తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే పార్టీకి చెందిన ముగ్గురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని అసమ్మతి వర్గానికి చెందిన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు చెన్నై సచివాలయంలో తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను కలిసి తమ రాజీనామా లేఖలను సమర్పించారు.
రాజీనామా చేసిన వారిలో మదురాంతకం నియోజకవర్గం నుంచి గెలిచిన మరగాథం , ధారాపురం నుంచి గెలిచిన సత్యభామ, పెరుందురై నుంచి ఎన్నికైన జయకుమార్ ఉన్నారు. స్పీకర్‌కు రాజీనామాలు సమర్పించిన వెంటనే, ఈ ముగ్గురు నేతలు సచివాలయంలోని టీవీకే మంత్రి ఆదవ్ అర్జునను కలిశారు. ఈ ముగ్గురు మంత్రి అధవా అర్జున్ ను కూడా కలిశారు. వారు త్వరలోనే టీవీకేలో చేరనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సమయంలో, అన్నాడీఎంకే జారీ చేసిన విప్‌ను ధిక్కరించి, ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేసిన 25 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలలో ఈ ముగ్గురు కూడా ఉన్నారు. ఒకవేళ ఈ తిరుగుబాటు నాయకులు టీవీకేలో చేరి, తిరిగి అసెంబ్లీకి ఎన్నికైతే అది విజయ్ పార్టీకి భారీ బలాన్ని చేకూరుస్తుంది. 234 మంది సభ్యులు కలిగిన తమిళనాడు అసెంబ్లీలో ఆ పార్టీ సాధారణ మెజారిటీని సాధించడంలో విఫలమైన సంగతి తెలిసిందే.
అంతేకాకుండా, వీరి రాజీనామా అన్నాడీఎంకేను మరింత బలహీనపరుస్తుంది. ఆ పార్టీ ఇప్పటికే అంతర్గత తిరుగుబాటును ఎదుర్కోవడంలో సతమతమవుతోంది.
అన్నాడీఎంకేలో జరుగుతున్న ఈ తిరుగుబాటుకు ఎస్ పి వేలుమణి, సివి షణ్ముగం నాయకత్వం వహిస్తున్నారు. వీరు, తమ మద్దతుదారుల మధ్య ‘ఈపీఎస్’గా సుపరిచితులైన ఎడప్పాడి కె. పళనిస్వామి నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
2026 తమిళనాడు ఎన్నికల్లో కేవలం 47 స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసిన అన్నాడీఎంకేలో, కొత్త నాయకత్వానికి మార్గం సుగమం చేసేందుకు పళనిస్వామి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుండి వైదొలగాలని వేలుమణి, షణ్ముగం కోరుతున్నారు. వీరి తిరుగుబాటు పార్టీలో మరో చీలిక ఏర్పడుతుందనే ఊహాగానాలకు దారితీసింది.
అయితే, పార్టీని చీల్చే ఉద్దేశం తనకు లేదని, రాష్ట్రంలో “అమ్మ పాలన”ను పునరుద్ధరించే దిశగా అన్నాడీఎంకే కృషి చేయాల్సిన అవసరం ఉందని వేలుమణి స్పష్టం చేశారు. “పార్టీని చీల్చే లేదా విభజనను సృష్టించే ఉద్దేశం మాకు ఏమాత్రం లేదు. ప్రజల తీర్పును గౌరవిస్తూనే మేము టీవీకేకు మద్దతు ఇచ్చాము,” అని ఆయన గత వారం పేర్కొన్నారు. “ఎన్నికల పరాజయాన్ని మనం అంగీకరించి, అమ్మ పాలనను తిరిగి స్థాపించేందుకు కృషి చేయాలి.”

More Stories
అస్సాం అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లు
పేపర్ లీక్ పై గుణపాఠాలు నేర్చుకొని ఎన్టీఏ
అక్రమ వలసదారుల కోసం బెంగాల్ లో నిర్బంధ కేంద్రాలు