బీహార్‌లో భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) చేపట్టిన ఎస్ ఐ ఆర్ ప్రక్రియకు సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఓటర్ల నమోదు నిబంధనల కింద ఓటర్ల జాబితా సవరణ విధివిధానాలను ఈ ఎస్ ఐ ఆర్ ప్రక్రియ కొంతవరకు అతిక్రమించినప్పటికీ, చెల్లనిదిగా ప్రకటించలేమని సుప్రీంకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఈ చర్య ఒక ముందడుగని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఎస్ ఐ ఆర్ సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లన్నింటినీ కోర్టు కొట్టివేసింది.“మొదట్లో ఎక్కువ మందిని ఓటరు జాబితా నుంచి తొలగించేదిగా ఎస్ఐఆర్ కనిపిస్తుంది. కానీ తగిన రక్ష చర్యల ద్వారా దీనిని సరిగ్గా రాజ్యాంగబద్ధంగా నిర్వహించవచ్చు. మొత్తానికి ఎస్ఐఆర్ నిర్వహించడం ద్వారా ఈసీ తన పరిధి దాటి వ్యవహరించలేదు” అని సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
విదేశీయులను ఓటర్ల జాబితా నుండి తొలగించే ఉద్దేశ్యంతో పౌరసత్వాన్ని పరిశీలించేందుకు ఎస్ ఐ ఆర్ పేరిట ఒక రహస్య, దొడ్డిదారి చర్యకు ఎన్నికల సంఘం పాల్పడుతోందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తరపున న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, నేహా రాఠీ వాదించారు. రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తూ పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారాలను ఇసిఐ ఏకపక్షంగా వాడుకుంటోందని, ఇది ఓటర్లపైనే పౌరసత్వ రుజువు భారాన్ని మోపుతోందని పిటిషనర్లు ఆరోపించారు.
ఈ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఓటర్ల జాబితాలో చేర్చడాన్ని ధృవీకరించడానికి పౌరసత్వాన్ని పరిశీలించే ప్రాథమిక అధికారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 కింద ఇసిఐకి ఉందని ధర్మాసనం పేర్కొంది. అయితే, ఈ పరిశీలన పౌరసత్వంపై ఇచ్చే తుది తీర్పు కాదని, విచారణలో ఎవరి వద్దనైనా సరైన పత్రాలు లేవని తేలితే ఆ కేసులను తదుపరి నిర్ణయం కోసం కేంద్ర ప్రభుత్వ సమర్థ అధికారులకు పంపవచ్చని పేర్కొంది.
ఓటర్ల ధృవీకరణ కోసం రూపొందించిన వ్యవస్థీకృత విధానంలో భాగంగా ఆధార్‌తో సహా వివిధ రకాల సూచిక పత్రాలను అడగడం సహేతుకమైన డిమాండేనని సమర్థించింది. అలాగే ఎస్ఐఆర్ సమయంలో తీసుకునే ఏ నిర్ణయమైనా న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని పేర్కొంది. పారదర్శకత, సమాచార లభ్యత అనేవి ప్రజాస్వామ్యానికి చిహ్నాలని బీహార్ ఎస్ఐఆర్ విచారణల సందర్భంగా కోర్టు ఇసిఐకి సూచించింది.
బీహార్ తుది ఓటర్ల జాబితాలో కొత్తగా చేర్చబడిన ఓటర్ల పేర్లు, వివరాలను ప్రచురించాలని సుప్రీం కోర్టు ఇసిఐని ఆదేశించింది. బీహార్ తుది జాబితా ప్రకారం, రాష్ట్రంలో అర్హులైన ఓటర్ల మొత్తం సంఖ్య 7.42 కోట్లుగా నమోదైంది. ముసాయిదా జాబితా నుండి తొలగించబడిన దాదాపు 65 లక్షల మంది ఓటర్ల వివరాలను—వారిని జాబితా నుండి తొలగించడానికి గల కచ్చితమైన కారణాలతో సహా—జిల్లాల వారీగా, పోలింగ్ కేంద్రాల వారీగా ప్రచురించాలని ఇసిఐని ఆదేశించింది.
బీహార్ ఎస్ ఐ ఆర్ రాజ్యాంగ బద్ధతను సమర్థిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఎస్ ఐ ఆర్ తదుపరి దశలపై ప్రభావం చూపనుంది. ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న సమయంలోనే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం సహా 12 రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ ఐ ఆర్ రెండవ దశ ప్రారంభమైన సంగతి తెలిసిందే.

More Stories
కేరళ మాజీ సీఎం విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు
ఐపీఎల్లో వరుసగా రెండోసారి ఫైనల్లోకి ఆర్సీబీ
నేటి ప్రపంచ దౌత్యంలో, ఘర్షణలలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు శైలి?