బజరంగ్ దళ్ ‘సాహసీ యాత్ర’తో 4 శాతం పెరిగిన హిందువులు

బజరంగ్ దళ్ ‘సాహసీ యాత్ర’తో 4 శాతం పెరిగిన హిందువులు
గత 21 సంవత్సరాలుగా బజరంగ్ దళ్ నిరంతరంగా “సాహసీ యాత్ర”ను నిర్వహిస్తూ భక్తులకు శ్రీ బాబా బుద్ఢా అమర్‌నాథ్ స్వామి దర్శనం కల్పిస్తోంది. ఈ ఆలయం కాశ్మీర్ లోయలోని భారత సరిహద్దుకు ఆనుకుని ఉన్న పూంఛ్ జిల్లాలో ఉంది. ఈ కార్యక్రమంపై విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి   మిలింద్ పరాండే మాట్లాడుతూ, 1990లలో లోయలో జిహాదీ ఉగ్రవాదం, సరిహద్దు దాటి జరిగే నిరంతర కాల్పుల కారణంగా శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ పవిత్ర యాత్ర దాదాపు నిలిచిపోయిందని తెలిపారు.
 
అయితే, ప్రస్తుతం “శ్రీ బాబా బుద్ఢా అమర్‌నాథ్ సాహసీ యాత్ర” పేరిట నిర్వహిస్తున్న ఈ వార్షిక యాత్రలో పాల్గొనే భక్తుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోందని చెప్పారు. అంతేకాక, ఆ ప్రాంతం నుంచి హిందువుల వలసలు పూర్తిగా ఆగిపోయాయని, స్థానిక హిందూ జనాభా సుమారు 4% మేర పెరిగిందని అయన సంతోషం వ్యక్తం చేశారు.  బజరంగ్ దళ్ నిర్వహించే ఈ యాత్ర కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాకుండా జాతీయ సమైక్యతకు కూడా విశేషంగా దోహదపడుతోందని  పరాండే తెలిపారు.
భారత సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికుల పట్ల గౌరవం, గర్వాన్ని వ్యక్తపరిచే యాత్రగా కూడా ఇది నిలుస్తోందని పేర్కొన్నారు.  ఈ యాత్ర ఫలితంగా యాత్రా మార్గంలోని అన్ని హిందూ పుణ్యక్షేత్రాలు పరిరక్షించబడటమే కాకుండా, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో నివసించే హిందూ మైనారిటీలలో “పలాయనం కాదు – పరాక్రమం” అనే స్ఫూర్తి పెరిగిందని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి బజరంగ్ దళ్ కార్యకర్తలు ఈ యాత్రలో పాల్గొంటారని తెలిపారు. 
 
ఈ ఏడాది యాత్ర ఆగస్టు 16 నుంచి ఆగస్టు 27 వరకు జరగనుందని వెల్లడించారు. ఆగస్టు 16, 2026 సాయంత్రం 4 గంటలకు జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ వద్ద యాత్ర ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు. ఆగస్టు 17 ఉదయం 5 గంటలకు యాత్రికులు జమ్మూ నుంచి పూంఛ్ బయలుదేరి బాబా బుద్ఢా అమర్‌నాథ్ స్వామి దర్శనం చేసుకుంటారు. 
 
ఆగస్టు 18 ఉదయం 6 గంటలకు పూంఛ్ నుంచి బయలుదేరి రెండు గంటల ప్రయాణం అనంతరం దర్శనం పూర్తి చేసి ఉదయం 10 గంటలకు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. తిరుగు ప్రయాణంలో రాజౌరి మీదుగా సుందర్‌బనిలో రాత్రి బస చేసి, మరుసటి రోజు ఉదయం 5 గంటలకు శివఖోరి దర్శనానికి బయలుదేరుతారు. అనంతరం కత్రాకు చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. 
 
ప్రతిరోజూ 4–5 రాష్ట్రాల నుంచి వచ్చిన యాత్రిక బృందాలు ఈ విధానంలో దర్శనం నిర్వహిస్తాయి. 2005లో బజరంగ్ దళ్ ఈ యాత్రను పునరుద్ధరించిన తర్వాత దేశవ్యాప్తంగా భక్తుల స్పందన గణనీయంగా పెరిగిందని  పరాండే తెలిపారు. యాత్రికుల సౌకర్యార్థం, నిర్వహణ సులభతరం చేయడానికి ఈ రోజు Budha Amarnath Portal వెబ్ పోర్టల్‌ను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్రపంచంలోని ఎక్కడి నుంచైనా భక్తులు ఈ పోర్టల్ ద్వారా యాత్రకు నమోదు చేసుకోవచ్చని చెప్పారు.