ఇరాన్- అమెరికా మధ్య యుద్ధం కారణంగా ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన సంక్షోభ సమయంలో భారత్‌కు ఒక గుడ్‌న్యూస్. రాజస్థాన్‌లోని జైసల్మేర్ బేసిన్‌లోని దండేవాలా క్షేత్రం (ఫీల్డ్)లో సహజ వాయువు నిల్వలు భారీగా బయటపడ్డాయి. ప్రభుత్వ రంగ ఇంధన సంస్థ అయిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రాంతంలో గ్యాస్ నిల్వలు ఉన్న ఒక కొత్త పే జోన్‌ను విజయవంతంగా కనుగొంది.
దీంతో దండేవాలా క్షేత్రం ద్వారా దేశం ఇంధన రంగంలో ఒక కీలకమైన పురోగతిని సాధించింది. దండేవాలా క్షేత్రంలో తక్కువ లోతులో ఉండే సాను ఫార్మేషన్ అనే పొరలో తొలిసారిగా సహజ వాయువు నిల్వలు ఉన్నట్లు ఆయిల్ ఇండియా లిమిటెడ్ సైంటిస్టులు గుర్తించారు. ప్రస్తుతం ఈ గ్యాస్ క్షేత్రం రోజుకు సగటున 25,000 స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువును ఉత్పత్తి చేస్తుంది.
ఈ ప్రాథమిక ఉత్పత్తి ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. విస్తృతమైన పరీక్షలు, అభివృద్ధి కార్యకలాపాల తర్వాత సహజ వాయువు ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరగొచ్చు. ఈ విజయం దేశ ఇంధన స్వయం సమృద్ధి దిశగా పడిన ఒక పెద్ద ముందడుగుగా ఇంధన రంగ నిపుణులు అభివర్ణించారు. చమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి భారత్ చాలా కాలంగా ప్రయత్నిస్తోందని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో కొత్త దేశీయ సహజ వాయువు నిల్వలను కనుగొనడం, ఉత్పత్తిని ప్రారంభించడం ఇంధన భద్రతకు ఒక సానుకూల సంకేతంగా పనిచేస్తుందని కొనియాడారు. ఈ చొరవ దేశీయంగా సహజ వాయువు లభ్యతను పెంచడానికి, దిగుమతులపై చేసే వ్యయాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఆవిష్కరణ రాజస్థాన్‌లో పెట్టుబడి, ఉపాధి అవకాశాలను పెంచుతుందని భావిస్తున్నారు.
దండేవాలా క్షేత్రంలో నేచురల్ గ్యాస్ నిల్వలను ఆయిల్ ఇండియా లిమిటెడ్ కనుగొనడంపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సంతోషం వ్యక్తం చేశారు. ఇది దేశ ఇంధన రంగానికి దక్కిన ఒక ముఖ్యమైన విజయంగా అభివర్ణించారు. ఈ క్రమంలో ఆయిల్ ఇండియా లిమిటెడ్ బృందాన్ని అభినందించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఇంధన భద్రత, స్వయం సమృద్ధి దిశగా నిరంతరం పురోగమిస్తోందని కొనియాడారు.
దేశీయ ఇంధన స్వయం సమృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో ఇటువంటి ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అధునాతన అన్వేషణ పద్ధతులు, సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడమే ఈ విజయానికి కారణమని ఆయిల్ ఇండియా లిమిటెడ్ స్పష్టం చేసింది.

More Stories
మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు
అరేబియా సముద్రగర్భం గుండా నేరుగా భారత్ పైప్‌లైన్
అభిషేక్ బెనర్జీకి కోల్‌కతాలో 43 అక్రమ ఆస్తులు