మరోసారి పెరిగిన కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు

మరోసారి పెరిగిన కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు
ఖరీఫ్‌ ‌ముంగిట ఎరువుల ధరలు అంతకంతకూ పైపైకి ఎగబాకుతూ సాగుకు సన్నద్దమవుతున్న రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధానంగా కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు మే నెలలో ఇప్పటికే రెండు తడవలు కంపెనీలు పెంచాయి. మరోసారి పెంచేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేశాయి. మూడోసారి పెంచనున్న ధరలను కొన్ని కంపెనీలు ఇప్పటికే అమలులో పెట్టాయి. 
 
కాంప్లెక్స్‌ ఎరువులకు కేంద్రం పరిమితమైన సబ్సిడీలు ఇస్తుండటంతో యుద్ధం, రూపాయి విలువ పతనం, అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరల పెరుగుదల, దేశంలో పెట్రోలు, డీజిల్‌ ఛార్జీల వడ్డింపు… వీటన్నింటినీ చూపించి ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నాయంటూ ఎరువుల కంపెనీలు ఇష్టానుసారం ధరలు పెంచుతున్నాయి. ఒక్క మే నెలలోనే కంపెనీలు ఒక్కో బస్తాపై విడతల వారీగా గరిష్టంగా రూ.800 నుంచి వెయ్యి వరకు పెంచాయి. 
 
పైగా, పాత ధరలపై తమ వద్ద ఉన్న ముడి సరుకులకు కంపెనీలు కొత్త రేట్లు (ఎంఆర్‌‌పి) పెట్టి రైతులకు అమ్ముతున్నాయి. పాత రేట్లపై తయారై ఉన్న ఎరువులకు కొత్త ఎంఆర్‌‌పిలు ముద్రించి విక్రయిస్తున్నారు. కంపెనీల ఒత్తిళ్లతో హోల్‌‌సేలర్లు, రిటైలర్లు తమ వద్ద ఉన్న పాత స్టాక్‌‌ను కొత్త రేట్లకు అమ్ముతున్నారు. ఈ వ్యవహారాలపై కంపెనీల, అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోతుంది. 
 
ఇటు రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వం ఎరువుల వాడకాన్ని తగ్గించే పనిలో పడి ఎంఆర్‌‌పి అక్రమాలను పట్టించుకోవట్లేదని  రైతులు ఆరోపిస్తున్నారు. ధారావాహిక మాదిరి ఎరువుల ధరల పెంపుపై ఆగ్రో ఇన్‌‌పుట్‌ ‌డీలర్స్‌ అసోసియేషన్‌ (ఎఐడిఎ) కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి జెపి నడ్డాకు శనివారం వినతిపత్రం అందజేసింది. 
వివిధ సాకులతో ఇష్టానుసారం ధరలు పెంచుతున్న కంపెనీలను నియంత్రించాలని కోరింది. యూరియాకు ప్రత్యామ్నాయంగా అమ్మోనియం సల్ఫేట్‌‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలివ్వాలని, ఆ ఎరువు ధర తగ్గించాలని, రైతులకు అవగాహన కల్పించాలని సూచించింది.