దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్‌ రైలుకు అనుమతి

దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్‌ రైలుకు అనుమతి

దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్‌ రైలుకు కేంద్రం అనుమతి మంజూరు చేసింది. ఉత్తర రైల్వే జోన్‌ పరిధిలోని జింద్‌–సోనిపట్‌ మార్గంలో 10 బోగీలతో కూడిన ఈ రైలు గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంగా ప్రయాణించనుంది. డీజిల్, విద్యుత్‌ ద్వారా కాకుండా హైడ్రోజన్‌ బ్యాటరీల నుంచి అందే శక్తితో ఇది నడుస్తుంది. 

భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని కార్యకలాపాలు ప్రారంభమైన మొదటి మూడు నెలల పాటు నిపుణులైన సిబ్బంది రైలులోనే అందుబాటులో ఉంటారని రైల్వే శాఖ తెలిపింది. అయితే, రైల్వే శాఖ అనుమతితో ఈ రైలు వెంటనే అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. పలు నిబంధనల అమలు ప్రక్రియలు, ధ్రువీకరణ దశలను దాటాల్సి ఉందని వివరించారు.

సాంప్రదాయ డీజిల్ లేదా ఎలక్ట్రిక్ ఇంజిన్‌ల మాదిరిగా కాకుండా ఈ వినూత్న రైలు కదలడానికి అవసరమైన విద్యుత్‌ను హైడ్రోజన్ ఇంధన కణాలను ఉపయోగించి ఉత్పత్తి చేసుకుంటుంది. హైడ్రోజన్ ఇంధన ఘటాలు, ఆక్సిజన్‌తో కలిసి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రక్రియలో నీటి ఆవిరి, నీరు మాత్రమే వెలువడుతాయి. అంటే పర్యావరణానికి హానికరమైన ఎలాంటి ఉద్గారాలు ఉండవు. 

ఈ క్లీన్ ఎనర్జీ విధానం దేశంలో భవిష్యత్ రైళ్లకు ప్రమాణాన్ని ఏర్పరుస్తుందని భావిస్తున్నారు. దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ కోచ్‌ను గ‌తేడాది జూలైలో చెన్నైలోని ఐసిఎఫ్‌ వద్ద రైల్వే శాఖ విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. భారత్‌ 1,200 హెచ్ పి పేరుతో అభివృద్ధి చేసిన హైడ్రోజన్ రైలు ప‌నితీరును కూడా ప‌రీక్షించేందుకు తాజాగా సిద్ధ‌మైంది రైల్వే శాఖ. హైడ్రోజన్ రైలు అందుబాటులో వ‌స్తే కాలుష్యం త‌గ్గ‌డంతో పాటు భార‌తీయ రైల్వే టెక్నాలజీ పరంగా మ‌రో మైలురాయిని అందుకుంటుంది.