కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజాద్రోహ పాలనపై బీజేపీ నేతల ఆగ్రహం 

కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజాద్రోహ పాలనపై బీజేపీ నేతల ఆగ్రహం 
 
* బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు
  
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా  బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్  జాతీయ పథకాన్ని ఆవిష్కరిస్తూ భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినా, తెలంగాణకు నిజమైన స్వేచ్ఛ 2014 జూన్ 2వ తేదీనే లభించిందని స్పష్టం చేశారు. 
 
తెలంగాణ సాధనలో ఎందరో తామే తెచ్చామని ప్రగల్భాలు పలుకుతున్నారని, కానీ 1947 నుండి 2014 వరకు తెలంగాణ కోసం నిరంతరం కొట్లాడింది, పార్లమెంట్‌లో ఇచ్చింది, ఇప్పుడు అభివృద్ధి చేస్తోంది కూడా బీజేపీయేనని సగర్వంగా ప్రకటించారు.  నేడు దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ రెండో స్థానంలో ఉండటానికి, ఇక్కడ అత్యధికంగా ధాన్యం పండటానికి ప్రధాని నరేంద్ర మోదీ చలవే కారణమని గుర్తుచేశారు.
 
తెలంగాణకు మొదటి బలిదేవుడు నెహ్రూ అని, రజాకార్ల అరాచకాల్లో తెలంగాణ నలుగుతున్నా నెహ్రూ పట్టించుకోలేదని, సర్దార్ వల్లభాయ్ పటేల్ ‘ఆపరేషన్ పోలో’ ద్వారానే సెప్టెంబర్ 17న తెలంగాణకు విమోచనం కలిగిందని వివరించారు. అప్పట్లో ఆర్ఎస్ఎస్, ఆర్యసమాజ్, హిందూ మహాసభలు కీలక పాత్ర పోషించాయని తెలిపారు. ఆ తర్వాత కూడా నెహ్రూ బలవంతంగా తెలంగాణను ఆంధ్రలో కలిపారని, 1969 తొలిదశ ఉద్యమంలో 369 మంది యువకులను కాంగ్రెస్ తూటాలకు బలి తీసుకుందని, అందుకు రెండో బలిదేవత ఇందిరాగాంధీ అని దుయ్యబట్టారు. 
 
2004లో యూపీఏ అధికారంలోకి వచ్చినా తెలంగాణ ఇవ్వకుండా 1000 మందికి పైగా యువతను బలితీసుకున్న మరో బలిదేవత సోనియా గాంధీ అని ఆరోపించారు.  కానీ బీజేపీ ఎన్నడూ వెనకడుగు వేయకుండా, 1997 కాకినాడ తీర్మానంలో ‘ఒక్క ఓటు – రెండు రాష్ట్రాలు’ అనే తీర్మానంకు కట్టుబడి ఉందని గుర్తు చేశారు.  వాజ్ పేయి  హయాంలో 2000లో ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ అనే మూడు చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేసి పరిపాలనా దక్షతను నిరూపించారని గుర్తుచేశారు.
మలిదశ ఉద్యమంలో జేఏసీ ఆధ్వర్యంలో బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, విద్యాసాగర్ రావు, స్వర్గీయ ఆలె నరేంద్ర, కిషన్ రెడ్డి నిస్వార్థంగా పోరాడారని కొనియాడారు.
2012లో అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు 80 నియోజకవర్గాల్లో 3000 కిలోమీటర్ల పొడవునా చేసిన ‘తెలంగాణ పోరు యాత్ర’ చారిత్రాత్మకమైనదని తెలిపారు. పార్లమెంట్‌లో తెలంగాణ చిన్నమ్మ స్వర్గీయ సుష్మా స్వరాజ్ లేడీ సింగంలా గర్జించి కాంగ్రెస్‌ను నిలదీయడం వల్లే ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు సాధ్యమైందని స్పష్టం చేశారు. 
 
