* యాక్సిస్ మై ఇండియా అధినేత ప్రదీప్ గుప్తా
భారత దేశ రాజకీయాల్లో కనీసం మరో 20 ఏళ్ళ పాటు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధిపత్యం కొనసాగవచ్చని ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు, యాక్సిస్ మై ఇండియా అధినేత ప్రదీప్ గుప్తా భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల బలం దాని పాలన తీరు, ప్రజల అంచనాలతో గాఢంగా ముడిపడి ఉందని ఆయన ఓ ప్రముఖ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
“భారత రాజకీయాలు సాధారణంగా సుదీర్ఘమైన రాజకీయ ఆధిపత్య చక్రాల్లో పయనిస్తుంటాయి. ప్రస్తుతం బీజేపీ అటువంటి ఒక దశ మధ్యలో ఉంది. రాజకీయాల్లో ప్రతి పార్టీకి ఒక పరిమితి ఉంటుంది. గతంలో 1977 వరకు కాంగ్రెస్ నిరంతరాయంగా దేశాన్ని పాలించింది. ఆ తర్వాత ఆ పార్టీ ఇబ్బందులను ఎదుర్కోవడం ప్రారంభించింది. అప్పట్లో సుమారు 20 ఏళ్ల పాటు కొనసాగే ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్‌ను చూసేవాళ్లం” అని ఆయన గుర్తు చేశారు.
బీజేపీ సమర్థవంతమైన పాలనను అందిస్తూనే తన పనితీరులో క్షీణత లేకుండా చూసుకున్నంత కాలం రాబోయే అనేక సంవత్సరాల పాటు భారత రాజకీయాల్లో ఆ పార్టీ కేంద్ర శక్తిగా కొనసాగే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఎన్నికల్లో ఆధిపత్యం సహజంగానే ప్రజల నిశిత పరిశీలనను, అంచనాలను పెంచుతుందని ఆయన హెచ్చరించారు.
రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించే ప్రతి రాజకీయ శక్తి కూడా చివరికి ప్రజల అంచనాల భారం వల్ల కలిగే ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం బీజేపీపై ప్రజలకు అంచనాలు భారీగా పెరిగాయని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న రాజకీయ సవాళ్ల గురించి ప్రస్తవాసితు గతంలో ఆ పార్టీ తన దుష్పరిపాలనకు సంబంధించిన భారాన్ని ఇంకా మోస్తోందని ప్రదీప్ గుప్తా తెలిపారు.
ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందడానికి కాంగ్రెస్‌కు మరికొన్నేళ్ల సమయం పట్టొచ్చని పేర్కొంటూ కాంగ్రెస్ సుమారు మరో 15 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉంటుందని చెప్పారు. స్వల్పకాలిక రాజకీయ కథనాల కంటే పరిపాలన, ఓటర్ల అభిప్రాయంపైనే బీజేపీ, ప్రతిపక్షాల రాజకీయ భవిష్యత్తు అంతిమంగా ఆధారపడి ఉంటుందని తెలిపారు.
తమిళనాడులో విజయ్ గెలుపు ముందే అంచనా
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు ఏడాది ముందే రాష్ట్రంలో విజయ్ ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతున్న విషయాన్ని తమ ఏజెన్సీ ‘యాక్సిస్ మై ఇండియా’ గుర్తించిందని ప్రదీప్ గుప్తా తెలిపారు. రాష్ట్రంలో పాతుకుపోయిన ద్రవిడ పార్టీలకు విజయ్ను విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా ఓటర్లు ఎక్కువగా చూడటంతో ఆయనకు మద్దతు క్రమంగా పెరిగిందని తెలిపారు.
మిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు సుమారు 25 శాతంగా ఉన్న విజయ్ ఓటు బ్యాంకు, పోలింగ్ రోజు నాటికి 35 శాతానికి పెరుగుతుందని అంచనా వేశామని ఆయన గుర్తు చేశారు. మూడు నెలల క్రితం అది 28 శాతానికి, ఆ తర్వాత సుమారు నెల రోజుల క్రితం 30 శాతానికి పెరిగిందని, ఇక పోలింగ్ రోజు నాటికి అది 35 శాతానికి చేరిందని ఆయన వివరించారు.
టివీకే పార్టీ 118 సీట్ల మెజారిటీ మార్కును దాటుతుందా? లేదా? అనే సందేహం తమకు వచ్చిందని తెలిపారు. అందుకే ఎగ్జిట్ పోల్స్‌లో టీవీకే 98-120 వరకు గెలుస్తుందని అంచనా వేశామని చెప్పారు. ఓట్ల వాటాలో 2 శాతం తేడా కూడా సీట్ల ఫలితాలను మార్చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
యుపిలో బీజేపీ పాలన పట్ల సంతృప్తి, పంజాబ్ లో మిశ్రమ స్పందన
కాగా, ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికార బీజేపీ పాలన పట్ల ప్రజలు సంతృప్తితో ఉన్నారని ప్రదీప్ గుప్తా వివరించారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే యూపీలో బీజేపీకి 2027లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదన్నారు. అదే సమయంలో, ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయంగా అస్థిరంగా ఉందని, ఓటర్ల మనోభావాలలో వేగవంతమైన మార్పులు జరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
మరోవంక, పంజాబ్‌లో అధికార ఆప్ పాలన పట్ల ప్రజలు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారని చెబుతూ రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, శిరోమణి అకాలీదళ్‌లతో మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంటుందని చెప్పారు. అందువల్ల అక్కడి రాజకీయ ముఖచిత్రం మరింత క్లిష్టంగా మారిందని వెల్లడించారు. ఇటువంటి బహుకోణపు పోటీలో, ప్రతిపక్షాల ఓట్లు చీలిపోతే తక్కువ శాతం ఓట్లు వచ్చినప్పటికీ, అధికార పక్షం విజయం సాధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం 15 ఏళ్లుగా దుష్పరిపాలన సాగించి ప్రజల్లో భయాందోళనలను సృష్టించడం వల్లనే ఎన్నికల్లో టీఎంసీ చిత్తుగా ఓడిపోయిందని ఆయన అంచనా వేశారు. అక్కడ బీజేపీ విజయం ప్రధానంగా హిందూ ఓట్ల ఏకీకరణ వల్ల సాధ్యమైందన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. ప్రధాని మోదీ ప్రజాకర్షణ శక్తి, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ల సంస్థాగత సామర్థ్యాలు బంగాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చాయని వివరించారు.

More Stories
ప్రత్యామ్నాయ ఇంధన వనరులను తక్షణమే అన్వేషించాలి
సందేశ్‌ఖాలిలో కిరాతకంపై తిరగబడ్డ రేఖా పాత్ర
జనసేన ఫిర్యాదుతో ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసు