2023 అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడుల్లో పాల్గొన్న వారిని ఒక్కొక్కరిగా మట్టుబెడతామని ప్రకటించిన ఇజ్రాయెల్, ఆ దిశగా ప్రత్యేక ఆపరేషన్లు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో హమాస్ సైనిక విభాగానికి కొత్త చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్ ఒడెహ్‌ను గాజాలో జరిగిన వైమానిక దాడిలో హతమార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు వెల్లడించాయి. అతని భార్య, కొడుకుతో సహా చంపేసినట్లు కుటుంభం సభ్యులు తెలిపారు.
ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి కట్జ్ ఆదేశాల మేరకే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపాయి. అక్టోబర్ 7 దాడుల సమయంలో హమాస్ ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతిగా ఉన్న ఒడెహ్, ఆ దాడుల ప్రణాళికలో కీలక పాత్ర పోషించినట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇటీవల ఐడీఎఫ్ దాడిలో హమాస్ టాప్ కమాండర్ ఎజ్జెదిన్ అల్ హద్దాద్ మరణించగా, ఆయన స్థానంలో 10 రోజుల క్రితమే ఒడెహ్ నియమితుడైనట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే అతడిని లక్ష్యంగా చేసుకుని దాడి జరిపినట్లు తెలుస్తోంది. అయితే హమాస్ ఈ నియామకాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. 2023 అక్టోబర్7న ప్రారంభమై.. ఇప్పటివరకు కొనసాగుతున్న ఇజ్రాయిల్ దాడుల్లో ఇప్పటివరకు నలుగురు హమాస్ ఆర్మీ కమాండర్‌లు చనిపోయారు. ఒడెహ్ మరణాన్ని నెతన్యాహు అధికారికంగా ధ్రువీకరిస్తూ “అక్టోబర్ 7 మారణకాండలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ మట్టుపెడతాం” అంటూ ఎక్స్ వేదికగా హెచ్చరించారు.
మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ లెబనాన్‌పై కూడా ఇజ్రాయెల్ దాడులు ఆగడం లేదు. హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా మంగళవారం భారీ ఎత్తున వైమానిక దాడులు నిర్వహించింది. దక్షిణ లెబనాన్‌లోని బుర్జ్ రహల్, స్రీఫా, అస్-సవానా, కబ్రీఖా ప్రాంతాలపై వరుస దాడులు జరిగినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. టైర్ జిల్లాలోని కవ్తరియాత్ అల్-రుజ్ ప్రాంతంలో కూడా భారీ పేలుళ్లు సంభవించినట్లు సమాచారం.
గాజా నగరంలోని ఒక అపార్ట్‌మెంట్ భవనం పై అంతస్తును ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ దాడిలోనే, కనీసం ఒక మహిళతో సహా ఆరుగురు మరణించారని, మరో 20 మందికి పైగా గాయపడ్డారని గాజా ఆరోగ్య అధికారులు తెలిపారు. గత అక్టోబరులో అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరినట్లు చెబుతున్న కాల్పుల విరమణ ఒప్పందం నాటి నుండి, ఇజ్రాయెల్ గాజాలో సుమారు 900 మంది పాలస్తీనియన్లను హతమార్చింది.
కాగా, లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, మంగళవారం దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కనీసం 31 మంది మరణించగా, 40 మంది గాయపడ్డారు. గత కొన్ని వారాలుగా జరిగిన అత్యంత తీవ్రమైన బాంబు దాడుల్లో ఒకటైన ఈ దాడులను ఇజ్రాయెల్, ఒక్క మంగళవారం నాడే 120కి పైగా జరిపింది.

More Stories
పాక్ చర్యలకు తగిన పర్యవసానాలు.. భారత్ హెచ్చరిక
అమెరికాలో భారత సంతతి మహిళ దారుణ హత్య
పశ్చిమాసియా అమెరికాకు సురక్షితం కాదు