ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) అత్యున్నత పురస్కారమైన ‘అగ్రికోలా పతకం’ అందుకున్న రెండవ భారత ప్రధాని అయ్యారు. 2008లో మన్మోహన్ సింగ్ తర్వాత ఈ పురస్కారాన్ని అందుకున్నది ఆయనే. భారతదేశంలో వ్యవసాయ అభివృద్ధిని ప్రోత్సహించడంలో, ఆకలి, పేదరికాన్ని తగ్గించడంలో సింగ్ “అసాధారణమైన దార్శనికత మరియు సంకల్పం” ప్రదర్శించారని ఆ సమయంలో ఎఫ్ఏఓ పేర్కొంది.
“ఇది ఆహార భద్రత, సుస్థిర అభివృద్ధి పట్ల భారతదేశానికి ఉన్న అచంచలమైన నిబద్ధతను, అలాగే మన వ్యవసాయ రంగానికి సంబంధించిన వారి కృషిని ప్రతిబింబిస్తుంది,” అని పురస్కారాన్ని అందుకుంటూ ప్రధాని మోదీ ఎక్స్ లో తెలిపారు. రోమ్‌లోని ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయంలోని ప్లీనరీ హాల్లో జరిగిన ఒక కార్యక్రమంలో, ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్ అయిన క్వూ డోంగ్యూ ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేశారు.
“ప్రజలందరి సంక్షేమానికి మోదీ చేసిన కృషి. నిబద్ధత”కు గుర్తింపుగా ఈ పతకాన్ని ప్రదానం చేసినట్లు ఎఫ్ఏఓ అధిపతి తన ప్రసంగంలో తెలిపారు. ఐక్యరాజ్యసమితి సంస్థ ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకోవడానికి ప్రధాని నెరవేర్చిన అనేక ప్రమాణాలను కూడా ఆయన పేర్కొన్నారు.
“ఆయన పదవీకాలంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి, ఆహార భద్రతను బలోపేతం చేయడానికి, రైతుల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి చారిత్రాత్మక పథకాలను ప్రవేశపెట్టడం; ఆకలి, పేదరికంపై పోరాటం, సార్వత్రిక ఆహార భద్రత సాధించడం వంటి ఎఫ్ఏఓ ప్రాథమిక లక్ష్యాలకు మద్దతు ఇవ్వడం; ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడం; భారతదేశం జీ20 అధ్యక్షత వహించిన కాలంతో సహా అంతర్జాతీయ అజెండాలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిచ్చేందుకు ఆయన చేసిన కృషి, నిబద్ధతకు గుర్తింపుగా ఈ పతకాన్ని ప్రదానం చేస్తున్నాం,” అని డోంగ్యూ వివరించారు.
ఈ విజయాన్ని ప్రధాని మోదీ భారత రైతులకు అంకితం చేశారు. “ఇది కేవలం నాకు మాత్రమే దక్కిన గౌరవం కాదు, భారతదేశంలోని కోట్లాది మంది రైతులకు, పశుపోషకులకు, మత్స్య పెంపకందారులకు, వ్యవసాయ శాస్త్రవేత్తలకు, మన కార్మికులకు దక్కిన గౌరవం. మానవ సంక్షేమం, ఆహార భద్రత, సుస్థిర అభివృద్ధి అనేవి కేంద్రంగా ఉన్న భారతదేశ నిబద్ధతకు కూడా ఇది ఒక గౌరవం,” అని డోంగ్యూ, ఎఫ్ఏఓలకు ధన్యవాదాలు తెలుపుతూ ఆయన పేర్కొన్నారు.
భారతదేశం కేవలం ఉత్పత్తిని పెంచడానికే కాకుండా, సుస్థిరమైన, వాతావరణ మార్పులను తట్టుకోగల, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే వ్యవసాయ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి కూడా కృషి చేస్తోందని ప్రధాని మోదీ వివరించారు. అందుబాటులో ఉన్న సాగుభూమి నుండి దిగుబడిని గరిష్ఠ స్థాయికి చేర్చడానికి ‘ప్రతి బొట్టుకు అధిక పంట’, సూక్ష్మ నీటిపారుదల, ప్రెసిషన్ ఫార్మింగ్ వంటి ప్రచార కార్యక్రమాలను ఆయన ఉదాహరణలుగా పేర్కొన్నారు.
“భారతీయ సంస్కృతిలో వ్యవసాయం కేవలం పంటలు పండించే మాధ్యమం మాత్రమే కాదు. మానవులకు, భూమాతకు మధ్య ఉన్న లోతైన, పవిత్రమైన బంధానికి ప్రతీకగా దీనికి హోదా కల్పించబడింది,” అని ఆయన వివరించారు. “భారతీయ సంస్కృతిలో భూమిని తల్లిగా భావిస్తారు. రైతును భూమిపుత్రుడిగా గౌరవిస్తారు. వేల ఏళ్ల సంప్రదాయం నేటి వ్యవసాయ విధానాలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తోంది” అని తెలిపారు

More Stories
ప్రభుత్వాల నుండి దేవాలయాల విముక్తిపై జులైలో `సుప్రీం’ విచారణ
సిఎఎ పరిధిలోకి రాని ప్రతి ఒక్కరూ చొరబాటుదారులే
అభిషేక్ బెనర్జీకి కోల్‌కతాలో 43 అక్రమ ఆస్తులు