రైతుల సమస్యలు తెలుసుకుంటూ, ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు కమలనాథులు నడుం బిగించారు. రాబోయే జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రైతుల వద్దకు ముదుంగా తామే వెళ్ళాలని బిజెపి రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు పరిశీలనకు ఈ నెల 25 నుంచి జిల్లాల్లో పర్యటించేందుకు బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమాయత్తమయ్యారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సారథ్యంలో తొలుత తాండూరు నుంచి పల్లె బాట చేపట్టాలని 22న శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తొలి రోజున నాంపల్లిలోని పార్టీ కార్యాలయం నుంచి ఉదయం 8.30 గంటలకు బయలుదేరి 11,30 గంటలకు తాండూరుకు చేరుకుంటారు. అక్కడ ఉదయం 11,30 నుంచి 1.30 గంటల వరకు మార్కెట్ కేంద్రాలను సందర్శిస్తూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలును పరిశీలిస్తారు.
భోజన విరామం అనంతరం గజ్వేల్ చేరుకుని అక్కడ మార్కెట్ కొనుగోలు కేంద్రాల్లో సాయంత్రం గంటల నుంచి వరకు రైతులతో ధాన్యం కొనుగోలుపై, పంటలకు గిట్టుబటు ధరపై చర్చిస్తారు. ధాన్యం కొనుగోలులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతరత్రా రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. సాయంత్రం అక్కడి నుంచి నేరుగా గజ్వేల్ చేరుకుని రైతులతో చర్చించిన తర్వాత రాత్రి అక్కడే బస చేస్తారు. రెండో రోజు 26న మంగళవారం ఉదయం గజ్వేల్ నుంచి భువనగిరి చేరుకుంటారు.
అక్కడ రైతులతో చర్చించి, అనంతరం సాయంత్రం వరంగల్ చేరుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి ధాన్యం సేకరణను పరిశీలిస్తారు. అక్కడి నుంచి భూపాలపల్లి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. 27వ తేదీన మూడో రోజు ఉదయం భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కేంద్రాలకు వెళ్ళి అక్కడ రైతులతో ముఖా-ముఖి మాట్లాడుతారు.అక్కడి నుంచి కాటారం చేరుకుని మార్కెట్ కేంద్రాల్లో ధాన్యం సేకరణను పరిశీలిస్తారు. భోజన విరామం అనంతరం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంథని మార్కెట్ కేంద్రానికి చేరుకుంటారు. సాయంత్రం మంథనిలో రైతులతో చర్చించి, అక్కడి నుంచి నేరుగా పెద్దపల్లి చేరుకుంటారు.
ఇప్పటికే ఎనభై శాతం పంటను రైతుల నుంచి కొనుగోలు చేశామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పడం, రైతుల నుంచి ప్రతి గింజా ఖరీదు చేస్తామని మంత్రులు చెప్పడంపై వారు ఈ పర్యటనలో పరిశీలించాలని నిర్ణయించారు. ధాన్యం కొనుగోలుపై ముఖ్యమంత్రి, మంత్రులు చెబుతున్నవన్నీ అవాస్తవాలనీ ప్రజల్లో ఎండగట్టాలని నిర్ణయించారు.
ఈ పర్యటన సందర్భంగా రైతుల వద్దకు వెళ్ళాలని, వారి బాధలను తెలుసుకోవాలని నిర్ణయించారు. జిల్లా పార్టీ, మండల పార్టీ, గ్రామ కమిటీల నాయకులతో సమన్వయం చేసుకుని ఆయా ప్రాంతాల్లో, లేదా గ్రామాల్లో రైతులతో సమావేశం కావాలని వారు నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇది రాజకీయ పర్యటనగా కాకుండా రైతుల కష్టసుఖాలపై వివరాలు సేకరించేందుకే అన్నట్లు ఉండాలని వారు భావించారు. ముఖ్యంగా రైతులతు బిజెపి బాసటగా ఉందన్న నమ్మకం కలిగించేలా ఈ పర్యటనలు కొనసాగాలని పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. మూడు రోజుల పాటు పర్యటించిన తర్వాత పరిస్థితులను బట్టి కార్యాచరణను ప్రకటించాలని వారు ఈ సందర్భంగా భావించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
తమ జిల్లా పర్యటనల సందర్భంగా ప్రభుత్వం చెబుతున్న, ఇస్తున్న హామీలన్నీ బూటకమేనని ప్రజల్లో ఎండగట్టనున్నట్లు బిజెపి ఎమ్మెల్సీ అంజి రెడ్డి చెప్పారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బిజెపి ఎమ్మెల్సీ అంజి రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా లోని కౌడిపల్లిలో రైతులతో మాట్లాడానని ఆయన చెప్పారు. ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతున్నదని రైతులు తనకు చెప్పారని ఆయన తెలిపారు.
ధాన్యం కొనుగోలులో జాప్యం లేకుండా చూడాలని, సన్న బియ్యం పండించే రైతులకు బోనస్ సకాలంలో ఇవ్వాలని, కొనుగోలు కేంద్రాల వద్ద నీరు, అంబలి వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, రైతులకు మేమున్నాం అనే భరోసా కల్పించాలని ఆయన కోరారు. వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయం ఉండేలా చూడాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి తెలిపారు. ఇదిలాఉండగా పండించిన ధాన్యాన్ని రోడ్లపై కాకుండా కల్లాల్లోనే ఆరబోయాలని రైతులకు అంజిరెడ్డి సూచించారు. రోడ్లపై ఆరబోయడం ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన వారికి నచ్చజెప్పారు.

More Stories
రాజకీయాలు వినోదం కాదు, సినిమా లాంటి ప్రదర్శన కూడా కాదు
ట్రంప్ ఇరాన్ యుద్ధంలో ఓడిపోతున్నారా?
అక్రమ వలసదారుల కోసం బెంగాల్ లో నిర్బంధ కేంద్రాలు