అయితే, ఇంతమంది త్యాగాలతో సిద్ధించిన తెలంగాణలో కొన్ని కుటుంబాలు మాత్రం లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకుని ఫామ్‌హౌస్‌లలో ఎంజాయ్ చేస్తుంటే, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.  యువతకు ఉద్యోగాలు, ఉపాధి లేక పెళ్లిళ్లు కూడా కాని దౌర్భాగ్య స్థితి నెలకొందని చెబుతూ గడిచిన 12 ఏళ్లలో రూ. 24 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి, రూ. 10 లక్షల కోట్ల అప్పులు చేసినా, ఉద్యమకారుల సంక్షేమం కోసం కనీసం రూ. 500 కోట్లు కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు.
ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్ ఒక ‘వీక్లీ వేజ్ గవర్నమెంట్’ లా మారిందని, ప్రతి వారం ఢిల్లీకి మూటలు పంపితే తప్ప ముఖ్యమంత్రి పదవి రివ్యూ కాదనే పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.  దేశంలో కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో, కేవలం తెలంగాణ నుంచే 60 లక్షల మెట్రిక్ టన్నులను (70 శాతం) మోదీ ప్రభుత్వం కొనుగోలు చేసిందని గణాంకాలతో వివరించారు. రైతులకు న్యాయం చేయడం చేతకాకుంటే కాంగ్రెస్ మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి గింజనూ కొని రైతును ఆదుకుంటుందని సవాల్ విసిరారు. 
 
హర్యానా మాజీ గవర్నర్  బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, 2005లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న రాజ్‌నాథ్ సింగ్ గారి నేతృత్వంలో తెలంగాణకు అనుకూలంగా జాతీయ కార్యవర్గంలో తీర్మానం చేసిన మొట్టమొదటి రాజకీయ పార్టీ బీజేపీయేనని గుర్తుచేశారు. ఆ తీర్మానంతోనే కాంగ్రెస్‌లో చలనం వచ్చి ఉద్యమం ఉవ్వెత్తున లేచిందని పేర్కొన్నారు. 
 
నీళ్లు, నియామకాల ప్రాతిపదికన తెలంగాణ వస్తే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం గానీ, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం గానీ నీటి విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశాయని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారీ అవినీతికి పాల్పడిందని విమర్శిస్తూనే, ఇప్పటివరకు ఆ అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. 
 
తాను పంచాయతీ కోరను, పరిష్కారం కోరతానని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న మాటలను ప్రస్తావిస్తూ, మరి పంచాయతీ లేకపోతే మేడిగడ్డ బారేజీ రిపేర్లను ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆసిఫాబాద్, రామగుండం, మంచిర్యాల తదితర ప్రాంతాల్లో రైతులు సాగునీరు అందక అల్లాడుతున్నారని, ఈ పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మండిపడ్డారు. 

బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ కు అధికారం అప్పగిస్తే దారుణ పాలన చేస్తోందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఈ జనరేషన్ ట్రిపుల్ ఆర్ సినిమా మాత్రమే చూసిందే. కానీ  ఓటేసిన పాపానికి ‘‘ట్రిపుల్ సీ’’ సినిమా చూపిస్తోందని,  అంటే.. ‘‘కన్ఫ్యూజన్ ,కరప్షన్,  కమీషన్@కాంగ్రెస్ దటీస్ ట్రిపుల్ సీ అని ఎద్దేవా చేశారు. 6 గ్యారంటీల అమలులో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ను చూసి జనం అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. 6 గ్యారంటీలు, వడ్ల కొనుగోలు అంశంపై ప్రజలను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విబేధాలు స్రుష్టించి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వస్తే నిజాం, రజాకారుల క్రూర పాలన వల్ల తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17న విమోచనం కలిగిందని తెలిపారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేవలం దోపిడీ మాత్రమే జరిగిందని, మార్పు వస్తుందని కాంగ్రెస్‌ను నమ్మితే తెలంగాణ ప్రజలు మళ్లీ కబంద హస్తాల్లో చిక్కుకున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు కలలు గన్న నిజమైన స్వేచ్ఛ, సామాజిక తెలంగాణ కేవలం బిజెపి వల్లే సాధ్యమవుతుందని నొక్కి చెప్పారు. 
 
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితర నాయకులు కూడా పాల్గొన్నారు.