కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఎక్స్ ఖాతాను వెంటనే పునరుద్ధరించేందుకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. భవిష్యత్ పరిణామాల దృష్ట్యా, ప్రభుత్వ వాదనలు విన్న తర్వాతనే అటువంటి ఉపశమనం కల్పించగలమని జస్టిస్ పురుషైంద్ర కుమార్ కౌరవ్ తెలిపారు. కేంద్రానికి నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను జూలై 6వ తేదీకి వాయిదా వేశారు.
జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా తమ పార్టీకి చెందిన ఎక్స్ ఖాతాను నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ అభిజిత్ దాఖలు చేసిన పిటిషన్‌పై, ఈ విషయం “సుదూర పరిణామాలను” కలిగి ఉందని, కేంద్రం వాదనలు విన్న తర్వాత సమగ్ర పరిశీలన అవసరమని కోర్టు వ్యాఖ్యానించింది. ‘ఎక్స్’ సంస్థ వ్యవహారశైలిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మధ్యవర్తి సంస్థ పిటిషనర్‌కు సహకరిస్తున్నట్లుగా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు.
“మీ వాదనలలో కొంత సారం ఉండవచ్చు, కానీ వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. అవతలి పక్షం వాదనలు విన్న తర్వాత, వాటన్నింటినీ సమగ్రంగా పరిశీలిస్తాము. ఇందులో సుదూర ప్రభావాలు కలిగిన అంశాలు ఉన్నాయి; దీని పర్యవసానాలు కూడా విస్తృతంగా ఉంటాయి,” అని విచారణ సందర్భంగా న్యాయస్థానం పేర్కొంది.
ఐటీ రూల్స్ ప్రకారం ప్రభుత్వం జారీ చేసే బ్లాకింగ్ ఆదేశాలను క్రమపద్ధతిలో సమీక్షించడానికి ఒక ప్రత్యేక కమిటీ అందుబాటులో ఉందని హైకోర్టు గుర్తు చేసింది. ఈ నిలిపివేత ఆదేశాలు చట్టప్రకారమే ఉన్నాయా లేదా అని ఆ కమిటీ ప్రతి రెండు నెలలకు కనీసం ఒకసారి సమావేశమై పర్యవేక్షిస్తుందని పేర్కొంది. ఈ క్రమంలోనే ప్రస్తుత వివాదంలో ఇరు పక్షాల వాదనలను కూలంకషంగా వినాలని, ఆ తర్వాత తీసుకున్న నిర్ణయాన్ని నివేదిక రూపంలో కోర్టు ముందు ఉంచాలని సదరు రివ్యూ కమిటీని ఆదేశించింది.
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రస్తుతం విదేశాల్లో ఉన్నందున, ఐటీ నిబంధనల కింద ఏర్పాటు చేసిన సమీక్షా కమిటీని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సంప్రదించవచ్చని కోర్టు పేర్కొంది. ప్రస్తుతం ఈ అంశం ఇప్పటికే ఐటీ రివ్యూ కమిటీ పరిశీలనలో ఉన్నందున, తాము ఇప్పుడే నేరుగా బ్లాకింగ్ ఆదేశాల సాధకబాధకాల్లోకి వెళ్లడం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అవసరమైతే తదుపరి దశల్లో ఈ కేసులకు సంబంధించిన అధికారిక రికార్డులను తాము స్వయంగా పరిశీలిస్తామని కోర్టు హామీ ఇచ్చింది.
పరిశీలన అనంతరం కమిటీ ఆదేశాలను రద్దు చేసి, అడ్డంకులను తొలగించే ఉత్తర్వులను జారీ చేయవచ్చని పేర్కొంది. తదుపరి విచారణ తేదీకి ముందే సమీక్షా కమిటీ ఆ అంశాలన్నింటినీ పరిశీలించాలని, నిర్ణయాన్ని రికార్డులో నమోదు చేయాలని పేర్కొంది. దీప్కే వర్చువల్‌గా హాజరయ్యేందుకు కోర్టు అనుమతించింది. మే 21న కేంద్రం సిజెపి ఎక్స్ ఖాతాను నిలిపివేసిన సంగతి తెలిసిందే.
More Stories
వినేష్ ఫోగట్ సుప్రీంకోర్టులో భారీ ఉపశమనం
రాహుల్, శివకుమార్ లపై సిద్దరామయ్య బిసి జనగణన పిడుగు!
రూపాయి మారకం రేటు పతనాన్ని ఆర్బీఐ అడ్డుకోవద్దు