జలమండలి జీఎం అక్రమాస్తులు వంద కోట్లపైనే!

జలమండలి జీఎం అక్రమాస్తులు వంద కోట్లపైనే!
 
గ్రేటర్‌ హైదరాబాద్‌కు తాగునీటిని సరఫరా చేస్తున్న జలమండలిలో జీఎం హోదా కలిగిన అధికారి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేయగా అతడి అవినీతి విశ్వరూపం బహిర్గతమైంది. ఆ ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ. 5.88 కోట్లుగా గుర్తించగా బహిరంగ మార్కెట్‌లో దాదాపు రూ. 100 కోట్లకి పైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
 
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్‌ జలమండలిలో ప్రాజెక్టు డివిజన్‌-3 జీఎంగా పనిచేస్తున్న సగ్గం అనంతలక్ష్మి కుమార్‌ ఏసీబీకి చిక్కారు. మంగళవారం తెల్లవారుజామున ఆరు గంటల సమయంలో ఏసీబీ అధికారుల బృందం మల్లాపూర్‌ వెంకటరమణ కాలనీలోని కుమార్‌ ఇంటికి చేరుకొని సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, సికింద్రాబాద్‌తోపాటు నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని కుమార్‌ బంధువులు, స్నేహితులకు చెందిన 8 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు. 
 
ఆ అధికారి ఇంట్లో ఏకంగా రూ.1.1కోట్ల నగదు, రెండు కిలోలకు పైగా బంగారు ఆభరణాలు, తొమ్మిది కిలోలకు పైగా వెండి ఆభరణాలతో పాటు అనేక చోట్ల ప్లాట్లు, ఇండ్ల స్థలాలు, వ్యవసాయ భూములు ఉన్నట్లు తేలింది. ఒక జీఎం స్థాయి అధికారి ఇంట్లో అంతపెద్ద మొత్తం అవినీతి సొమ్ము దొరకడంతో ఏసీబీ అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. నోట్ల కట్టలు కుప్పలు తెప్పలుగా దొరుకుతుండటంతో మిషన్ల ద్వారా లెక్కించారు. 
 
వెతుకుతున్న కొద్ది నోట్ల కట్టలు, బంగారు, వెండి ఆభరణాలు లభించడంతో అధికారులు షాకయ్యారు.   సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాల, మరికొన్ని గ్రామాలతోపాటు నిజామాబాద్‌ జిల్లా నవీపేటలో కుమార్ బినామీల పేరిట ఉన్న వ్యవసాయ భూములను ఏసీబీ గుర్తించింది. అధికారుల బృందాలు ఆయా ప్రాంతాల్లో వివరాలు సేకరించాయి. హైదరాబాద్‌ శివారు చేర్యాలలోని భూముల విలువ భారీగా ఉన్నట్లు తెలుస్తోంది.
 
నవీపేటలో మూడున్నర ఎకరాలు సహా 400 చదరపు గజాల్లో కొబ్బరితోటతో కూడిన ఫాంహౌస్‌ను గుర్తించారు. అనంత లక్ష్మి కుమార్‌ ఇంట్లో ఇటీవల జరిగిన వివాహంపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. పెళ్లిలో పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసినట్లు గుర్తించారు. వీడియోల ఆధారంగా ఆ వ్యయాన్ని అంచనావేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. 
 
కుమార్‌తోపాటు కుటుంబ సభ్యుల పేరిట బ్యాంకు లాకర్లు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు భార్య సహా ముగ్గురు కుటుంబ సభ్యులను బ్యాంకువద్దకి తీసుకెళ్లి లాకర్లు తెరిపించారు. వాటిలో బంగారు నగలతోపాటు కొన్ని దస్తావేజులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సోదాల అనంతరం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కుమార్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు.