దేశవ్యాప్తంగా పెరుగుతున్న చిన్నపిల్లల అదృశ్యం కేసులను తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు, వాటిని కిడ్నాప్ కేసులుగా నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తప్పిపోయిన పిల్లలను గుర్తించడంలో ఉన్న వ్యవస్థాగత వైఫల్యాలను సరిదిద్దడానికి, అక్రమ రవాణా (ట్రాఫికింగ్) నెట్వర్క్లను అరికట్టడానికి ఈ ఆదేశాలు ఇచ్చింది. 2011లో తమిళనాడులో కుమార్తెను పోగొట్టుకున్న ఓ వ్యక్తి దాఖలుచేసిన ప్రజాప్రయోజన వాజ్యంపై జస్టిస్ అసహనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా, నిరంతరం పెరుగుతున్న పిల్లల అదృశ్యం కేసులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ అమానుల్లా మాట్లాడుతూ, ” చిన్న పిల్లల మిస్సింగ్ కేసుల్లో చాలా పెద్ద వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రస్తుతం దాదాపు 47వేల మంది పిల్లలు ట్రేస్ కాకుండా మిగిలిపోయారు. గతేడాది ఈ సంఖ్య దాదాపు 10వేల మంది ఉండవచ్చు. ప్రతి సంవత్సరం ఈ బ్యాక్లాగ్ పెరుగుతూనే ఉంది” అని ఆందోళన వ్యక్తం చేశారు.
తప్పిపోయిన పిల్లలు తరచుగా వ్యవస్థీకృత అంతర్-రాష్ట్ర అక్రమ రవాణా ముఠాల (సిండికేట్స్) బారిన పడుతున్నారనే క్షేత్రస్థాయి వాస్తవానికి సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. పోలీస్ యంత్రాంగం నిర్వహిస్తున్న ‘క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్’ (సిసిటిఎన్ఎస్) డేటాబేస్, ఛైల్డ్ వెల్ఫేర్ అధికారులు నిర్వహిస్తున్న ‘విశాల్ వాత్సల్య’ డేటాబేస్ మధ్య సరైన సమన్వయం, ఏకీకరణ లేకపోవడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతోందని కోర్టు పేర్కొంది.
ఈ నేపథ్యంలో పిల్లల మిస్సింగ్ సమస్యను పరిష్కరించడానికి సర్వోన్నత న్యాయస్థానం తాత్కాలికంగా 5 కీలక ఆదేశాలను జారీ చేసింది. వివిధ సంస్థలు నిర్వహిస్తున్న డేటాబేస్లను ఏకీకృతం చేయాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు (ఏహెచ్టీయూ)లను తగిన అధికారాలు, అవసరమైన మౌలిక సదుపాయాలతో నాలుగు వారాల్లోపు పూర్తి స్థాయిలో పనిచేసేలా చేయాలని ఆదేశించింది.
ఒక బిడ్డ అదృశ్యమైనప్పుడు, అధికారులు దానిని ముందుగానే కిడ్నాప్ లేదా అపహరణగా భావించి దర్యాప్తు ప్రారంభించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రక్షించిన పిల్లలను సాధారణంగా 24 గంటల్లోపు వారి కుటుంబాలకు అప్పగించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. రక్షించిన ప్రతి బిడ్డకు ఆధార్ నమోదు, ధ్రువీకరణ (వెరిఫికేషన్) జరగాలని, దీని వల్ల నకిలీలను నిరోధించడానికి వీలవుతుందని కోర్టు పేర్కొంది.

More Stories
రష్యా సైన్యంలోని 49 మంది భారతీయులు మృతి
రేజర్వేషన్లు కొన్ని కుటుంబాలకే నిరంతరం.. సుప్రీం ప్రశ్నలు!
ప్రపంచంలోనే అత్యంత వేడి నగరాలలో భారత్ లో 50