పాక్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ‘స్మార్ట్ బార్డర్’ ప్రాజెక్ట్

పాక్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ‘స్మార్ట్ బార్డర్’ ప్రాజెక్ట్

దేశంలోకి భూమార్గం ద్వారా అక్రమ చొరబాట్లను నివారించేందుకు త్వరలో దేశ సరిహద్దుల్ని ‘స్మార్ట్ బార్డర్’ ప్రాజెక్ట్ పరిధిలోకి మార్చనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు.  బిఎస్ఎఫ్ వ్యవస్థాపక డైరెక్టర్ కె.ఎఫ్. రుస్తంజీ గౌరవార్థం నిర్వహించిన ‘రుస్తంజీ స్మారక ఉపన్యాసం’లో మాట్లాడుతూ, సరిహద్దు భద్రతను పటిష్టం చేయడానికి భారతదేశం సాంకేతికత ఆధారిత వ్యవస్థలను వేగంగా అవలంబిస్తోందని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ సరిహద్దుల నుంచి అక్రమ చొరబాట్లను ఆపేందుకు ఆధునిక నిర్మాణాలు చేపడుతున్నట్లు చెప్పారు. అత్యాధునిక సెక్యూరిటీ కెమెరాలు, రాడార్లు, సెన్సర్లు, సర్వైలెన్స్ టూల్స్, రియల్ టైమ్ మానిటరింగ్ ప్లాట్‌ఫామ్స్ వంటివి ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. బంగ్లా, పాక్ సహా అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఇందుకోసం ప్రత్యేకంగా భూమిని కేటాయిస్తున్నట్లు చెప్పారు. 

ఈ ఏడాదిలోనే వీటిని ఏర్పాటు చేస్తామని చెబుతూ ఇందుకోసం పశ్చిమ బెంగాల్‌లో కూడా ప్రభుత్వం భూమిని కేటాయించిందని పేర్కొన్నారు. కొత్త నిర్మాణాల ద్వారా అక్రమ చొరబాట్లను వెంటనే గుర్తించి అడ్డుకోవచ్చని హోంమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, సరిహద్దులో డ్రోన్ యాక్టివిటీస్, పశువులు అక్రమ రవాణా, డ్రగ్ ట్రాఫికింగ్ సహా ఎలాంటి అనుమానాస్పద కదలికలనైనా వెంటనే గుర్తించవచ్చని తెలిపారు. ఎలాంటి చొరబాటు, చర్యను గమనించినా వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి అలర్ట్ వెళ్తుందని వెల్లడించారు. 

నక్సలిజం సమస్యపై షా మాట్లాడుతూ, ప్రభుత్వ వ్యూహం ఇప్పుడు నిర్ణయాత్మక ఫలితాలను చూపిస్తోందని చెప్పారు. “ఐదు దశాబ్దాలుగా కొనసాగిన సమస్య ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది.భారతదేశం నక్సల్ రహిత దేశంగా మారే దిశగా వేగంగా పయనించింది. మన సిబ్బంది క్షేత్రస్థాయిలో దీనిని నిరూపించారు” అని తెలిపారు. 

ఒక సమస్యను కేవలం నియంత్రించడం సరైన భద్రతా విధానం కాదని, దానిని మూలాల నుండి నిర్మూలించడమే నిజమైన పరిష్కారం,”  అని అమిత్ షా చెప్పారు. సరిహద్దు ముప్పులపై గట్టి సందేశం ఇస్తూ, ఆయన  “ప్రతిసారీ ఉగ్రవాదం, చొరబాట్లకు భారతదేశం గట్టిగా ప్రతిస్పందించింది. మనం పాకిస్థాన్‌కు మూడుసార్లు సమాధానమిచ్చాము. అవసరమైతే, వారి భూభాగంలోకి కూడా చొచ్చుకుపోతాము” అని హెచ్చరించారు. 

సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్)కు ఇకపై మరిన్ని పెద్ద బాధ్యతలు అప్పగించనున్నట్లు హోం మంత్రి ప్రకటించారు. అక్రమ సరిహద్దు కార్యకలాపాలను అరికట్టడానికి బిఎస్ఎఫ్ స్థానిక పరిపాలనతో కలిసి పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. పట్వారీ స్థాయి కార్యాలయాల నుండి జిల్లా పరిపాలన వరకు, ముఖ్యంగా భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి సమన్వయం బలోపేతం చేస్తామని తెలిపారు. 

చొరబాటుదారులను ఆపడం లేదా వెనక్కి నెట్టడమే కాకుండా, అక్రమ ప్రవేశ ప్రయత్నాలను మూలాల నుండి నిర్మూలించడానికి బిఎస్ఎఫ్ కృషి చేస్తుందని షా తెలిపారు. అస్సాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతాలలో భద్రతను మరింత పటిష్టం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని అమిత్ షా తెలిపారు. సరిహద్దు భద్రతా ప్రాజెక్టులలో ఏవైనా అడ్డంకులు తలెత్తితే, పరిపాలన యంత్రాంగం బిఎస్ఎఫ్ కు గట్టిగా అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.