ప్రపంచంలోనే అత్యంత వేడి నగరాల జాబితాలో 50 నగరాలు భారత్ లోనే ఉన్నట్లు వెల్లడైంది. శుక్రవారం ఉదయం 10.50 గంటలకు ఈ 50 నగరాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలుగా నమోదైనట్లు వాయు నాణ్యత, వాతావరణ సూచిక (ఎక్యూఐ) తెలిపింది. దేశంలోని ఉత్తర, మధ్య, తూర్పు ప్రాంతాలలో తీవ్రమైన వడగాలులు విజృంభించడంతో మధ్యాహ్నంకు ముందే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటిపోయినట్లు నివేదిక తెలిపింది.
ఒడిశాలోని బలాంగిర్ 45డిగ్రీల ఉష్ణోగ్రతతో అత్యంత వేడి ప్రాంతంగా నిలిచింది. రెండో స్థానంలో మహారాష్ట్రలోని చంద్రాపూర్ (44 డిగ్రీలు), మూడో స్థానంలో యూపీలోని ప్రయాగ్‌రాజ్ (44 డిగ్రీలు), నాలుగు, ఐదు స్థానాల్లో చత్తీస్‌గడ్‌లోని బిలాస్పూర్, మహాసముంద్ (44 డిగ్రీలు) ఉన్నాయి.
ఆరవ స్థానంలో బిహార్‌లోని బుక్సర్ (44 డిగ్రీలు), ఏడో స్థానంలో చత్తీస్‌గడ్‌లోని దుర్గ్ (44 డిగ్రీలు), ఎనిమిదో స్థానంలో బిహార్‌లోని సాసారామ్ (43 డిగ్రీలు), తొమ్మిదో స్థానంలో చత్తీస్‌గడ్‌లోని భిలాయ్ (43 డిగ్రీలు), పదో స్థానంలో యూపీలోని మీర్జాపూర్ (43 డిగ్రీలు) నిలిచాయి. ఇక ఆ తర్వాతి స్థానంలో తెలంగాణకు చెందిన జగిత్యాల ఉంది.
ఈ జాబితాలో సగానికి పైగా నగరాలు ఉత్తరప్రదేశ్ లోనే ఉండటం గమనార్హం. వారణాసి, బందా, బరేలీ, అయోధ్యల్లో మధ్యాహ్నానికి ముందే ఉష్ణోగ్రతలు 42డిగ్రీల నుండి 43 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. ఎపి, తెలంగాణల్లో భీమవరం, ఆదిలాబాద్, జగిత్యాలలు ఈ జాబితాలో నిలిచాయి. వాయువ్య, మధ్య భారతదేశ వ్యాప్తంగా వారం రోజుల పాటు తీవ్రమైన వడగాలుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. దీంతో పలు రాష్ట్రాల్లో రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేసింది.
కాగా, ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. ఎక్కడైనా పగలు వేడిగాలులు వీచినా, రాత్రిపూట చల్లని గాలులతో ఉపశమనం కలుగుతుంది. అయితే దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం రాత్రిపూట కూడా వెచ్చని గాలులు వీస్తున్నాయి. గురువారం రాత్రి గత 14 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రాత్రిపూట కూడా అత్యధిక ఉష్ణోగ్రతలతో ఢిల్లీవాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. గురువారం రాత్రి 31.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయయని ఢిల్లీ వాతావరణ శాఖ వెల్లడించింది.

More Stories
రేజర్వేషన్లు కొన్ని కుటుంబాలకే నిరంతరం.. సుప్రీం ప్రశ్నలు!
సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టుకు తల్లితండ్రులు
నీట్ ప్రశ్నపత్రం లీక్ అనుకోవడం లేదు.. ఎన్టీఏ