి విడిపోతే అది పార్లమెంటరీ సమీకరణాలను మార్చివేసి బిల్లు ఆమోదానికి అవసరమైన మద్దతును కూడగట్టడంలో ప్రభుత్వానికి సులభతరం చేస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

పోయినసారి డీలిమిటేషన్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టినపుడు దాని ఆమోదం పొందేందుకు ప్రభుత్వానికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమైంది. అంటే బిల్లుకు అనుకూలంగా కనీసం 362 ఓట్లు అవసరం. అయితే బిల్లుకు 298 మంది సభ్యుల మద్దతు మాత్రమే లభించింది. బిల్లుకు వ్యతిరేకంగా 230 మంది ఎంపీలు ఓటు వేశారు. ఫలితంగా బిల్లుకు అవసరమైన సంఖ్యాబలం దక్కక సభలో వీగిపోయింది. ఈ సారి అదనపు మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.