పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో దేశీయ విమానయాన రంగానికి, ప్రయాణికులకు ఉపశమనం కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ‘విమాన ఇంధన ధరల స్థిరీకరణ నిధి’ ఏర్పాటు నిర్ణయానికి ఆమోదం లభించింది.
ఈ ఇంధన నిధి కోసం రూ.10,000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో విమాన ఇంధనం ధరలు పెరిగినప్పుడు ఆ భారం విమానయాన సంస్థలపై పడకుండా చమురు మార్కెటింగ్ సంస్థలకు ప్రభుత్వం ఈ నిధి నుంచి ఆర్థికసాయం అందిస్తుంది. ఇది వడ్డీలేని అడ్వాన్స్ రూపంలో అందుతుంది. దీనివల్ల ఇంధన ధరలు పెరిగినా చమురు సంస్థలు విమానయాన సంస్థలకు స్థిరమైన ధరలకే ఇంధనాన్ని సరఫరా చేయడానికి వీలవుతుంది.
ఈ ఇంధన నిధి కోసం ఓ ప్రత్యేకమైన రికవరీ విధానాన్ని రూపొందించారు. అంతర్జాతీయ మార్కెట్లో విమాన ఇంధన ధరలు తగ్గినప్పుడు ఆ మొత్తాన్ని చమురు సంస్థల నుంచి ప్రభుత్వం తిరిగి వసూలు చేస్తుంది. ఆ సొమ్మును ‘కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా’ కు జమ చేస్తారు. ఇలా నిధులు పూర్తిగా వసూలయ్యే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన ఇంధనం ధర 2026 మార్చిలో లీటరు రూ.60.50 ఉండగా, మే నాటికి ఏకంగా రూ.142 కు పెరిగింది. విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ ఖర్చులలో ఇంధనానికే 40 నుంచి 60 శాతం వరకు ఖర్చవుతుంది. పాకిస్థాన్ గగనతలం మూతపడటంతో విమానాలు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఈ కొత్త నిధివల్ల ఇంధన ధరలు అదుపులో ఉండి ప్రయాణికులపై టికెట్ ధరల భారం పడకుండా ఉంటుంది.
ఈ పథకం కింద విమానయాన సంస్థలు, చమురు సంస్థల మధ్య ఓ అవగాహన ఒప్పందం కుదురుతుంది. దీని ప్రకారం విమానయాన సంస్థలు రాబోయే 36 నెలలపాటు కేవలం ఈ చమురు సంస్థల నుంచే ఇంధనాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంవల్ల దేశంలోని టైర్-2, టైర్-3 నగరాలకు విమాన సర్వీసులు నిరంతరాయంగా కొనసాగుతాయి. అలాగే విమానయాన రంగంపై ఆధారపడిన లక్షలాది ఉద్యోగాలకు రక్షణ ఉంటుంది.

More Stories
భారత్ సహా 54 దేశాలపై అమెరికా 12.5శాతం అదనపు సుంకం
హర్మూజ్‌కు ప్రత్యామ్నాయంగా ఒమాన్ తీరం నుండి చమురు రవాణా
`పిఎం స్వానిధి’ ద్వారా 80 లక్షల వీధి వ్యాపారులకు రూ 17,800 కోట్లు