మజ్లిస్ కనుసన్నల్లో  ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ 

మజ్లిస్ కనుసన్నల్లో  ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ 
తెలంగాణను గతంలో పాలించిన బీఆర్ఎస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ కలిసి ఎంఐఎం (మజ్లిస్) పార్టీ కనుసన్నల్లో నడుస్తూ హైదరాబాద్ నగర ప్రజలను తీవ్రంగా మోసం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కూకట్‌పల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన, నగరంలోని ప్రధాన సమస్యలను ప్రస్తావిస్తూ అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీల తీరును ఎండగట్టారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో గరీబోళ్లను నిలువునా ముంచితే, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఇళ్లు’ అంటూ అదే తరహాలో ప్రజలను నమ్మించి వంచిస్తోందని ద్వజ్జమెత్తారు. గత ప్రభుత్వం కట్టిన కొన్ని అరకొర ఇళ్లనే ఇప్పుడు చూపించుకుంటూ కాలక్షేపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నివేదికల పేరుతో కాలయాపన చేస్తూ, రెండు పార్టీలు కూడా హైదరాబాద్ నగరంలోని పేద ప్రజలకు తీవ్ర అన్యాయం చేశాయని ఆయన ఆరోపించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిని విభజించి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకురావాలనే ఆలోచన కేవలం మజ్లిస్ పార్టీ ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు. మూడు భాగాలుగా విడగొడితే తప్ప మజ్లిస్ గెలవలేని పరిస్థితి ఉందని, అందుకే వారికి జీహెచ్ఎంసీని అశాస్త్రీయంగా మూడు భాగాలుగా విభజించారని, అందులో ఒక భాగాన్ని దారాదత్తం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైందని రామచందర్ రావు ఆరోపించారు. 
 
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జిల్లాల విభజనలో ఒకే అసెంబ్లీ నియోజకవర్గం మూడు జిల్లాల్లోకి పోయేలా గందరగోళం సృష్టించారని, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని దయ్యబట్టారు. అధికారులను మ్యాప్ అడిగితే వారి వద్ద ఎలాంటి స్పష్టత లేదని, ఎక్కడ ఏ సరిహద్దు వస్తుందో తెలియకుండానే నగరాన్ని ముక్కలు చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
నగరంలో తాగునీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా పడకేసిందని రాంచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. రోహిణి కార్తె ముగుస్తున్నా, జూన్ 12న వానాకాలం ముంచుకొస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకు నీటి ఎద్దడిని నివారించలేకపోయిందని రామచందర్ రావు తెలిపారు. మూడు, నాలుగు రోజులకు ఒకసారి కూడా నీళ్లు రాక ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారని, జలమండలి తీవ్రంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. 
 
మరోవైపు వర్షం వస్తే బస్తీలన్నీ మునిగిపోయే పరిస్థితి ఉందని, గత బీఆర్ఎస్ హయాంలో వరదలు వస్తే ఇళ్లల్లో నీళ్లు చేరిన వారిలో కొంతమందికి ఇచ్చిన రూ. 10,000 సాయం కూడా బీఆర్ఎస్ నేతల జేబుల్లోకి పోయిందని గుర్తు చేశారు. నగరంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉన్నా పట్టించుకునే నాథుడే లేడని ధ్వజమెత్తారు. 
హిల్ట్ పాలసీ పేరుతో కాలుష్య కారక పరిశ్రమలను నగరం వెలుపలికి తరలించాలనే నెపంతో, లోపల ఉన్న పారిశ్రామిక ప్రాంతాలను రెసిడెన్షియల్ జోన్లుగా మార్చి భారీ రియల్ ఎస్టేట్ కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. పరిశ్రమల తరలింపు వల్ల ఎంతమంది ఉపాధి కోల్పోతారు? ఎంతమందికి కొత్తగా ఉద్యోగాలు వస్తాయి? అనే అంశంపై ప్రభుత్వం ఎలాంటి ‘ఇంపాక్ట్ అసెస్మెంట్’ చేయలేదని విమర్శించారు. 
 
గత ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడితే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కమిషన్ల శాతాన్ని 30% నుండి 40% కి పెంచి బిల్డర్లను వేధిస్తోందని, దీంతో నగరంలో కొత్త వెంచర్లు రాక రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని సుందర నగరంగా, విశ్వనగరంగా మార్చడం కేవలం బిజెపితోనే సాధ్యమవుతుందని రాంచందర్ రావు స్పష్టం చేశారు. 
 
కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో నగరాల అభివృద్ధికి ఎన్నో పథకాలు ఉన్నాయని చెబుతూ ‘స్మార్ట్ సిటీ’, ‘అమృత్ సిటీ’, వంటి స్కీమ్స్ నిధులతో తెలంగాణలో కేంద్రం అభివృద్ధి చేస్తోందని తెలిపారు. అదేవిధంగా ఇక్కడ పర్యాటక రంగాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని ప్రజలకు వాగ్దానం చేశారు. తమ స్వప్రయోజనాల కోసం హైదరాబాద్ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న మజ్లిస్, బీఆర్ఎస్, కాంగ్రెస్ అనే ఈ మూడు స్వార్థ పార్టీలకు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నగర ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పి, హైదరాబాద్ ను సందురనగరంగా తీర్చిదిద్దే బీజేపీకిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఓటువేస్తే అది మజ్లిస్ కు ఓటు వేసినట్లేనని హెచ్చరించారు. ఆ రెండు పార్టీలు మజ్లిస్ తో కాపురం చేసిన పార్టీలేనని మండిపడ్డారు. అందుకే ఈ విషయాన్ని ప్రజలు గ్రహించి, అభివృద్ధిని తీసుకొచ్చే బీజేపీని ఆదరించాలని కోరారు.