* వృద్ధి రేటు 6.9 శాతంగా ఉండొచ్చు.. ఆర్‌బిఐ
గడిచిన ఆర్థిక సంవత్సరం 2025-26లో దేశం నుండి బయటకు వెళ్లిన మొత్తం డాలర్ల పరిమాణం లోపలికి వచ్చిన వాటి కంటే 30.8 బిలియన్ డాలర్లు ఎక్కువ (దాదాపు రూ.2.90 లక్షల కోట్లు)గా ఉంది. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆరు రెట్లకు పైగా పెరగడం తీవ్ర ఆందోళకరంగా పరిణమించింది. ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని సెంట్రల్ బోర్డ్ ఆమోదించిన ‘ఆర్‌బిఐ వార్షిక నివేదిక 2025-26’ను శుక్రవారం విడుదల చేసింది.
ఆ వివరాలు ప్రకాటం 2023-24 వరకు డాలర్ చెల్లింపులు మిగులుగా ఉన్నాయి. గడిచిన రెండేళ్లలో ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండటంతో పెరిగిన వాణిజ్య లోటుకు తోడు భారత్‌లోకి వచ్చే నికర విదేశీ పెట్టుబడులు భారీగా క్షీణించాయి. దీంతో 2025-26లో చెల్లింపుల సమతుల్యత లోటు మరింత పెరిగింది. ఈ లోటును పూర్తిగా ఆర్‌బిఐ విదేశీ మారక నిల్వల నుండి చెల్లించారు. దీనివల్ల దేశ విదేశీ మారక నిల్వలు గణనీయంగా తగ్గాయి.
మరోవైపు 2026 మే 22తో ముగిసిన వారానికి భారత విదేశీ మారక నిల్వలు మరోసారి భారీగా క్షీణించాయి. ఈ ఒక్క వారంలోనే నిల్వలు 7.51 బిలియన్ డాలర్లు తగ్గి 681.38 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గ్లోబల్ మార్కెట్ ఒడిదొడుకులు, అంతర్జాతీయ పరిణామాల మధ్య రూపాయి విలువను స్థిరంగా ఉంచేందుకు ఆర్‌బిఐ డాలర్లను విక్రయించడం దీనికి ప్రధాన కారణంగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
అయితే, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు సవాలు విసురుతున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత బలంగా నిలబడనుందని ఆర్‌బిఐ పేర్కొంది. పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం, ఎగుమతుల మందగమనం వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ మెరుగైన దేశీయ డిమాండ్ కారణంగా ప్రస్తుత 2026-27లో భారత వృద్ధి రేటు 6.9 శాతంగా నమోదు కానుందని అంచనా వేసింది.
2025-26లో కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో రూ.2.87 లక్షల కోట్ల మిగులు నిధిని డివిడెండ్‌గా బదిలీ చేసేందుకు ఆర్‌బిఐ బోర్డు ఆమోదం తెలిపింది. ఇది ఇంతక్రితం ఏడాది బదిలీ చేసిన రూ.2.69 లక్షల కోట్ల కంటే 6.7 శాతం ఎక్కువ. దేశీయ పెట్టుబడులు, బంగారం, విదేశీ పెట్టుబడులు భారీగా పెరగడంతో 2026 మార్చి 31 నాటికి ఆర్‌బిఐ బ్యాలెన్స్ షీట్ పరిమాణం ఏకంగా 20.61 శాతం పెరిగి రూ.91.97 లక్షల కోట్లకు చేరింది.
ఆర్‌బిఐ వద్ద ప్రస్తుతం ఉన్న మొత్తం బంగారం నిల్వలు 880.52 మెట్రిక్ టన్నులకు పెరిగాయి. కరెన్సీ నోట్ల ముద్రణ కోసం ఆర్‌బిఐ చేసిన ఖర్చు భారీగా తగ్గింది. నోట్ల ముద్రణ కోసం 2024-25లో రూ.6,372.82 కోట్లు ఖర్చు అవ్వగా, డిజిటల్ లావాదేవీల పురోగతి నేపథ్యంలో ఈసారి ఆ ఖర్చు రూ.4,875.20 కోట్లకు తగ్గింది. ఇక దేశంలో సామాన్యుడిని వేధించే ద్రవ్యోల్బణం 4.6 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని ఆర్‌బిఐ అంచనా వేసింది.

More Stories
కాలుష్య రహితంగా ‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’
గతేడాదితో పోలిస్తే 5.7 శాతం పెరిగిన నకిలీ నోట్లు
పంజాబ్ మున్సిపల్ ఎన్నికల్లో బలం పెంచుకున్న బీజేపీ