ఓఎంఆర్ మోడ్లోనే నీట్- యూజీ రీ ఎగ్జామ్

ఓఎంఆర్ మోడ్లోనే నీట్- యూజీ రీ ఎగ్జామ్

జూన్ 21న జరగనున్న నీట్ పునఃపరీక్షను ‘కంప్యూటర్ ఆధారిత పరీక్ష’ (సీబీటీ) విధానంలో నిర్వహించాలని ఆర్​జేడీ ఎంపీ సుధాకర్‌సింగ్ దాఖలు చేసిన పిటిషన్​ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఉన్న పెన్​ అండ్ పేపర్​  విధానంలోనే నీట్ పునఃపరీక్ష నిర్వహించాలని జస్టిస్ పీఎస్ నరిసింహ, జస్టిస్ అరవింద్ కుమార్‌ల ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. 

అకస్మాత్తుగా పరీక్షా విధానాన్ని మార్చడం ఆచరణాత్మకంగా కష్టమని ధర్మాసనం అభిప్రాయపడింది. సమయాభావం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్​టీఏ)పై ఉన్న ఒత్తిడిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. తర్వాత ఎంపీ సుధాకర్ సింగ్​ సహా, ఇతరులు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు జూలై 27కు వాయిదా వేసింది.

మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 3న నీట్​-యూజీ పరీక్షలో పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు విద్యార్థుల భవిష్యత్​ను దృష్టిలో ఉంచుకొని ఈ పరీక్షను తిరిగి (రీటెస్ట్​) జూన్​ 21న నిర్వహించేందుకు ఎన్​టీఏ సిద్ధమైంది.  ఈ నేపథ్యంలోనే ఎలాంటి లీకేజీలకు తావు లేకుండా పరీక్షను సీబీటీ విధానంలో జరపాలని కోరుతూ ఆర్​జేడీ ఎంపీ సుధాకర్​ సింగ్​తో పాటు మరికొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

వీటిపై విచారణ జరుపుతూ, పిటిషనర్ల తరఫున హాజరైన అడ్వకేట్ సత్యం సింగ్ రాజ్​పుత్​ను ఉద్దేశించి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.  “రీ-ఎగ్జామినేషన్​ సీబీటీ విధానంలో నిర్వహించే ప్రశ్నే లేదు. ఎన్​టీఏ ఇప్పటికే చాలా సమస్యలను ఎదుర్కొంటోంది. నీట్ పరీక్ష రద్దు అయ్యింది కనుక ఇప్పుడు దానిని మళ్లీ నిర్వహిస్తున్నారు. కనుక ఈ పిటిషన్​ను మేము ఇప్పుడే కొట్టివేయాలా లేదా వేసవి సెలవుల తర్వాత కొట్టివేయాలా?” అని ప్రశ్నించింది.

దీనిపై న్యాయవాది సత్యం సింగ్ రాజ్​పుత్​ స్పందిస్తూ, “మేము నీట్​-రీటెస్ట్​ను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలని మాత్రమే అభ్యర్థిస్తున్నాం. మరేమీ కాదు” అని తెలిపారు. అయితే ఇలాంటి పిటిషన్లను గతంలోనే సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది.   

కాగా, వైద్య విద్య ప్రవేశ పరీక్షలను నిర్వహించడానికి ఎన్​టీఏ స్థానంలో మరింత బలమైన, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేయాలని లేదా ఎన్​టీఏను పునర్వ్యవస్థీకరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలు అయ్యాయి. ప్రస్తుతం వాటిపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపుతోంది.  ఈ నేపథ్యంలోనే ఎన్​టీఏ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్​ లో, తాము కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించామని, వచ్చే ఏడాది నుంచి పెన్​-అండ్-పేపర్ విధానానికి బదులుగా సీబీటీ విధానంలో నీట్​-యూజీ పరీక్ష నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.