పౌరుల నేతృత్వంలో స్ఫూర్తిదాయకమైన మార్పులు 

పౌరుల నేతృత్వంలో స్ఫూర్తిదాయకమైన మార్పులు 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పౌరుల నేతృత్వంలోని స్ఫూర్తిదాయకమైన మార్పుల ఉదాహరణలను ప్రముఖంగా ప్రస్తావించారు. బస్తీకి చెందిన ఆకాష్ గుప్తాను  ఆదివారం మన్‌కీ బాత్‌ 134వ ఎపిసోడ్‌లో  ఆయన ప్రత్యేకంగా ఉదహరించారు. అతను తన స్నేహితులతో కలిసి మనోరమ నది నుండి ప్లాస్టిక్, నీటి హైసింత్‌లను తొలగించి, పరిశుభ్రతను పునరుద్ధరించడంలో, స్థానిక సమాజంలో అవగాహన పెంచడంలో సహాయపడ్డాడు. 
 
అలాగే, గోవాకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు బాలకృష్ణ అయ్య కథను కూడా ఆయన పంచుకున్నారు. బాలకృష్ణ అయ్య, మద్ది-తోలప్ ప్రాంతంలో నీటి కొరతను పరిష్కరించడానికి చొరవ తీసుకుని, నీటి పైప్‌లైన్‌ల ఏర్పాటుకు సహకరించి, అనేక కుటుంబాలకు నీటి సరఫరాను నిర్ధారించారు.  సైన్స్ పట్ల భారతదేశంలో పెరుగుతున్న ఆసక్తిని ప్రస్తావిస్తూ,  ప్రధాని మోదీ దేశానికి ఉన్న ఖగోళ శాస్త్రంలోని గొప్ప సంప్రదాయం, యువతలో పెరుగుతున్న భాగస్వామ్యం గురించి మాట్లాడారు.
బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ, ఖగోల్ మండల్, ఆస్ట్రో-కేరళం, ఐజాక్ వంటి సంస్థలు వర్క్‌షాప్‌లు, నైట్ క్యాంపులు, విద్యా కార్యక్రమాల ద్వారా ఖగోళ శాస్త్రాన్ని చురుకుగా ప్రోత్సహిస్తున్నాయని ఆయన కొనియాడారు.  అంతరిక్ష శాస్త్రంపై తమ ఆసక్తిని మరింత పెంచుకోవడానికి, యువత ఖగోళ శాస్త్ర క్లబ్‌లలో చేరాలని, ముఖ్యంగా సెలవుల్లో ప్లానెటేరియంలను సందర్శించాలని ఆయన ప్రోత్సహించారు.  
 
రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల గురించి ప్రస్తావిస్తూ వందమీటర్ల పరుగులో రికార్డులు సృష్టించిన అథ్లెట్లు గుర్విందర్‌, అనిమేష్‌ లతో ఆయన నేరుగా మాట్లాడారు. కేవలం రెండు రోజుల్లోనే 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయస్థాయిలో మూడు రికార్డులు సృష్టించామని కొనియాడారు. మోదీ పర్యటన సందర్భంగా ఇటీవల ‘అనైమంగళం’ రాగి శాసనాలను నెదర్లాండ్స్‌ ప్రభుత్వం భారత్‌కు తిరిగి అప్పగించింది. ఇది భారతీయులు గర్వించదగిన విషయమని మోదీ పేర్కొన్నారు. 
 
ఇక, ఉత్తర‌ప్రదేశ్‌లోని ఓ కాలువలో చిక్కుకుపోయిన డాల్ఫిన్‌ను కొందరు దాదాపు 13 గంటలపాటు శ్రమించి రక్షించారు. దీనికి సంబంచిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. ప్రధాని మోదీ ఈ సంఘటనను కూడా మన్‌కీ బాత్‌లో ప్రస్తావించారు. ఈ సహాయక చర్యల్లో కేంద్రం ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టిన డాల్ఫిన్‌ అంబుల్స్‌ కీలకపాత్ర పోషించినట్లు తెలిపారు. 
 
కేరళలోని ఆలువా ప్రాంతంలో స్విమ్మింగ్‌ క్లబ్‌ సేవలను మోదీ ప్రశంసించారు. ఈ క్లబ్‌ ద్వారా ఇప్పటి వరకు 15 వేల మందికి పైగా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మోదీ పలు సూచనలు చేశారు. బయటకు వెళ్లాల్సి వస్తే తాగునీరు వెంట ఉంచుకోవాలని సూచించారు. ఆయా రాష్ట్రాల్లో ఎండల నుంచి రక్షణ కోసం వాడే పానీయాలు మామిడి పండ్లు, మజ్జిగ, షర్బత్‌, బేల్‌పనా గురించి ఆయన ప్రస్తావించారు.