పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర వైఫల్యం చెందినప్పటి నుండి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులు వరుసగా రాజీనామా చేస్తున్నారు. తాజాగా సీనియర్ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ శంతను సేన్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. అంతకు ముందు ఎంపీ కకోలీ ఘోష్ దస్తీదార్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు అన్ని పదవులకు రాజీనామా చేశారు.
2024 నాటి ఆర్జీకర్ హత్యాచార కేసు, పార్టీపై వస్తున్న నిరంతర అవినీతి ఆరోపణలతో తాను తీవ్ర మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నానని శంతను సేన్ పేర్కొన్నారు. పార్టీ అధికార ప్రతినిధిగా తన పాత్రను నిర్వర్తించే స్థితిలో తాను లేనని తెలిపారు. వివిధ సమయాల్లో తాను పార్టీ నిర్ణయాలతో ఏకీభవించలేదని, అనేక వివాదాస్పద అంశాలపై తాను బహిరంగంగానే ప్రశ్నించానని ఆయన పేర్కొన్నారు.
అందుకే ప్రజలు తనను వివిధ సందర్భాలలో ఎంతగానో ప్రశంసించారని తెలిపారు. ఆర్జీకర్ కేసు, నిరుద్యోగం, అవినీతి సహా వివిధ అంశాల కారణంగా ప్రజలు తమను ఓడించారని, అందుకే అధికార ప్రతినిధిగా మాట్లాడటానికి తన మనసు అంగీకరించడం లేదని చెప్పారు. రాజీనామా లేఖలో, టీఎంసీ ఆవిర్భావం నుంచి తాను ఆ పార్టీకి ‘విశ్వసనీయ సైనికుడిని’ అయినప్పటికీ, పార్టీకి సంబంధించిన వివాదాలను బహిరంగంగా సమర్థించడం తనకు ఇకపై నైతికంగా సౌకర్యంగా లేదని సేన్ స్పష్టం చేశారు.
“అనేక క్లిష్ట పరిస్థితులలో, నా మనస్సాక్షి అంగీకరించకపోయినా, నేను టెలివిజన్ చర్చలు, మీడియా వేదికలపై పార్టీ కోసం బహిరంగంగా పోరాడి, సామాన్య ప్రజల విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది,” అని ఆయన రాశారు. బుధవారం, ఆర్.జి. కార్ అత్యాచారం-హత్య కేసుకు సంబంధించిన ఏ విచారణలోనైనా కొత్త ప్రభుత్వానికి బహిరంగంగా సహకరిస్తానని ప్రకటించడం ద్వారా సేన్ కలకలం రేపారు.
“నా కుమార్తె కెరీర్ గురించిన ఆందోళనల కారణంగా నేను చాలా కాలం మౌనంగా ఉన్నాను. ఇప్పుడు ఆమె స్వయంగా డాక్టర్ అయ్యింది, నాకు ఇకపై ఎలాంటి సంకోచం లేదు,” అని ఆయన పేర్కొన్నారు. ఆయన స్వయంగా ఆ కాలేజీ పూర్వ విద్యార్థి కావడం గమనార్హం. అదే సమయంలో, ఆర్.జి. కార్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, ఆ సంస్థతో సంబంధం ఉన్న ఇతరులపై కూడా ఆయన ఆరోపణలు చేశారు.
రాష్ట్ర ఆరోగ్య పరిపాలనలో ‘నార్త్ బెంగాల్ లాబీ’ ప్రభావం ఉందని ఆరోపిస్తూ కూడా ఆయన మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను రాజకీయ వర్గాలలో, మాజీ అధికార వర్గంలోని పాతుకుపోయిన నెట్‌వర్క్‌లపై పరోక్ష దాడిగా పరిగణిస్తున్నారు.

More Stories
వినేష్ ఫోగట్ సుప్రీంకోర్టులో భారీ ఉపశమనం
సిజెపి ఎక్స్ ఖాతా పునరుద్ధరించేందుకు హైకోర్టు తిరస్కారం
ప్రధాని కార్యాలయం పర్యవేక్షణలో నీట్ పిజి రీటెస్ట్!