సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త జడ్జీల నియామకం

సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త జడ్జీల నియామకం
సుప్రీంకోర్టులో ఐదుగురు కొత్త న్యాయమూర్తులను  నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ అధికారికంగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇటీవలే భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన పేర్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఈ నియామకాలు ఖరారు అయ్యాయి. నూతనంగా బాధ్యతలు చేపట్టనున్న వారిలో నలుగురు వివిధ రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కాగా, మరొకరు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కావడం గమనార్హం.
 
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందిన వారిలో జస్టిస్‌ శ్రీ చంద్రశేఖర్‌ ప్రస్తుతం బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు. అలాగే జస్టిస్‌ షీల్‌ నాగు ప్రస్తుతం పంజాబ్, హర్యనా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్న జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవ్‌, జమ్మూ కాశ్మీర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న జస్టిస్‌ అరుణ్‌ పళ్లి, సుప్రీం కోర్టుకు చెందిన ప్రముఖ సీనియర్ మహిళా న్యాయవాది వి. మోహనలు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఎన్నికయ్యారు. 
 
సీనియర్ న్యాయవాది వి. మోహన ఎంపిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుత జాబితాలో బార్ అసోసియేషన్ నుంచి నేరుగా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన ఏకైక వ్యక్తి ఈమే కావడం విశేషం.  1988లో కోయంబత్తూరు లా కాలేజీ నుంచి ప్రతిష్టాత్మక ఐదేళ్ల లా డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థిగా ఆమె న్యాయశాస్త్ర పట్టా పొందారు. ఆ తర్వాత న్యాయ రంగంలో అంచలంచెలుగా ఎదుగుతూ సుప్రీం కోర్టుకు చెందిన దిగ్గజ న్యాయవాదులు ఇందు మల్హోత్రా, సీఎస్‌ వైద్యనాథన్‌ల వద్ద జూనియర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించారు.
1996లో అడ్వకేట్-ఆన్-రికార్డ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత, ఢిల్లీ హైకోర్టుతో పాటు సుప్రీం కోర్టులో స్వతంత్రంగా వకాల్తా పుచ్చుకున్నారు. తన సుదీర్ఘ కెరీర్‌లో దేశంలోనే అగ్రశ్రేణి న్యాయకోవిదులైన కపిల్‌ సిబల్, కేకే వేణుగోపాల్, పి. చిదంబరం, అరుణ్ జైట్లీ, అంద్యార్జునల వంటి ప్రముఖులతో కలిసి పలు కీలక కేసుల్లో పని చేశారు.
ఆమె ప్రతిభను గుర్తిస్తూ 2015 ఏప్రిల్ 23న సుప్రీంకోర్టు ఆమెకు ‘సీనియర్ న్యాయవాది’ హోదాను కల్పించింది.
జస్టిస్ వి. మోహన నియామకంతో సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య రెండుకు చేరుకుంది.  సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను ఇటీవల కేంద్ర ప్రభుత్వం 34 నుండి 38కి పెంచిన తర్వాత ఈ ఐదుగురి నియామకం గురించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సిఫార్సు చేశారు. వీరు నియామకంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరుకుంది. కాగా, సుప్రీంకోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య 97 వేలకు పైగా ఉంది.